
అగ్రరాజ్యంలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్‌ను అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని భారత్‌కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు.
బాదర్ ఖాన్ సూరి(Badar Khan Suri).. వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జినీయాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకుబాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని భారత్‌కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది.
మరోవైపు తన అరెస్ట్, తరలింపు ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ కోర్టులో సూరి సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత లేదని తన పిటిషన్‌లో సూరి పేర్కొన్నారు.
బాదర్ నేపథ్యం ఇదే..
భారత్‌కు చెందిన బాదర్ ఖాన్ సూరి.. స్వస్థలం ఎక్కడ అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ స్డడీస్‌పైన పీహెచ్‌డీ చేసిన ఆయన.. ఆపై ఇరాక్, అఫ్గనిస్థాన్‌లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలూ చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్.. మఫెజ్ అహమద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాల ఉన్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్‌లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్‌గా డీహెచ్‌ఎస్ ప్రకటించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్ట్ కావడంతో.. జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం.. లాంటి అంశాలు చర్చకు వచ్చాయి.
Georgetown University researcher detained by ICE, accused of ‘actively spreading Hamas propaganda and promoting antisemitism’: report https://t.co/HBqSGzG6PR pic.twitter.com/wkXWKSYRSh
— New York Post (@nypost) March 20, 2025
అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్‌ను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్ హోల్డర్ అయిన మహమ్మూద్ ఖలీల్‌ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు.
రంజనీ స్వీయ బహిష్కరణ
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో.. పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్(Ranjani Srinivasan)ను రద్దు చేసిన డీహెచ్‌ఎస్.. స్వీయ బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం డీహెచ్‌ఎస్ రిలీజ్ చేసింది.
ప్రత్యేక యాప్‌తో..
దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్లను స్వీయ బహిష్కరణ పేరిట అక్కడి నుంచి పంపించేందుకు డీహెచ్‌ఎస్ సీబీపీ హోమ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఉపయోగించే రంజనీ శ్రీనివాసన్‌ను పంపించేశారు. ‘‘అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరుచేస్తాం. కానీ, మీరు ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపినప్పుడు వాటిని రద్దు చేస్తాం. అలాంటివారు ఈ దేశంలో ఉండకూడదు. మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోమ్ ఆప్ ఉపయోగించిందనందుకు సంతోషిస్తున్నా’’ అని డీహెచ్‌ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment