అక్కడ బాలికలకు టీకామందు ఉచితం!
ముంబైః చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజారోగ్యకేంద్రాల్లో రోగ నిరోధక వ్యాక్సిన్లు ఇస్తుంటారు. కొన్ని రకాల జబ్బులు శరీరంలోకి ప్రవేశించినపుడు వాటి ప్రభావం వ్యక్తులపై చూపించకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లను చిన్న వయసులోనే అందిస్తారు. వ్యాధులను కలుగజేసే సూక్ష్మజీవులతో పోరాడేందుకు యాంటీ బాడీలు శరీరంలో అభివృద్ధి పరిచేందుకు ఈ వ్యాక్సిన్లు సహకరిస్తాయి. అటువంటి వ్యాక్సిన్లు ఖరీదు ఎక్కువగా ఉండటంతో పేదలు, మధ్యతరగతివారు పిల్లలకు సరైన వయసులో వ్యాక్సిన్లు వేయించలేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. వారికోసం ఇప్పుడు పూనే ఆస్పత్రి నడుం బిగించింది. ఐదేళ్లలోపు బాలికలకు ఉచితంగా టీకా మందు వేసేందుకు ముందుకొచ్చింది.
ట్రెండ్ సెట్టింగ్ మెడిసిన్ ఫౌండేషన్ గా పేరుతెచ్చుకున్న పూనె మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికేర్ ఫౌండేషన్.. బాలికలకు ఉచిత టీకా మందును అందించేందుకు శ్రీకారం చుట్టింది. కొత్త సదుపాయాన్ని ప్రారంభించిన మొదటి రోజే కొత్తగా పుట్టినవారితో సహా కనీసం ఇరవై మంది పిల్లలకు ఉచిత వ్యాక్సినేషన్ సేవలు అందించింది. ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో పుట్టిన పిల్లలే కాక ఐదేళ్ళలోపు బాలికలందరికీ తమ సంస్థ ఉచితంగా టీకా మందును అందిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు గణేష్ రాక్ తెలిపారు. వివిధ రకాల జబ్బులకు వ్యతిరేకంగా పనిచేసేందుకు, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తికోసం ఐదేళ్ళలోపు పిల్లలందరికీ ఈ టీకాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కనీసం రూ.30,000 వరకూ ఖరీదుచేసే టీకాలతోపాటు ఎటువంటి వైద్య ఖర్చులు లేకుండా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు రాక్ వెల్లడించారు.
పిల్లలకు ఇచ్చే వాక్సిన్ లలో ముఖ్యంగా న్యుమోనియా వాక్సిన్ ఒక్కటే రూ.16,000 వరకూ ఉంటుందని, ఇంతటి ఖరీదైన టీకాను దిగువ, మధ్య తరగతి ప్రజలు డబ్బు వెచ్చించి వేయించలేరని, అందుకే ఈ ఉచిత సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆస్పత్రి గైనకాలజిస్ట్ అనిల్ ఛవాన్ తెలిపారు. ఐదేళ్ళలోపు పిల్లలకు వ్యాక్సిన్లన్నీ తప్పనిసరిగా వేయించాలని, అవి అనేక రకాలైన రోగాలను రాకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడతాయని ఛవాన్ తెలిపారు.
ముఖ్యంగా ఇండియా, చైనాలు బాలికలకు వాక్సినేషన్ ఇవ్వడంలో అశ్రద్ధ వహించడంతో మరణాల రేటు 75 శాతం పెరుగుతున్నట్లు, వారిలో ఊపిరితిత్తుల సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ ఓ 2012 నివేదికల ప్రకారం తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో బాలికలకు భారీ సమస్యలు ఎదురుకాకుండా, సరైన టీకా మందును ఇవ్వడంలో తాము చొరవ తీసుకున్నట్లు రాక్, ఛవాన్లు చెప్తున్నారు. వ్యాక్సిన్ మగపిల్లలకు కూడ తప్పనిసరిగా వేయించాలని, అయితే మగపిల్లల విషయంలో చూపిన శ్రద్ధ కుటుంబాల్లో ఆడపిల్లలపట్ల కనిపించదని రాక్ తెలిపారు. ఇతర ఆసుపత్రులు కూడ ఇటువంటి చొరవ తీసుకొని, బాలికలకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడం గాని, లేదంటే కనీసం కొంతశాతం డిస్కౌంట్లను అందించినా.. పేదలు టీకాలను వేయించేందుకు ముందుకు వస్తారని రాక్ తెలిపారు. మూడు సంవత్సరాలక్రితం ఆస్పత్రిలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఫౌండేషన్, గతేడాది యాసిడ్ దాడులు, కాలిన గాయాలతో బాధపడే మహిళలకు కూడ పూర్తి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించింది. తాజాగా ప్రతి బాలికకూ ఉచిత వ్యాక్సిన్ అందిస్తూ ఇతర ఆస్పత్రులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.