
సాక్షి,హైదరాబాద్ : రాచకొండలో అంతర్‌రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురి పోలీసులతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం.. ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను.. ముక్కు పచ్చలారని పసికందుల్ని అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. ఇందులో భాగంగా నిందితులు గుజరాత్‌లో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులకు డబ్బులు ఎరవేస్తున్నారు. మెడికల్ ప్రతినిధుల ద్వారా బేరసారాలు జరిపి అప్పుడే పుట్టిన పిల్లల్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తెస్తున్నారు. నగరంలో ఆడ శిశువును రూ.2.5 లక్షలకు, మగ శిశువును రూ 4.5లక్షలకు విక్రయిస్తున్నారు.
అయితే, ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులని సైతం నిందితులుగా చేర్చారు.

Comments
Please login to add a commentAdd a comment