
న్యూఢిల్లీ: అక్రమ వలసదార్లపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందలాది మందిని బలవంతంగా వారి స్వదేశాలకు తరలించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 300 మందికిపైగా భారతీయులను వెనక్కి పంపించింది. త్వరలో మరో 295 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం మన దేశానికి తరలించబోతోందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు.
ఇక, వీరంతా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) కస్టడీలో ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ సర్కారు అనుమతి ఇచ్చిన వెంటనే వెనక్కి వచ్చేస్తారని చెప్పారు. 2025లో ఇప్పటిదాకా 388 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగివచ్చారని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలువురు భారతీయులను సైనిక విమానాల్లో అమెరికా నుంచి వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
అయితే, వారికి సంకెళ్లు వేయడం పట్ల భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మనవాళ్లను అవమానిస్తున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే, అక్రమ వలసదార్లను బయటకు వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. 2009 నుంచి ఇప్పటివరకు.. గత 16 ఏళ్లలో 15,700 మంది భారతీయ అక్రమ వలసదార్లను అమెరికా సర్కారు వెనక్కి పంపించింది. అయితే, సంకెళ్లు వేసే పద్ధతి 2012లోనే ప్రారంభమైంది. భారతీయులకు సంకెళ్లు వేసి పంపిస్తుండడం పట్ల తమ నిరసనను అమెరికా ప్రభుత్వానికి తెలియజేశామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment