
వాషింగ్టన్: అక్రమ వలసవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు(డిపోర్టేషన్). అందులో ఈ రెండ్రోజుల్లోనే రెండు వేలమందిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. దీంతో.. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. అయితే..
అయితే.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.
మరోవైపు.. ఎఫ్ 1 వీసాల ఆధారంగా వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వణికిపోతున్నారు. యూనివర్సిటీలతో, తమ కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
అయితే.. ఏదిఏమైనా.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చర్యలు ముందుకు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున విమానాల ద్వారా స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయన్నారు. అయితే.. ఆ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ట్రంప్ దారికి తెచ్చుకుంటుండడం గమనార్హం.
సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్‌సాల్వడార్ వంటి దేశాలుఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే..ఇప్పుడు వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment