
పిల్లల అక్రమ రవాణా చట్టరీత్యా నేరం
విక్రయం, కొనుగోలు రెండూ శిక్షార్హమే
తల్లిదండ్రుల ఆశలతో వ్యాపారం చేస్తున్న దళారులు
సాక్షి, హైదరాబాద్: అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన.. తల్లినయ్యానంటూ చెప్పాలనే కోరిక.. తండ్రిగా బిడ్డ వేలుపట్టి నడిపించాలనే తహతహ కొందరు దంపతులను అక్రమ మార్గంలో నడిచేలా చేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా, చికిత్సలు చేయించుకున్నా వేధిస్తున్న సంతానలేమి సమస్యలు, వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో సమాజంలో చిన్నచూపు, చట్టబద్ధంగా పిల్లల దత్తతకు(Child Adoption) ఏళ్ల కాలం పాటు పట్టే సమయం వెరసీ.. దళారుల మాటలు నమ్మేలా చేస్తున్నాయి.
విద్యావంతులు, గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారు సైతం అక్రమ మార్గంలో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులకు నవజాత శిశువులను విక్రయిస్తున్న రెండు ముఠాలను మంగళవారం రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పిల్లలను విక్రయించే నేరస్తులపైనే కాదు శిశువులను కొనుగోలు చేసిన బాధిత తల్లిదండ్రుల పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా పిల్లల దత్తత ఎంత అవసరమో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ‘కారా’..
పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ‘కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ’ (కారా) పని చేస్తోంది. ఈ ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు పని చేస్తాయి. అసహాయ పరిస్థితులు, ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన, అప్పగించిన పిల్లలను శిశు సంక్షేమశాఖ అధికారులు చేరదీస్తారు. వీరినే దత్తత ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో శిశువిహార్, జిల్లా స్థాయిలో శిశుగృహాలు ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. ఆరేళ్లు దాటితే శిశుగృహాల నుంచి బాలసదన్‌కు పంపించి చదువు నేరి్పస్తారు. చిన్నారుల దత్తత కోసం నమోదు చేసుకున్నాక వచి్చన సీనియారిటీ, పిల్లల వయసు, ఆడ, మగ, ఆరోగ్యం తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే దత్తతకు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుంది.
బంధువుల పిల్లల దత్తతకూ అనుమతి తప్పనిసరి..
ఇలాంటి చిన్నారులే కాదు బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలన్నా ‘కారా’ ద్వారా అనుమతి పొందాల్సిందే. దంపతుల వయసు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు. కనీసం రెండేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న వారే అర్హులు. సింగిల్ పేరెంట్ అయితే మహిళ మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హురాలు. పురుషులు దత్తత తీసుకోవడానికి చట్టం అనుమతించదు. కేరింగ్స్ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులు కుటుంబ పరిస్థితులు, తనిఖీ చేసిన అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) నివేదిక అందిస్తుంది. అనంతరం ‘కారా’ ప్రాథమిక అనుమతి లేఖను ఇస్తుంది. అప్పుడు డీసీపీయూ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ పరిశీలించాక జిల్లా కలెక్టరు దత్తత ఆదేశాలు జారీచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment