
అనంతపురం, సాక్షి: జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు(Guntakal) టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో..
‘‘జర్నలిస్టులను(Journalists) రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చౌదరి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు.
‘‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా వార్తలు రాస్తే ఖబడ్దార్.. తాట తీస్తా. నేను అన్నీ చేసి వచ్చినోడ్ని.. ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ ఓ కార్యక్రమంలో జర్నలిస్టులపై గుమ్మనూరు హెచ్చరికలు జారీ చేశారు.
జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయ్!
జర్నలిస్టులపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా?. ఆయన ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు అని అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు.

Comments
Please login to add a commentAdd a comment