
జకార్తా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల అతి చేష్టలు ఒక్కోసారి హద్దు దాటిపోతుంటాయి. ఆ సమయంలో విమర్శలు వచ్చినా.. తమను తాము సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో.. ఒకావిడకు అలాంటి అవకాశం లేకుండా చేశారు.
ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఓ చెట్టును బాలి(ఇండోనేషియా) టబనన్ ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి చెట్టు దగ్గర ఓ రష్యా జంట అత్యుత్సాహంతో వెకిలి పనులకు పాల్పడింది. నగ్నంగా ఫోట్ షూట్ చేసింది. బాబకన్ గుడిలోని ఆ మర్రిచెట్టు దగ్గర న్యూడ్ ఫోటోషూట్ చేసింది ఆ జంట.
అలినా ఫజ్లీవా అనే ఇన్‌స్టాగ్రామ్ మోడల్ నగ్నంగా చెట్టు సమక్షంలో ఫోజులు ఇవ్వగా.. ఆమె భర్త అండ్రే ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇంకేం బాలినీస్ హిందూ వర్గాలకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్ల దృష్టిలో పర్వతాలు, చెట్లు, సహజ వనరులను పవిత్రంగా భావిస్తుంటారు.
ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. రష్యా ఇన్‌ఫ్లుయెన్సర్ అలినా ఫజ్లీవాను, ఆమె భర్తను బాలి నుంచి వెల్లగొట్టారు. శుక్రవారం వాళిద్దరినీ దగ్గరుండి సాగనంపారు పోలీసులు. ఇక ఈ ఘటనకుగానూ శిక్షగా ఆరు నెలలపాటు ఈ జంటను ఇండోనేషియాలో అడుగుపెట్టనివ్వరు. వెళ్లగొట్టే ముందు వాళ్లు ఫొటో షూట్ చేసిన పవిత్రమైన చోటుని.. వాళ్లతోనే శుభ్రం చేయించారు. తాము చేసిన పనికి క్షమాపణలు చెబుతూ అలీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఉంచడంతో పాటు ఓ వీడియోను విడుదల చేసింది.
ఇదిలా ఉండగా.. ఇండొనేషియాలోనే పోయిన నెలలో కెనడా నటుడు ఒకడు.. నగ్నంగా బటూర్ పర్వతంపై సంచరించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. అతన్ని కూడా అరెస్ట్ చేయకుండా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment