బాలయ్య, జూనియర్‌, లోకేష్‌.. అంతా చంద్రబాబు మిథ్య! | KSR Comment: Reason Behind CBN Bizarre Comments On Lokesh Succession | Sakshi
Sakshi News home page

బాలయ్య, జూనియర్‌, లోకేష్‌.. అంతా చంద్రబాబు మిథ్య!

Published Wed, Jan 29 2025 11:14 AM | Last Updated on Wed, Jan 29 2025 11:52 AM

KSR Comment: Reason Behind CBN Bizarre Comments On Lokesh Succession

‘‘అందరినీ అన్నిసార్లూ నమ్మించ లేం’’ అంటుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడు అదే రుజువు అవుతోంది. దావోస్‌లో వారసత్వం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే  ఇందుకు నిదర్శనం. కుమారుడు, మంత్రి లోకేష్‌కు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘వారసత్వం అనేది ఒక మిథ్య’’ అని, ‘‘వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను సొంతంగా దావోస్‌ తీసుకెళ్లిన మీడియాతో ఆయన ఈ మాట అంటున్నారంటే.. ఆ వ్యాఖ్యల మర్మం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

‘‘ఎవరికైనా మెరుగైన అవకాశాలు రావచ్చు. వారు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారన్నది  ముఖ్యం. వ్యాపారంలో ఉండి ఉంటే లోకేష్‌కు సులభంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. ఇందులో వారసత్వం లేదు’’ అని ఆయన చెబుతున్నారు. బాగానే ఉంది కానీ దీన్ని నమ్మేదెవరు? రెండు దశాబ్దాలుగా కుమారుడిని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబేనాయె! ఏదో మాట వరసకు వారసత్వం అన్నీ ఇవ్వదని అంటున్నా... అనేక ఇతర నేతల మాదిరిగానే లోకేష్‌కూ అదే పునాది అన్నది అందరికీ తెలిసిన విషయమే. 

లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొస్తారా?.. అనే ప్రశ్నకు ఆయన గతంలో చాలా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు లోకేష్‌కు ప్రజాసేవ చేయాలనుంది అని ఆయనే అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారం కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను వాడుకుని ఆయన్ను పక్కకు తప్పించిన విషయం మరీ పాత విషయమైతే కాదు. ఆ తరువాతి ఏడాది జరిగిన మహానాడులో జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని బట్టే లోకేష్‌ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు.. నగదు బదిలీ పథకాలను తన కొడుకే ఆవిష్కరించినట్లు బిల్డప్‌లు ఇవ్వడమూ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఎందుకో మరి పోటీ మాత్రం చేయలేదు. అయితే టీడీపీ అనూహ్యంగా అధికారంలోకి రావడంతో లోకేష్‌కు ప్రాధాన్యత వచ్చింది. మంత్రిని చేయాలని కుటుంబం నుంచే ఒత్తిడి రావడం మొదలైంది. కాదనలేక చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిపదవి కట్టబెట్టారు. ఇదంతా వారసత్వ రాజకీయం కాదంటే ఎవరైనా నమ్ముతారా? 

ఎలాంటి కష్టం, ఎదురుచూపు, నిరాశల్లేకుండా అనాయసంగా ఎమ్మెల్సీ, మంత్రి పదవులు రావడం ఆషామాషీ ఏమీ కాదన్నది ఎవరిని అడిగినా చెబుతారు. లోకేష్‌కు ఈ పదవులు మాత్రమే కాదు... తండ్రి పేరుతో లేదంటే ఆయన తరఫున పెత్తనాలు చేసే స్థాయి కూడా వచ్చిందన్నది బహిరంగ రహస్యం. లోకేష్‌ను కలిసేందుకు టీడీపీ నేతలు క్యూ కడితే.. బాబును కలిసి వచ్చారా? అంటూ అప్పుడప్పుడూ చంద్రబాబు కూడా వాకబు చేసేవారని చెబుతారు.  

2019 శాసనసభ ఎన్నికలలో లోకేష్ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు రాజకీయాలు సరిపడవని, వ్యాపారం చేసుకోవాలని లోకేష్‌కు సూచించలేదు. బదులుగా పార్టీలో ప్రాధాన్యం మరింత పెరిగింది. పాదయాత్ర చేసి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేసి లోకేష్ సొంత గుర్తింపు కోసం ప్రయత్నించి ఉండవచ్చు. అది వేరే విషయం.2024 ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీలో కీలకంగా ఉండడం, తండ్రికి సంబంధం లేకుండా పలు హామీలు ఇచ్చారు కూడా. వారసత్వ అధికారం లేకుండానే అవన్ని చేయగలుగుతారా? రెడ్ బుక్ అంటూ కొందరు రిటైర్డ్ పోలీసు  అధికారులను  పెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నా, అన్ని శాఖలలో జోక్యం చేసుకుంటున్నా, చంద్రబాబు కన్నా లోకేషే  పవర్ పుల్ అన్న భావన ఏర్పడినా అదంతా వారసత్వం ఇచ్చిన బలమే. దానిని అడ్డుకునే స్థితిలో కూడా చంద్రబాబు లేరు. 

నిజానికి చంద్రబాబు ధైర్యంగా లోకేష్ తన వారసుడని చెప్పి ఉండవచ్చు. కానీ అలా అంటే ప్రజలలో ఏమైనా నెగిటివ్ వస్తుందేమోనని అనుమానంతో ఇలా ఫీలర్లు వదులుతూంటారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో తదుపరి టీడీపీ అధినేత లోకేష్ అన్న భావన బలపడేలా చేస్తారన్నమాట. ఎల్లో మీడియా ఈ మాటలకు రకరకాల కలరింగ్ ఇస్తూంటుంది. పని తీరు, ప్రతిభ ఆధారంగానే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒక్క కారణంతో వారసుడు కాలేడని చెప్పడం చంద్రబాబు అభిప్రాయమని జాకీ మీడియా విశ్లేషణ చేసింది. అలాగైతే ఎవరు కాదంటారు. ఇంకెవరైనా ఇలాగే రాజకీయాలలోకి  వస్తే ఇదే జాకీ మీడియా అడ్డమైన నీచపు రాతలు  రాస్తుంటుంది. లోకేష్ సొంత ప్రతిభతో రాజకీయాలలోకి వచ్చారా? లేక వారసత్వంతో వచ్చారా అన్నది అందరికి తెలిసిన సత్యం. దీనికి ఇంత నాటకీయత పులమడం అవసరమా? అన్నదే ప్రశ్న. 

ఒకప్పుడు ఎన్.టి.రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడని ప్రకటించినప్పుడు.. దాని వల్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్‌ ఆ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు. అప్పుడే ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ వారసులు  కాకుండా తానే చక్రం తిప్పేలా ఆయన వ్యూహ రచన చేసుకున్నారని చెబుతారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరాక కొంతకాలానికి కర్షక్ పరిషత్ ఛైర్మన్‌గా ,ఇతరత్రా  అధికారం చెలాయించడం ఆరంభించగలిగారు. దానికి కారణం మామ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి  కావడం వల్లే కదా! కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ నాయకుడిని, ఈ నాయకుడిని ప్రసన్నం చేసుకుని మంత్రి పొందిన చంద్రబాబుకు టీడీపీలో చేరాక ఆ ఇబ్బంది లేకుండా పోయింది. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారన్న విమర్శలు కూడా వచ్చేవి. 

1994లో టీడీపీ మళ్లీ గెలిచిన తర్వాత రెండు కీలకమైన శాఖలు రెవెన్యూ, ఫైనాన్స్ పొందగలిగారంటే మామ అండ ఉండబట్టే కదా.. దీనిని వారసత్వం అని నేరుగా అనకపోవచ్చు. కానీ అల్లుడు గిల్లుడు అని చమత్కరిస్తుంటారు. ఎన్టీఆర్‌ను పదవిచ్యుతుడిని చేయడానికి కూడా బంధుత్వమే ఉపయోగపడింది కదా! అల్లుడు తన పదవి ఎందుకు లాక్కొంటారని ఎన్టీఆర్‌ అమాయకంగా ఉండిపోయారు.  దానిని అడ్వాంటేజ్ చేసుకుని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను తనవైపు లాక్కొని సీఎం సీటు ఎక్కుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా అదంతా కుటుంబ వ్యవహారం అనుకున్నారు. ఇందులో చంద్రబాబు కుట్ర  రాజకీయాలు కూడా ఉండవచ్చు. అది వేరే విషయం. ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు ఎవరూ తనకు పోటీకి రాకుండా జాగ్రత్తపడ్డారు. తోడల్లుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఈనాడు రామోజీరావు సాయంతో బయటకు గెంటేశారు. ఇది వారసత్వ గొడవ కాదా? లక్ష్మీపార్వతిని సాకుగా చూపించడంలో ఉన్న మతలబు తెలియదా! 

హరికృష్ణ పరిస్థితి అంతే. టీడీపీ అధ్యక్షుడిని చేస్తానని వాగ్దానం చేసి, ఆ తర్వాత తాత్కాలికంగా మంత్రిని చేసి, ఆ పదవి కూడా పోయేలా చేశారు. దాంతో హరికృష్ణ పార్టీ వీడిపోయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బాలకృష్ణతో సత్సంధాలు ఉండేలా చేసుకుని వియ్యంకుడిగా మార్చుకుని ఆయనను పూర్తిగా వారసత్వ పోటీ నుంచి తప్పించగలిగారు. ఇవన్ని రాజకీయంగా చంద్రబాబు తెలివిగానే చేశారు. తద్వారా ఎన్టీఆర్‌ వారసులు  కాకుండా, ఇప్పుడు  తన వారసుడు లోకేష్ సీఎం అయ్యేందుకు  బాట వేసుకున్నారు. అందులో బాగంగానే ప్రభుత్వ ప్రచారం ప్రకటనలలో పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రచురించారు. లోకేష్ డిప్యూటి సీఎంగా ను చేయాలని తన సమక్షంలోనే టీడీపీ నేతలు డిమాండ్ చేసినా ఆయన ఏమీ మాట్లాడలేదు. మరెవరికైనా ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఎదుట అనగలరా? అంటే ఆయన ఊరుకుంటారా? ఇదంతా వారసత్వం కాకపోతే ఏమిటి? చేసేది చేస్తూనే ఏమి తెలియనట్లు నటించడమే చంద్రబాబు రాజకీయం. దానికి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుంటారు. 

పవన్ కల్యాణ్‌ వైపు నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ పెద్ద వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు. పవన్ ఒకరకంగా ఇప్పటికే మానసికంగా సిద్దపడ్డారని విశ్లేషణలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల  కుమారులు రాజకీయాలలోకి వచ్చారు. సీఎంలు అయ్యారు. అదేదో జరగకూడని సంగతేమీ కాదు.లోకేష్ ను సీఎం పదవి ఇవ్వాలని కుటుంబపరంగా డిమాండ్ వస్తున్నదంటే అది వారసత్వం వల్ల కాక మరేమిటి? ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నది నిజం కాదా? అంతెందుకు! తన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి కాబోడని, పార్టీ అధినేత కాజాలరని ఇంటకానీ, బయటకానీ చెప్పగలరా? ఉప ముఖ్యమంత్రిని చేయబోవడం లేదని ఇంతవరకు చెప్పలేదు. పైగా కూటమిలో చర్చించుకుంటామని చెప్పి పరోక్షంగా ధృవీకరించారు. అవన్ని కప్పిపుచ్చి,  వారసత్వం మిథ్య అని, మరొకటని కబుర్లు చెప్పి, ఆయనేదో వారసత్వానికి వ్యతిరేకమైనట్లు, లోకేష్ ప్రజాసేవకుడు అయిపోయినట్లు  పిక్చర్ ఇచ్చుకునే ప్రయత్నమే బాగోలేదు. దానినే హిపోక్రసీ అని అంటారు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement