deportion
-
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
నగ్నంగా ఫొటో ఫోజులు.. మన్నించండి పెద్ద తప్పే చేశా!
జకార్తా: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల అతి చేష్టలు ఒక్కోసారి హద్దు దాటిపోతుంటాయి. ఆ సమయంలో విమర్శలు వచ్చినా.. తమను తాము సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో.. ఒకావిడకు అలాంటి అవకాశం లేకుండా చేశారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ చెట్టును బాలి(ఇండోనేషియా) టబనన్ ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి చెట్టు దగ్గర ఓ రష్యా జంట అత్యుత్సాహంతో వెకిలి పనులకు పాల్పడింది. నగ్నంగా ఫోట్ షూట్ చేసింది. బాబకన్ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్ ఫోటోషూట్ చేసింది ఆ జంట. అలినా ఫజ్లీవా అనే ఇన్స్టాగ్రామ్ మోడల్ నగ్నంగా చెట్టు సమక్షంలో ఫోజులు ఇవ్వగా.. ఆమె భర్త అండ్రే ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇంకేం బాలినీస్ హిందూ వర్గాలకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్ల దృష్టిలో పర్వతాలు, చెట్లు, సహజ వనరులను పవిత్రంగా భావిస్తుంటారు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. రష్యా ఇన్ఫ్లుయెన్సర్ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెల్లగొట్టారు. శుక్రవారం వాళిద్దరినీ దగ్గరుండి సాగనంపారు పోలీసులు. ఇక ఈ ఘటనకుగానూ శిక్షగా ఆరు నెలలపాటు ఈ జంటను ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వరు. వెళ్లగొట్టే ముందు వాళ్లు ఫొటో షూట్ చేసిన పవిత్రమైన చోటుని.. వాళ్లతోనే శుభ్రం చేయించారు. తాము చేసిన పనికి క్షమాపణలు చెబుతూ అలీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచడంతో పాటు ఓ వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఇండొనేషియాలోనే పోయిన నెలలో కెనడా నటుడు ఒకడు.. నగ్నంగా బటూర్ పర్వతంపై సంచరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. అతన్ని కూడా అరెస్ట్ చేయకుండా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. -
దాదాపు 2 లక్షల మంది ఉక్రెయిన్ పిల్లలు రష్యాకు తరలింపు
2 lakh children among 11 lakh Ukrainians: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం ఎప్పటికి తెరపడుతుందో అన్నది అర్థం కానీ ప్రశ్నగా మారింది. మరోవైపు ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్ దాదాపు రెండు లక్షల మంది పిల్లలతో సహా సుమారు 1.1 మిలియన్లమంది ఉక్రెనియన్లు రష్యాకు బలవంతంగా తరలింపబడ్డారని ఆరోపించింది. ఐతే ఫిబ్రవరి 24 నుంచి పది లక్షల మంది ఉక్రెనియన్లు బలవంతంగా రష్యాకు బహిష్కరింపబడ్డారని మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైగా కీవ్ అధికారుల భాగస్వామ్యం లేకుండా ఒక వెయ్యి మంది పిల్లలతో సహా సుమారు 11 వేల మంది సోమవారం ఉక్రెయిన్ నుంచి రష్యాలోకి రవాణా చేయబడ్బారని, వారంతా రష్యా మద్దతుతో విడిపోయిన ప్రాంతాలకు చెందిన వారని వెల్లడించింది. ప్రజలు తమ స్వంత ఇష్టంతోనే రష్యాకు తరలింపబడ్డారని మాస్కో చెబుతోంది. ఐతే యుద్ధ ప్రారంభమైనపపటి నుంచి మాస్కో వేలాది మందిని బలవంతంగా రష్యాకు బహిష్కరించిందని ఉక్రెయిన్ పేర్కొనడం గమనార్హం. అదీగాక మాస్కో ఉక్రెయిన్‌లోని తన చర్యలను స్పెషల్ ఆపరేషన్‌గా సమర్ధించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఐక్యరాజ్యసమితి రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ ఆపరేషన్‌లో భాగంగా, ముట్టడి చేయబడిన మారిపోల్ ఓడరేవులోని ఒక పెద్ద ఉక్కు కర్మాగారం నుంచి ఖాళీ చేయబడిన పౌరులు ఉక్రేనియన్ ఆధీనంలో ఉన్న జపోరిజ్జియా నగరానికి చేరుకున్నారు. (చదవండి: హిట్లర్‌లోనూ యూదుల రక్తం అంటూ.. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యల దుమారం) -
దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా
సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్ అలీతో 2008లో రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్‌అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. చదవండి: (సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్ సిబ్బంది) సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
అమెరికాలో 161 మంది భారతీయులు అరెస్ట్!
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను యూఎస్ఏ వెనక్కి తిప్పి పంపించనుంది. వీరందరూ మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. తప్పుడు మార్గంలో దేశంలోకి ప్రవేశించిన కారణంగా వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ప్రత్యేకమైన విమానం ద్వారా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కి పంపించనున్నారు. వీరిలో అత్యధికంగా 76 మంది హర్యానా నుంచి వెళ్లగా , తరువాతి స్ధానంలో పంజాబ్ నుంచి 56 మంది, గుజరాత్ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 5 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున వెళ్లగా ఆంధ్రప్రదేశ్, గోవా నుంచి ఒక్కొక్కరు వెళ్లారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో హర్యానా నుంచి వెళ్లిన 19 యేళ్ల యువకుడు కూడా ఉన్నాడు. (తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్.. ) దాదాపు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 1739 మంది భారతీయులు ప్రస్తుతం 95 జైళ్లలో మగ్గుతున్నారని నార్త్ అమెరికన్ పంజాబ్ ఆసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చహల్ తెలిపారు. 2018లో 611 మందిని అమెరికా దేశం నుంచి తిప్పి పంపించేయగా, 2019లో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగి 1616కి చేరుకుందని తెలిపారు. నార్త్ ఇండియాలో ముఖ్యంగా పంజాబ్‌లో ఇలా మనుషులను అక్రమంగా విదేశాలకు పంపిస్తూ ఉంటారని తెలిపారు. ఇలాంటి ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి 35 నుంచి 50 లక్షలు తీసుకొని వారిని ఇతర దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తారని చహల్ తెలిపారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎవరూ కూడా ఇలాంటి వారి చేతుల్లో మోసపోవద్దని చహల్ కోరారు. (స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) -
మాటవినలేదని కుటుంబం వెలివేత
కొత్తపట్నం: ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ కుటుంబాన్ని ఊరంతా వెలేసింది. బాధితుడు తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పోలీసులు 26 మందిని బైండోవర్ చేశారు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలేనికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఇళ్ల స్థలమై వివాదం చోటుచేసుకుంది. బాధితులు సమస్యను గ్రామ కాపులు, పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇది రెవెన్యూ సమస్యని, తమకు సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు. ఈ వివాదం చోటుచేసుకున్న సుమారు 15 రోజుల తర్వాత ఇంటి స్థల వివాదంలోని ఒకరైన వలేటి మనోజ్ విజయ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బంగారమ్మ దగ్గర మూడేళ్ల కిందట రూ.లక్ష వడ్డీకి తీసుకున్నాడు. నోటు గడువు ముగియడంతో ఆమె అసలు, వడ్డీ ఇవ్వాలని మనోజ్ విజయ్ను అడగడంతో కరోనా వైరస్ ప్రభావంతో తన దగ్గర లేవని చెప్పాడు. దీంతో బంగారమ్మ తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలు, కాపుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. కాపులు మనోజ్ విజయ్ను పంచాయతీకి రావాలని పిలిచారు. దీంతో ‘నా ఇంటి స్థలం సమస్యను కాపులు, గ్రామ పెద్దలు పరిష్కరించనప్పుడు వడ్డీ డబ్బుల సమస్య ఏవిధంగా పరిష్కరిస్తారు.. నేను రాను’ అని మనోజ్ చెప్పాడు. కాపుల మాట వినలేదు కనుక ఈ గ్రామంలో అతనితో ఎవ్వరూ మాట్లాడొద్దని, షాపుల్లో సరుకులు కూడా ఇవ్వొద్దని ఆ కుటుంబాన్ని వెలేశారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవ్వరూ మాట్లాడటం లేదని, షాపుల దగ్గరకు వెళ్తే సరుకులు ఇవ్వడం లేదంటూ తన దయనీయ స్థితిని బాధితుడు ఫేస్బుక్, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. వీడియోలను చూసిన తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావు, రెండో పట్టణ సీఐ రాజేష్, ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు గురువారం గ్రామస్తులను పిలిపించి వెలివేయడం సామాజిక నేరమని, అందరూ ఐక్యంగా ఉండాలంటూ అవగాహన కల్పించారు. అయినా తీరు మారకపోవడంతో శుక్రవారం ఇరువర్గాలను రెండో పట్టణ సీఐ సమక్షంలో విచారించి వారికి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సారి వెలివేయడం లాంటివి చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తూ 26 మంది గ్రామ పెద్దలు, కాపులను బైండోవర్ చేశారు. అలాగే బంగారమ్మకు ఇవ్వాల్సిన రూ. లక్షకు వడ్డీ కలిపి ఇవ్వాలని మనోజ్ విజయ్‌కు సూచించారు. -
అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ అడిగిన ప్రశ్నకు అమిత్ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. -
ఛోటా రాజన్ తరలింపు ఆలస్యం?
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశముంది. ఇండోనేసియా నుంచి మంగళవారం రాత్రి ఛోటా రాజన్‌ను స్వదేశానికి తరలించాలని భారత అధికారులు ప్రయత్నించారు. అయితే బాలి సమీపంలో అగ్ని పర్వతం పేలడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ అధికారులు ఇండోనేసియా వెళ్లారు.