అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. ట్రంప్‌ మాస్టర్‌ ప్లాన్‌! | Donald Trump strips legal status of 530,000 migrants deportations | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. ట్రంప్‌ మాస్టర్‌ ప్లాన్‌!

Published Sat, Mar 22 2025 8:10 AM | Last Updated on Sat, Mar 22 2025 11:01 AM

Donald Trump strips legal status of 530,000 migrants deportations

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో 5,30,000  మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా అమెరికాను వీడాల్సి ఉంటుంది.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజుకో సంచలన నిర్ణయంతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌లు విధించే అంశంలో బిజీగా ఉన్న ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. అమెరికాలో 5,30,000  మందికి పైగా తాత్కాలిక వలసదారుల హోదా రద్దుకు పెద్ద ప్లాన్‌ చేశారు. లక్షలాది మంది క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వా, వెనెజువెలా వలసదారులకు చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇక, ఒక నెలలోనే వారిని బహిష్కరించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ.. ఆర్థిక స్పాన్సర్లతో అక్టోబర్ 2022 నుండి అమెరికాకు చేరుకున్న ఈ నాలుగు దేశాల వలసదారులు అమెరికా నుంచి వెళ్లిపోవాల్సి ఉంది. అలాగే అమెరికాలో పని చేయడానికి రెండు సంవత్సరాల అనుమతులు పొందిన వారు ఏప్రిల్ 24 తర్వాత వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని పేర్కొంది. దీంతో, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఈ వలసదారులకు మంజూరు చేయబడిన రెండు సంవత్సరాల మానవతా పెరోల్‌ రద్దు కానుంది. కాగా, జో బైడెన్‌.. 2022లో వెనిజులా ప్రజల కోసం పెరోల్ ఎంట్రీ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2023లో దానిని విస్తరించారు. దీంతో, భారీ సంఖ్యలో వలసదారులు అమెరికాకు వచ్చారు. 

అయితే, మానవాత పెరోల్‌ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనుంది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వచ్చారని, రెండేళ్ల పాటు యూఎస్‌లో నివసించడానికి, పని చేయడానికి తాత్కాలిక అనుమతులు పొందారని హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌ వెల్లడించారు. వీరు ఏప్రిల్‌ 24న లేదా ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అగ్రరాజ్యంలో ఉండేందుకు లభించిన లీగల్‌ స్టేటస్‌ను కోల్పోనున్నారని తెలిపారు.

మానవతా పెరోల్‌ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతామని ట్రంప్‌ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తాజాగా అమెరికా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మానవతా పెరోల్‌ అనేది అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉన్న వెసులుబాటు. యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా అధ్యక్షుడు ఈ లీగల్‌ స్టేటస్‌ను కల్పిస్తారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటు కొందరు వలసదారులకు ఉన్న చట్టబద్ధమైన మార్గాలను కూడా ముగిస్తామని అప్పట్లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement