Anantapur District News
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్‌గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్‌కుమార్, టి.ఎస్.చేతన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. డీఆర్ఓ మలోల నిర్వాకం వివరణ కోరిన కలెక్టర్ -
టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణ
పుట్టపర్తి టౌన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా నేరాల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ద్వారక తిరుమలరావు తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక ఆడియోలు, వీడియోలు, విద్యాసంస్థల్లో సదస్సులు, ర్యాలీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాకూ ఒక సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక ప్రశాంతినిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ షిమోషీ, ఎస్పీ రత్నతో కలసి పోలీసు అధికారులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మారుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వంద ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగులో ఉందని, దాన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాంగ్, ర్యాష్ డ్రైవింగ్ మానుకోవాలని, హెల్మెట్ తప్పక వాడాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉంటామన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడమంటే లైసెన్స్ లేని తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో సమానమని అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లా పోలీస్ అఽధికారులు విడుదల చేసిన శాంతభద్రతలు, నేర నివేదిక –2024 ప్రకారం జిల్లాలో అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోందన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సంస్థ ఆదాయం పెంచండి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి.. ఖర్చులు తగ్గించుకుని, సంస్థ ఆదాయం పెంచాలని డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు సూచించారు. ఆయన పుట్టపర్తి ఆర్టీసీ బస్సు డిపోను తనిఖీ చేశారు. డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఉద్యోగులకు బకాయిలను ఈ నెలాఖరులోపు చెల్లిస్తామన్నారు. డీజీపీ ద్వారక తిరుమలరావు -
No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్లో పిల్లలకు వ్యాయామ విద్యను బోధించాల్సిన ఓ పీడీ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చెలరేగిపోతున్నాడు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు మించి విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు, ఉద్యోగులను శాసిస్తున్నాడు. ఇటీవల డీఈఓ కార్యాలయంలోని ఏఎస్ఓ పోస్టుకు తాను చెప్పిన టీచరును తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తుండటంతో అధికారులు కూడా వణికిపోతున్నారు. కాగా, సదరు టీచరు గతంలో ఏఎస్ఓగా పని చేశాడు. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున అవినీతి, ఆరోపణలు రావడంతో తప్పించి బడికి పంపారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ టీచర్ తెరపైకి రాగా.. అతనికి మద్దతుగా పీడీ రంగంలోకి దిగాడు. టీచరును ఆ పోస్టులోకి తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారెవరూ కనిపించరాదట..! ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. ఏర్పాట్లు, వసతి, రవాణా తదితర పనులను పర్యవేక్షించేందుకు డీఈఓ తన సిబ్బందితో మాట్లాడి కొందరు టీచర్లను స్పెషల్ డ్యూటీకింద వేశారు. వారంతా కమిషనర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, సోమవారం డీఈఓ కార్యాలయానికి వెళ్లిన పీడీ... డ్యూటీలకు వేసిన వారి జాబితాను తీసుకుని కొందరి పేర్లు ప్రస్తావిస్తూ వీరిని ఎలా డ్యూటీకి వేస్తారంటూ ఉద్యోగులపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. వీరెవరూ కమిషనర్ పర్యటనలో కనిపించకూడదంటూ స్వయంగా డీఈఓ సమక్షంలోనే హెచ్చరికలు జారీ చేశాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ.. తన సామాజికవర్గానికి చెందిన ఎంపీ, జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పీడీ బెదిరింపులకు గురిచేస్తున్నాడు.తాను వారితో సన్నిహితంగా ఉంటానని, విద్యాశాఖలో ఏ చిన్న పని ఉన్నా ఎంపీ, ఎమ్మెల్యే తనతో చర్చించే నిర్ణయం తీసుకుంటారంటూ చెబుతున్నట్లు తెలిసింది. తాను చెబితే ఎంపీ, ఎమ్మెల్యే చెప్పినట్టేనంటూ బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉంటూ పార్టీ కోసం పని చేసిన టీచర్లు సైతం ఈయన దెబ్బకు బెదిరిపోతున్నారు. ఇలాంటివారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ చెబుతుండడం విశేషం. -
జిల్లాకు 24న ప్రాథమిక విద్య కమిషనర్ రాక
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఈనెల 24న జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానంపై సమీక్షించనున్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక పంగల్‌రోడ్డులోని ఆర్డీటీ అంధ విద్యార్థుల పాఠశాలలోని ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రసాద్‌బాబు, కిష్టప్ప, సమగ్ర శిక్ష ఏపీసీలు శైలజ, దేవరాజు, డీసీఈబీ కార్యదర్శులు గంధం శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, డీవైఈఓలు శ్రీనివాసరావు, శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓలు మాట్లాడుతూ కమిషనర్ నిర్వహించే సమీక్షకు అన్ని వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి అన్ని వివరాలు ఉండాలన్నారు. పూర్తిగా అవగాహన కల్గి ఉండాలని సూచించారు. కమిషనర్ ర్యాండమ్‌గా స్కూళ్ల గురించి ఆరా తీస్తారన్నారు. ఉమ్మడి జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్టీలు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. -
వ్యక్తి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం తక్కళ్లపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి (62) కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గతంలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నా ఫలితం దక్కలేదు. నొప్పి తీవ్రత తాళలేని ఆయన మంగళవారం తాడిపత్రి సమీపంలోని పుట్లూరు మార్గంలో ఉన్న రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పీఎస్ ఎస్ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దళారుల చేతుల్లో కంది రైతులు దగా : ఏఐకేఎస్అనంతపురం అర్బన్: కంది పంట సాగు చేసిన రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని... దీనిని ఆసరాగా చేసుకుని దళారులు కుమ్మకై రైతులను దగా చేస్తున్నారని రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల క్రితం క్వింటా కందులను రూ.10వేలతో కొనుగోలు చేసిన దళారులు.. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి కారణంగా క్వింటా రూ.6 వేలు, రూ.6,500 మించి కొనడం లేదన్నారు. ఈ నెల 25వ తేదీలోపు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ.7.550 మద్దతు ధరతో పాటు బోనస్ కింద రూ.2 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
చెస్‌లో రాణించిన స్టీఫెన్
అనంతపురం: నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్–2025 అండర్–13 ఓపెన్ విభాగంలో నిర్వహించిన చెస్ పోటీల్లో అనంతపురానికి చెందిన శామ్యూల్ స్టీఫెన్ నోబుల్ రాణించాడు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరిగాయి. దేశ వ్యాప్తంగా 1,200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. స్విస్ లీగ్ పద్దతిలో జరిగిన పోటీల్లో తలపడిన స్టీఫెన్.. మొత్తం 9 రౌండ్లకు గాను 8 పాయింట్లు (7 గెలుపు, 2 డ్రా) సాధించి చాంపియన్‌షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా స్టీఫెన్‌ను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్‌కుమార్‌నాయుడు, అనంతపురం చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ అభినందించారు. -
కూటమి ప్రభుత్వం రాగానే ఆ ప్రజాప్రతినిధి అక్రమాలకు దారులు తెరిచారు. పోలీసులను గుప్పిట పెట్టుకున్నారు. వ్యాపారులను ముందుగా ఇంటికి పిలిపించి ఇంతని ఫిక్స్ చేస్తున్నారు. దారికి రాకుంటే తన ‘ఆధీనం’లోని ఖాకీలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే తనకు కనిపించిన అన్
●‘అనంత’లో వసూళ్ల పర్వం ●ఎగ్జిబిషన్ నిర్వహణకు రూ. పది లక్షల డిమాండ్ ●లేదంటే అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఫోన్లు ●టీడీపీలోనే మరో వర్గాన్ని ఆశ్రయించిన బాధితుడు ●రచ్చ అవుతుందని గ్రహించి వెనక్కి తగ్గిన ప్రజాప్రతినిధి సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వసూళ్ల దెబ్బకు వ్యాపారులు మొదలు బిల్డర్ల వరకూ హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యం నుంచి ప్రారంభించి కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణదారుల వరకూ అందరితోనూ వసూళ్ల బేరం మొదలెట్టిన సదరు ప్రజాప్రతినిధి... తాజాగా ఎగ్జిబిషన్, సర్కస్ కంపెనీల నిర్వాహకులనూ వదల్లేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాలను నిలుపుకోవాలంటే కూడా ఒక్కో వాహనదారుడు రూ.2 వేలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయన ‘పైసావసూల్’ పర్వం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. రూ. పది లక్షలిస్తేనే ఎగ్జిబిషన్..! ఇటీవల రుద్రంపేటలో ఎగ్జిబిషన్ పెట్టేందుకు ఓ వ్యక్తి అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. అన్ని విభా గాలకు మామూళ్లివ్వనిదే అనుమతులు ఇవ్వలేదు. ఇంతలోనే సదరు ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి కలవగానే.. రూ.10 లక్షలు ఇస్తేనే ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని, లేదంటే కుదరదని తేల్చి చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు తాను ఇవ్వలేనని కరాఖండీగా చెప్పి వచ్చేయగా... సదరు ప్రజాప్రతినిధి ఫోర్త్ టౌన్ సీఐకి ఫోన్ చేసి ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఐ నుంచి ఫోన్ రావడంతో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు వెళ్లి ఆయనను కలవగా.. ‘అన్న’ను ఓసారి కలవాలని సీఐ చెప్పడంతో హతాశులయ్యారు. మాజీ ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ.. ప్రజాప్రతినిధి వ్యవహారాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు నగర టీడీపీలో మరో వర్గానికి ప్రతినిధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఫోర్త్ టౌన్ సీఐకి ఫోన్ చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిసింది. వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారయ్యేలా ఉందని గుర్తించిన సీఐ వెంటనే అనుమతులిచ్చేసినట్లు తెలిసింది. ఈ విషయం ప్రజాప్రతినిధి దృష్టికి కూడా సీఐ తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని మీడియా ముందుకు తీసుకెళతారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధి వెనక్కు తగ్గినట్టు తెలిసింది. వాహనాల స్టాండ్కూ సుంకమే! అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న స్థలంలో నిత్యం పలు 407 అద్దె వాహనాలు నిలబడి ఉంటాయి. అయితే అక్కడ ఇకపై వాహనాలు నిలుపుకోవాలంటే ఒక్కో వాహనదారుడు నెలానెలా తనకు రూ.2 వేలు సమర్పించుకోవాలంటూ ప్రజాప్రతినిధి నుంచి ఆదేశాలు వచ్చాయని బాధితులు చెబుతున్నారు. ప్రతి ఏటా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు, ఇతర రాష్ట్రాల నుంచి కాటన్ వస్త్రాల వ్యాపారులు వచ్చి ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. తాజాగా గుత్తి రోడ్డులో ఓ ఎగ్జిబిషన్ నడుస్తోంది. వీటన్నిటి నుంచి కూడా మామూళ్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సదరు ప్రజాప్రతినిధి దెబ్బకు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకూ హడలిపోతున్నారు. కూటమి పాలన అంటే ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యువతలో నైపుణ్యాన్ని పెంపొందించాలి
అనంతపురం అర్బన్:‘యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘సంకల్ప’, ‘పీఎం విశ్వకర్మ’ పథకాల కింద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ (డీఎస్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘సంకల్ప’ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాల సంఖ్య పెంచాలని చెప్పారు. శిక్షణ తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. మెరుగైన సమాచారం కోసం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ) సభ్యులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆటోమోటివ్, మైనింగ్ రంగాల కోసం సమగ్ర శిక్షణ కోర్సులను నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణాభివృద్ధి అధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖాధికారి రామాంజనేయులు, ఇతర అధికారులు, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రిన్సిపాళ్లు, ఆర్డీటీ, కియా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా రుణం..రైతుల ఆర్థిక శ్రేయస్సే లక్ష్యంగా పంట రుణ పరిమితి ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహిచంఆరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకుల ద్వారా ఖరీఫ్– 2025, రబీ..2025–26లో వివిధ పంటలకు సంబంధించి రుణ పరిమితిని నిర్ణయించామన్నారు. కార్యక్రమానికి ఏడీసీసీ బ్యాంక్ సీఈఓ సురేఖరాణి కన్వీనర్‌గా వ్యవహరించారు. సమావేశంలో ఎల్డీఎం నర్సింగరావు, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, సరికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా అవగాహన కల్పించాలి కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం -
పట్టి‘పీడీ’స్తున్నాడు..
● ‘‘ఏం నేను ఫోన్ చేస్తే తీయవా... ఏమనుకుంటున్నావ్? ఒకవేళ మీటింగ్‌లో ఉంటే మళ్లీ అయినా ఫోన్ చేయాలని తెలీదా! తమాషాలు చేస్తున్నావా? నేననుకుంటే అరగంట కూడా ఇక్కడ పని చేయలేవు జాగ్రత్త. అందరిలా నన్ను అనుకోవద్దు’’ ● ‘‘నేను ఇంతకుముందే చెప్పాను కదా. ఈయన్నే డీఈఓ ఆఫీస్‌లో ఏఎస్ఓగా తీసుకోవాలని! మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీకేమైనా ఆర్జేడీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయా? చెప్పండి. నేను చూసుకుంటా. అవసరమైతే ఆర్జేడీకి విద్యాశాఖ మంత్రి లోకేష్‌తోనే ఫోన్ చేయిస్తా.’’ -
గీత కార్మికులకు మద్యం షాపుల కేటాయింపు
అనంతపురం: మద్యం పాలసీలో భాగంగా గీత కార్మికులకు మద్యం విక్రయ దుకాణాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాటి తాగు సంప్రదాయ వృత్తిలో కొనసాగుతున్న బీసీ–ఏ కేటగిరిలోని యాట ఉపకులం, బీసీ–బీ కేటగిరిలోని గౌడ్, ఈడిగ, గాండ్ల (గమ్మల), కలాలే, గౌండ్ల, శ్రీశయన (సేగిడి) వారు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకించి బీసీ–బీ కేటగిరిలోని ఈ ఉప కులాలకు చెందిన వారికి మొత్తం 14 మద్యం షాపులు కేటాయించారు. ఇందులో గౌడ్–2, ఈడిగ–9, గౌడ–1, కలాలే–1, గౌండ్ల–1 చొప్పున దుకాణాలు కేటాయించగా... అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి గౌడ్–1, ఈడిగ–7, గౌడ–1 చొప్పున మొత్తం 9 మద్యం దుకాణాలను కేటాయించారు. 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ వీరికి మద్యం విక్రయ లైసెన్స్‌లు జారీ చేస్తారు. ఒకరికి ఒక లైసెన్స్ మాత్రమే ఇస్తారు. దుకాణాల వార్షిక లైసెన్స్ ఫీజు సాధారణ దుకాణాలతో పోల్చుకుంటే 50 శాతం తక్కువగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 5వ తేదీలోపు ఆన్లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తారు. -
పాతుకుపోయిన డీటీలపై ఆరా
● వివరాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లా కేంద్రాన్ని వీడకుండా అనేక ఏళ్లుగా పాతుకుపోయిన డిప్యూటీ తహసీల్దార్లపై కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆరా తీస్తున్నారు. ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాతుకుపోయారు’ కథనానికి ఆయన స్పందించారు. డిప్యూటీ తహసీల్దార్లు ఎందరు ఉన్నారు.. ఎవరు ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.. ఎన్ని ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు.. తదితర వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని పరిపాలనా విభాగం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆ మేరకు విభాగం సిబ్బంది వివిధ శాఖలకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఏ–1గా శోభారాణి నియామకం కలెక్టరేట్ పరిపాలనా విభాగం ఏ–1 క్లర్క్‌గా డిప్యూటీ తహసీల్దారు శోభారాణిని నియమించారు. మంగళవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. గత నెల 16న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘అమ్మో ఏ–1 సీటా’’ కథనానికి కలెక్టర్ స్పందించారు. అత్యంత కీలకమైన ఏ–1 స్థానంలో అనుభవం ఉన్న అధికారిని నియమించాలనే విషయంపై కసరత్తు చేసిన తరువాత శోభారాణిని నియమించినట్లు సమాచారం. పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు గుంతకల్లు/అనంతపురం: పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, రూ.1,000 జరిమానా విధించారు. గుంతకల్లు టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్‌వలి తెలిపిన మేరకు.. గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన షేక్ షేక్షావలి చిల్లర దుకాణం నడిపేవాడు. 2020 జనవరి 16న ఓ దళిత బాలిక చాక్లెట్ కొనుక్కోవడానికి దుకాణం వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే షేక్షావలి ఆమెను లోపలికి పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక బిగ్గరగా అరుచుకుంటూ ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి టూటౌన్ సీఐ చిన్న గోవిందప్ప, డీఎస్పీ ఖాసీంసాబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అనంతపురం జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ 14 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో జడ్జి రాజ్యలక్ష్మీ మంగళవారం ముద్దాయి షేక్షావలికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే, రూ.1,000 జరిమానా విధించారు. బాలికకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ వెంకటేష్ నాయక్, గుంతకల్లు టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్ పర్యవేక్షణలో లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు నాగార్జున, ఉదయ్ నాయక్‌లు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ జగదీష్ అభినందించారు. ముగిసిన కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు అనంతపురం: జిల్లాలో గత నెల 30 నుంచి సాగుతున్న కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. వివిధ కారణాలతో గైర్హాజరైన వారితో పాటు ఎత్తు, ఛాతీ కొలతలకు అప్పీలు చేసుకున్న అభ్యర్థులకు ముగింపు రోజు అవకాశం కల్పించారు. నేడు అల్ట్రా మారథాన్ అనంతపురం: ఆర్డీటీ ఆధ్వర్యంలో బుధవారం అల్ట్రా మారథాన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ మంగళవారం తెలిపారు. బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే మారథాన్ మొత్తం 170 కిలోమీటర్ల మేర సాగి శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ కార్యాలయం వద్ద ముగుస్తుంది. స్పెయిన్‌కు చెందిన అల్ట్రామారథాన్ రన్నర్ జువెల్ మానువెల్ నేతృత్వంలో భారతదేశానికి చెందిన 120 మంది మొత్తం నాలుగు బృందాలుగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 కిలోమీటర్లు ఏకధాటిగా ఒక టీం రన్నింగ్ చేస్తుంది. -
విజయవాడకు ఐదుగురు సీడీపీఓలు
● మాతాశిశు సంరక్షణలో వెనుకడినట్లు గుర్తింపు అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. ఉరవకొండ, శింగనమల, అనంతపురం రూరల్, గుత్తి, కణేకల్లు ప్రాజెక్టుల్లో చిన్నారుల పరిస్థితి బాగోలేదని తేలింది. ఈ క్రమంలో సంబంధిత సీడీపీఓలు శ్రీదేవి, ఉమాశంకరమ్మ, ధనలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, ఢిల్లీశ్వరి విజయవాడకు రావాలని ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో హుటాహుటిన సంబంధిత సీడీపీఓలు, వారి సిబ్బంది బయలుదేరి వెళ్లారు. రూ. కోట్లు వెచ్చిస్తున్నా వెనుకబాటే.. : అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతాశిశువుల సంరక్షణ కోసం రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు ఉన్నారా లేదా అనే వివరాలు సేకరించారు. ఈ విషయంలో ఆయా ప్రాజెక్టులు వెనుకబడినట్లు గుర్తించారని, దీంతోనే విజయవాడకు రావాలని ఆదేశాలు వచ్చాయని తెలిసింది. అవార్డులు అందుకున్నా అంతే! : ‘ఉత్తమ’ అవార్డులు అందుకున్న రెండు ప్రాజెక్టుల సీడీపీఓలకు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందడం తీవ్ర చర్చనీయాంశమైంది. మెరుగైన పనితీరు కనబరిచారంటూ ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి, గుత్తి సీడీపీఓ ఢిల్లీశ్వరికి గతంలో అవార్డులు అందజేశారు. అలాంటి వారే ఇప్పుడు ముందువరసలో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు కేవలం కాగితాల్లో చూపి అవార్డులు అందుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అశ్రునయనాలతో అంత్యక్రియలు పెనుకొండ రూరల్: సామాజిక ఉద్యమకారుడు నరేంద్ర సింగ్ బేడీ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య సాగాయి. పెనుకొండ మండలం గుట్టూరు రెవెన్యూ పరిధిలో నరేంద్రసింగ్ బేడి ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న యంగ్ ఇండియా ఫామ్ హౌస్‌లో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు చెందిన స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, 1975–76లో గుట్టూరు కేంద్రంలో యంగ్ ఇండియా ప్రాజెక్ట్‌ను బేడీ ప్రారంభించారు. అనంతరం సేవాకార్యక్రమాలను ఉమ్మడి అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేయకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు విస్తరించారు. గ్రామీణులకు ఉపాధి, భూహక్కు చట్టాలపై పోరాటాలు సాగించిన సామాజిక ఉద్యమకారుడిగా ఆయన ఖ్యాతిగడించారు. కాగా, సోమవారం ఆయన మృతి తెలుసుకున్న మంత్రి సవిత, మడకశిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుధాకర్... యంగ్ ఇండియా ఫామ్ హౌస్‌కు చేరుకుని నరేంద్రసింగ్ బేడీ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మంగళవారం ఉధయం బేడి నివాసానికి వైఎస్సార్ సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర చేరుకుని నివాళులర్పించారు. ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఆయన తల్లి అన్నే ఫెర్రర్, డైరెక్టర్ మల్లారెడ్డి, టింబక్ట్ డైరెక్టర్ బబ్లూ, మేరి, యంగ్ ఇండియా మాజీ ఉద్యోగులు, నల్గొండ ఆచార్య, ప్రసాద్, ప్రమీల, రామగిరి మండలం రామప్ప, గార్లదిన్నె రవి, కిష్టప్ప, బాలరాజు, వాసు, ధర్మవరం కిష్టప్ప, గుట్టూరు సూర్యనారాయణ, మంజునాథ్, కొండారెడ్డి, డ్వాక్రా రామాంజనేయులు, కోగిర జయచంద్ర, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ అనంతపురం టవర్‌క్లాక్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఉరవకొండ ప్రాంతానికి చెందిన కొనకొండ్ల రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి యువకుడి మృతి
ఉరవకొండ: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మద్యం అతిగా తాగి ఓ యువకుడు మృతి చెందాడు. ఫలితంగా ఆ కుటుంబం రోడ్డు పాలైంది. వివరాలు... ఉరవకొండలోని 5వ వార్డులో నివాసముంటున్న కురుబ శంకర్ (35)కు భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకునే శంకర్... గత ఆరు నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం అతిగా మద్యం సేవించి నరసమ్మ మఠం సమీపంలో కుప్పకూలిపోయాడు. గమనించిన పరిచయస్తులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి. రైతు ఆత్మహత్య పెద్దపప్పూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లికి చెందిన నారాయణరెడ్డి, నాగేంద్రమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కుమ్మెత చంద్రశేఖరరెడ్డి (40) ఉన్నారు. తనకున్న పొలంలో మిరప, వంగ తదితర పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో తెగుళ్ల బెడదతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లభ్యం కాక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ బంధుమిత్రులతో చెప్పుకుని బాధపడేవాడు. అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భయపడిన చంద్రశేఖరరెడ్డి మంగళవారం విషపు గుళికలు మింగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పెద్దపప్పూరులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆయన భార్య రాదిక, ఇంటర్ చదువుతున్న కుమారుడు జితేంద్రరెడ్డి ఉన్నారు. ఘటనపై ఎరస్ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సమగ్ర గడప దాటని నిధులు
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష అధికారుల నిర్లక్షం కారణంగా అభివృద్ధి పనుల నిధులు ఆ కార్యాలయ గడప దాటడం లేదు. నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఎస్ఎంసీ ఖాతాల్లోకి జమ చేయచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. నెలలు తరబడి పేరుకుపోయిన బిల్లులకు సంబంధించిన ఫైలు ఇప్పటి వరకూ కలెక్టర్ వద్దకు చేరలేదంటే నిర్లక్ష్యం ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024–25 సంవత్సరానికి సంబంధించి ఆనివల్ వర్క్ ప్లాన్ (ఏడబ్ల్యూపీ) కింద జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్, ఆర్ట్–క్రాఫ్ట్ తరగతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో గదికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. జిల్లాలో మొత్తం 26 గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్ఎంసీ తీర్మానాల మేరకు పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. గత అక్టోబరులో బడ్జెట్ రిలీజ్ తరగతి గదుల నిర్మాణాలకు సంబంధించి 25 శాతం బడ్జెట్‌ను గత ఏడాది అక్టోబర్‌లోనే అప్పటి జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో జిల్లాకు దాదాపు రూ. 2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ బడ్జెట్‌ను కలెక్టర్ అనుమతులు తీసుకుని ఎస్ఎంసీ ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంది. ‘వాల్యూ ఆఫ్ వర్క్ డన్’ ఆధారంగా ఇంజినీరింగ్ అధికారులు నిర్ధారించిన తర్వాత బిల్లుల చెల్లింపునకు ఎస్ఎంసీ సభ్యులు అనుమతిలిస్తారు. అయితే ఇందులో ఏ ఒక్క ప్రక్రియనూ సమగ్ర శిక్ష అధికారులు పూర్తి చేయలేకపోయారు. ఇప్పటి వరకూ కలెక్టర్ కనీసం ఫైలు కూడా పెట్టలేదు. మరో వైపు పనులు చేసిన కాంట్రాక్టర్లు పార్ట్ బిల్లుల కోసం ఎస్ఎంసీలు, సమగ్రశిక్ష కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈఈ ‘డ్యూయల్ రోల్’తో తంటాలు జిల్లా సమగ్రశిక్ష ఈఈగా కొనసాగుతున్న శంకరయ్య వాస్తవానికి శ్రీ సత్యసాయి జిల్లా సమగ్రశిక్ష రెగ్యులర్ ఈఈగా ఉన్నారు. రెండు జిల్లాలను సమన్వయం చేసుకోవడంలో విభాగాధిపతి విఫలమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన రెగ్యులర్‌గా ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం ఇప్పటికే అక్కడి కలెక్టర్ ఆమోదంతో 25 శాతం నిధులను ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేశారు. అనంతపురం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకూ ఆ దిశగా ఆయన ఫైలు కదపలేకపోయారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు బయట జిల్లాల్లో పని చేస్తూ ఇక్కడ హెచ్ఓడీ ఇన్‌చార్జ్‌లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదంటూ సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధన సమగ్రశిక్షలో బేఖాతరవుతోంది. ఇప్పటికీ ఈఈ ఇన్చార్జ్గా శ్రీసత్యసాయి జిల్లా అధికారే వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాల్లో పని చేస్తుండడం వల్ల ఆయన ఎక్కడా అందుబాటులో ఉండడం లేదని ఉద్యోగులు, ఎంఈఓలు, హెచ్ఎంలు వాపోతున్నారు. కొసమెరుపు ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల అంశంపై ఈఈ శంకరయ్యను వివరణ కోరగా...13 రోజుల కిందటే ఏపీసీ (ప్రస్తుత డీఈఓ)కు ఫైలు పెట్టానని చెప్పారు. డీఈఓను వివరణ కోరగా...తనకు ఫిజికల్‌గా ఎలాంటి ఫైలు అందలేదని పేర్కొన్నారు. కేజీబీవీల్లో లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్, ఆర్ట్–క్రాఫ్ట్ తరగతి గదుల నిర్మాణాలు ఒక్కో గదికి రూ.20 లక్షల కేటాయింపు ఎస్‌ఎంసీల తీర్మానాల మేరకు చేపట్టిన నిర్మాణ పనులు 25 శాతం అడ్వాన్స్ ఎస్ఎంసీ ఖాతాలకు పంపని వైనం -
క్రైస్తవులంటే చంద్రబాబు, పవన్‌కు చిన్నచూపు
అనంతపురం కార్పొరేషన్: క్రైస్తవులంటే సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కు చిన్న చూపని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వైవీ బాబు విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులు, మౌజాన్లు, ఇమాంలు, పాస్టర్లకు అందజేసిన గౌరవవేతనాన్ని కొనసాగించకుండా అన్యాయం చేయడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. బిషప్ వాసు అనిల్‌కాంత్, పాస్లర్లు జాకోబు, అరోహన్, అబ్రహాం, సాల్మోన్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ నేత చిలకల థామస్‌తో కలసి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం అందజేసినట్లుగానే పాస్టర్లకు రూ.5 వేల గౌరవవేతనాన్ని అందజేయాలని కోరారు. గౌరవ వేతనం జాప్యంతో జిల్లాలోని 233 పాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెరూసలేం యాత్రకు, విదేశీ విద్య, పెళ్లికానుకనూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలన్నారు. గూడ్స్ ఢీకొని వృద్ధుడి దుర్మరణం అనంతపురం సిటీ/గార్లదిన్నె : గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు బి.నారాయణ (72) తనకున్న పొలంలో చీనీ సాగు చేపట్టాడు. ఈ క్రమంలో మంగళవారం కాలినడకన చీనీ తోటకు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో గూడ్స్ రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఎగిరి సుదూరంగా పొదల మధ్య పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గూడ్స్ లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ ఏఎస్ఐ మహమ్మద్ రఫీ, అనంతపురం జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
అల్లనేరేడు చెట్ల నరికివేత
రాప్తాడు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో కనుమరుగైపోయిన ఆస్తుల విధ్వంసం... కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత మళ్లీ జడలు విప్పుకుంది. అధికారంలోకి వచ్చామన్న అహంకారంతో గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి మరీ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మండలంలోని పుల్లలరేవు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్ద ఓబులేసుకు చెందిన 61 అల్ల నేరేడు చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. బాధిత రైతు తెలిపిన మేరకు.... సర్వే నంబర్ 88–3 (న్యూ)లో తనకున్న 2.86 ఎకరాల పొలంలో రైతు ఓబులేసు రెండేళ్ల క్రితం 200 అల్లనేరెడు మొక్కలను నాటాడు. ఈ నెల 17న 15 చెట్లు, తాజాగా సోమవారం రాత్రి 40 చెట్లను నరికి వేశారు. రాజకీయ కక్షతో స్థానిక టీడీపీ నాయకులు తలారి విజయ్, అశోక్ కుమార్, చంద్రమోహన్, నరేంద్ర, నారాయణ స్వామి, సాయినాథనాయుడు, అక్కులన్న, గురుప్రసాద్, క్రిష్ణయ్య, చెన్నారెడ్డి ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు. అండగా ఉంటాం అధైర్య పడోద్దు... అండగా ఉంటామని బాధిత రైతు ఓబులేసు, ఆయన కుటుంబసభ్యులకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భరోసానిచ్చారు. మంగళవారం ఆయన పెద్ద ఓబులేసు పొలంలో నరికి వేసిన అల్లనేరేడు చెట్లను పరిశీలించారు. ఘటనపై ఓబులేసు, ఆయన భార్య యశోదమ్మతో ఆరా తీశారు. నరికివేసిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలు నాటుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. తాడిపత్రి, యల్లనూరు ప్రాంతాలకు పరిమితమైన చెట్ల నరికివేత సంస్కృతిని స్థానిక టీడీపీ నాయకులు ఇక్కడకు తీసుకురావడం బాధాకరమన్నారు. కలెక్టర్, ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుంటానన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్త పొలంలో విధ్వంసం -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
యల్లనూరు: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం దుగ్గుపల్లికి చెందిన ఉలవల కిరణ్ (21) ఎలక్రిషీయన్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గొడ్డుమర్రికి చెందిన శివ ఇంట్లో వైరింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని పులివెందులలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే చర్యలకు కూటమి సర్కార్ తిలోదకాలిచ్చింది. మరో మూడు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాకాలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందివ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్
తాడిపత్రి రూరల్: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రూ.లక్షల వ్యయంతో నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను 2022లో తొలి సారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఉచితంగా పంపిణీ చేసింది. ఇలా రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా స్టడీ మెటీరియల్ అందజేయడంతో ఫలితాలు ఆశించిన మేర దక్కాయి. పలు కారణాలతో సిలబస్ పూర్తి కాకపోయినా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్టడీ మెటీరియల్ సాయంతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్టడీ మెటీరియల్ పంపిణీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 32,803 మందితో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 11,968 మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాఫ్ట్ కాపీతో సర్దుబాటు పదో తరగతి విద్యార్థుల కోసం ఈ ఏడాది స్టడీ మెటీరియల్ పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోగా, విద్యాశాఖాధికారులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన సాఫ్ట్ కాపీలను అందజేసింది. వీటిని ఆయా హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు వాట్సాప్ ద్వారా విద్యాశాఖాధికారులు చేరవేశారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 40 పేజీలు చొప్పున ఆరు సబ్జెక్టులకు మెటీరియల్‌ను ప్రధానోపాధ్యాయులు ప్రింట్ తీశారు. ఇందుకు అయ్యే ఖర్చును పాఠశాల నిధుల నుంచి ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని పాఠశాలల్లో రూ.100 చొప్పున విద్యార్థుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. 2022లో రాష్ట్రంలో మొట్టమొదటి సారి స్టడీ మెరిటీయల్ అందజేసిన అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా పంపిణీతో మెరుగైన ఫలితాలు కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత అందని స్టడీ మెటీరియల్ ప్రతిపాదనలకే పరిమితమైన వైనం -
జిల్లా అంతటా సోమవారం చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
30న జెడ్పీ సమావేశం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సోమవారం ఆమోదం తెలిపారు. వాస్తవంగా ఫిబ్రవరి 7న సమావేశం నిర్వహించాలని జెడ్పీ అధికారులు భావించారు. అయితే అదే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో తమ నిర్ణయాన్ని జెడ్పీ అధికారులు మార్చుకుని,. కొత్తతేదీ ఫైల్‌ను చైర్‌పర్సన్‌కు పంపగా ఆమె ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో–ఆప్షన్, జెడ్పీటీసీ సభ్యులు, అన్ని శాఖల అధికారులకు సమాచారం పంపారు. వాట్సాప్‌తో పాటు మెయిల్‌కు సమాచారం పంపినట్లు డిప్యూటీ సీఈఓ జి. వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. శ్రీ సత్యసాయి కలెక్టర్ వస్తారా..? జెడ్పీ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ డుమ్మా కొడుతున్నారు. మరికొన్ని శాఖల అధికారులు కూడా రావడం లేదు. ఈ అంశంపై సభ్యులు, ప్రజాప్రతినిధులు నిలదీస్తూ వస్తున్నారు. పునర్విభజన తరువాత శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బసంత్‌కుమార్ మాత్రమే క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరయ్యేవారు. ఆ తరువాత వచ్చిన కలెక్టర్లు జెడ్పీ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ అంశంపై గత సమావేశంలో ప్రజాప్రతినిధులు, సభ్యులు నిలదీశారు. కలెక్టరే లేకుంటే ఇక తామెందుకు రావాలని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాకుంటే వచ్చే సమావేశాన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ కలగజేసుకొని వచ్చే సమావేశానికి కచ్చితంగా ఆయన వచ్చేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే సమావేశానికై నా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ వస్తారా లేదా చూడాలి. -
గ్రామాల్లో పర్యటన
రాప్తాడు రూరల్/బుక్కరాయసముద్రం: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లితో పాటు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని పి.కొత్తపల్లి గ్రామంలో ఎస్సీ కులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం పర్యటించారు. ఎస్సీ రైతులు కాశయ్య, బాబయ్య చీనీ పంటలను పరిశీలించారు. దళిత రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప్పరపల్లిలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం వ్యవస్థను పరిశీలించారు. ఈ క్రాప్, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్హెచ్ఓ ఆయనకు వివరించారు. చైర్మన్ వెంట కలెక్టర్ వినోద్‌కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, హార్టికల్చర్ డీడీ నరసింహారావు, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, డ్వామా పీడీ సలీమ్‌బాషా తదితరులు ఉన్నారు. -
‘యంగ్ ఇండియా’ బేడీ ఇక లేరు
వయోభారంతో కన్నుమూసిన గ్రామీణ ఉపాధి హామీ హక్కుల ఉద్యమకారుడు పెనుకొండ రూరల్:యంగ్‌ఇండియా ప్రాజెక్టును స్థాపించి..ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ హక్కుల కోసం ఉద్యమించిన నరేంద్ర సింగ్ బేడీ (86) ఇకలేరు. వయో భారంతో సోమవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ఫారంలోని తన నివాసంలో కన్నుమూశారు. బేడీ 1939 సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. అమెరికాలో కెమికల్ ఇంజినీరింగ్ చదివి.. కొంతకాలం అక్కడే ఉద్యోగం చేశారు. 1969లో స్వదేశానికి తిరిగొచ్చారు. 1975–76 మధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు వచ్చారు. పెనుకొండ మండలం గుట్టూరు వద్ద 44వ జాతీయ రహదారికి సమీపంలో యంగ్ ఇండియా ప్రాజెక్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. తీవ్ర కరువు, పేదరికంతో జిల్లా కొట్టుమిట్టాడుతున్న ఆ రోజుల్లో రైతులు, గ్రామీణ శ్రామికులు, పేదల హక్కుల కోసం ఉద్యమించారు. భూ పోరాటాలతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. యంగ్ ఇండియా ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేశారు. రైతు సహకార, వ్యవసాయ కూలీల, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి..ఆయా వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వృద్ధిలోకి వచ్చేలా చైతన్య పరిచారు. దివ్యాంగులకు చేయూతనిచ్చారు. ఉపాధి హామీ కోసం ఉద్యమం పేదల అభివృద్ధికి ప్రభుత్వాల చేయూత కావాలనే సంకల్పంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నరేంద్ర సింగ్ బేడీ ఉద్యమించారు. గుట్టూరు నుంచి సంస్థ సభ్యులతో కలసి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి వినతి పత్రం ఇచ్చారు. అలాగే లక్ష సంతకాలు సేకరించి.. సైకిల్ ర్యాలీగా వెళ్లి అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గుడిసెల రామస్వామికి వినతి పత్రం అందజేశారు. అలాగే చుండూరులో దళితులపై దాడులు, మారణహోమాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులను చైతన్య పరిచారు. 1983లో భూ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. నరేంద్ర సింగ్ బేడీ.. మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ లాంటి ప్రముఖులకు సమకాలికులు. మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ..బేడీకి మూడేళ్ల జూనియర్. ఈయనకు భార్య సోనియాబేడీ, కుమారులు రాజీవ్, సంజయ్, కుమార్తె తారా ఉన్నారు. నేడు అంత్యక్రియలు బేడీ అంత్యక్రియలు మంగళవారం గుట్టూరు సమీపంలోని యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పరిశీలన మాటున పిడుగు!
రాయదుర్గం: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారిపై చంద్రబాబు సర్కారు కత్తి కట్టింది. పింఛన్ల తొలగింపునకు వైద్యులు, సిబ్బందిని రంగంలోకి దించింది. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెల ఫిబ్రవరి వరకూ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కోత పెట్టేందుకే.. అనర్హుల ఏరివేత ముసుగులో భారీగా కోత పెట్టేందుకు కూటమి సర్కారు కుట్రలు పన్నుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఏ ఆటంకం లేకుండా పింఛన్ అందుకుంటున్న వారిలో ఆందోళన మొదలైంది. ఇళ్ల వద్దకు వెళ్తున్న సిబ్బంది అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైకల్య ధ్రువీకరణ పత్రాలు కొత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి దాకా జరిగిన సర్వేలో కొన్ని లోటుపాట్లు గుర్తించినట్టు తెలిసింది. దీంతో తమ పింఛన్లు ఉంటాయో? ఊడతాయో? అన్న భయంతో పేదలు వణికిపోతున్నారు. ఇన్నాళ్లు వైద్య ఖర్చులకు భయం లేకుండా పోయిందని, పింఛన్లు తొలగిస్తే రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అంటూ.. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారందరికీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఖర్చులు, జీవనానికి సరిపడా మొత్తాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. ఠంఛన్‌గా ఒకటో తేదీన ఇళ్లవద్దే సొమ్ము పంపిణీ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పింఛన్లకు కోతపెట్టేలా కుట్రలు చేస్తుండటంతో లబ్ధిదారులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అర్హులకు ఏమాత్రం అన్యాయం జరిగినా రోడ్డెక్కాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. పింఛన్ల తొలగింపునకు చంద్రబాబు సర్కారు కుట్రలు జిల్లా వ్యాప్తంగా ‘అనారోగ్య పెన్షన్’ లబ్ధిదారులకు పరీక్షలు కోత వేసేందుకే కుయుక్తులు పన్నుతున్నారని సర్వత్రా విమర్శలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పేదలు ఆందోళన అవసరం లేదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారందరినీ వైద్యులు, సిబ్బంది పరిశీలిస్తారు. తాజా స్థితిగతులను అంచనా వేస్తారు. వైకల్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అర్హత కలిగిన వారి పింఛన్లు ఏ ఒక్కటి తొలగించే అవకాశం లేదు. పరీక్షల కోసం ఇళ్ల వద్దకు వచ్చే వైద్యులు, సిబ్బందికి పింఛనుదారులు సహకరించాలి. – ఈశ్వరయ్య, డీఆర్డీఏ పీడీ -
90 బస్సులు.. రూ. 29.27 లక్షల జరిమానా
● ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా అనంతపురం సెంట్రల్: సంక్రాతి పండుగ సందర్భంగా చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. మొత్తం 90 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 29,27,500 జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనర్ వీర్రాజు తెలిపారు. పండుగ రద్దీ సందర్భంగా అధిక ధరలకు బస్ టికెట్లు అమ్మకుండా అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. అధిక ధరలు వసూలు చేసినందుకు మూడు బస్సులపై, రోడ్డు ట్యాక్స్‌లు చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్నందుకు ఐదు బస్సులపై,సరుకు రవాణా, అధిక వేగం, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడం తదితర కారణాలతో 82 బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు వివరించారు. 8న నవోదయ ప్రవేశ పరీక్ష లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం (2025–26 విద్యా సంవత్సరం) దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,084 మంది విద్యార్థులు, 11వ తరగతిలో ప్రవేశానికి 1,228 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం లేపాక్షి నవోదయ విద్యాలయతో పాటు మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా 11వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం హిందూపురంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. www. navodaya.in వెబ్సైట్ నుంచి విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అప్పీలుకు నేడు ఆఖరు అనంతపురం: జిల్లాలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు వివిధ కారణాలతో గైర్హాజరైన అభ్యర్థులు అప్పీలు చేసుకునేందుకు మంగళవారం తుది గడువుగా నిర్దేశించినట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, గత నెల 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హిందూపురంలో నకిలీ నోట్ల కలకలం హిందూపురం అర్బన్: జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెలరోజుల క్రితం బత్తలపల్లిలో ఓ చిరువ్యాపారికి, ఇటీవలే కదిరిలో ఓ గొర్రెల వ్యాపారికి రూ.32 వేల విలువ జేసే రూ.500 నకిలీ నోట్లు అంటగట్టిన వైనం మరవకముందే తాజాగా సోమవారం హిందూపురంలోనూ నకిలీనోట్లు కలకలం సృష్టించాయి. ఓ చిల్లర దుకాణదారుని వద్ద నిత్యావసర సరకులు కొనుగోలు చేసిన వ్యక్తి సోమవారం రూ.500 నోట్లు మూడు ఇచ్చాడు. అయితే వాటిని మరో వ్యక్తికి ఇచ్చే తరుణంలో అవి నకిలీవని గుర్తించిన వ్యాపారి వెంటనే వాటిని చించేశాడు. ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో పోలీసుల నుంచి ఇబ్బందులు వస్తాయన్న భయంతోనే వ్యాపారి నకిలీ నోట్లను చించేసినట్లు తెలుస్తోంది. రోజుకోచోట నకిలీ నోట్లు చేతులు మారుతుండటంతో ఏది నకిలీ.. ఏది అసలో గుర్తించలేక జనం ఆందోళన చెందుతున్నారు. అసలు నోటును పోలిన నకిలీ నోట్లు మార్కెట్లో చలామణి చేస్తుండటంతో ప్రతి నోటు చూసి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోయంబత్తూరు, చైన్నె నుంచే సరఫరా..? నకిలీ కరెన్సీ నోట్లు తమిళనాడులోని కోయంబత్తూరు, చైన్నెలలో ముద్రించి కర్ణాటక మీదుగా జిల్లాలోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా రూ.500 నోట్లే ఉంటున్నాయి. అసలు నోటుకు మూడు నకిలీ నోట్లు ఇవ్వడం, కొందరు అమాయకుల వద్ద నేరుగా మార్చడం చేస్తున్నారు. ప్రధానంగా 9ఎఫ్బీ 248053, 2టీవీ 175028 సిరీస్ గల నకిలీ నోట్లు జిల్లాలో బయట పడ్డాయి. జిల్లాలోని కదిరి, హిందూపురం, మడకశిర, ధర్మవరం ప్రాంతాల్లో నకిలీ నోట్ల మారకం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎస్సీ ఉపకులాల వివరాలు సిద్ధం చేయండి
● అధికారులకు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశం ● ఎస్సీ సంఘాల ప్రతినిధుల నుంచి 237 వినతుల స్వీకరణఅనంతపురం అర్బన్/ఎడ్యుకేషన్/బుక్కరాయసముద్రం/గుంతకల్లుటౌన్/గార్లదిన్నె: ఎస్సీ ఉపకులాల వారీగా సమగ్ర వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అనంతపురం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీల జనాభా తదితర వివరాలను కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ వినోద్‌కుమార్ వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 40.81 లక్షలు కాగా, ఇందులో ఎస్సీలో 48 ఉపకులాలకు సంబంధించి జనాభా 5.83 లక్షలు (14.29 శాతం) ఉందని పేర్కొన్నారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు 4,75,632 మంది, మాల సామాజిక వర్గానికి చెందిన వారు 73,525 మంది, మిగిలిన ఉపకులాలకు చెందిన వారు 33,843 మంది ఉన్నారని చెప్పారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, 4, క్లాస్–4, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 48,080 మంది ఉన్నారన్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, వైద్య, పారామెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఉపకులాలకు చెందిన విద్యార్థులు 4,15,677 మంది ఉన్నట్లు వివరించారు. మునిసిపల్, హౌసింగ్, మెప్మా, డీఆర్డీఏ బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా లబ్ధిపొందిన ఎస్సీ, ఉపకులాల వారి వివరాలను తెలియజేశారు. కచ్చితమైన వివరాలు అందించాలి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ, ఉప కులాలకు సంబంధించి కచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు. వివరాల సేకరణలో తప్పిదాలు చోటు చేసుకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పనిచేయాలని చెప్పారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ సంఘాల నుంచి 237 వినతులు ఏకసభ్య కమిషన్ చైర్మన్‌కు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, మాల మహాసభ, ఎస్సీ కులాల జేఏసీ, జంగం హక్కుల పోరాట సమితి, ఇతర సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగుల నుంచి 237 వినతులు అందాయి. ● కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలు పెరిగి పోయాయని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీసెల్ నాయడులు వరికూటి కాటమయ్య ఏక సభ్య కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చైర్మన్ స్పందిస్తూ... ఈ నెల 31న నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. ● ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రాను పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, గృహ నిర్మాణాలు, భూమి కొనుగోలు పథకం, స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నియామకాల్లోనూ కర్షకులు, కార్మికులకు ఎలాంటి లబ్ధి జరగలేదన్నారు. వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ● ఎస్సీ జాబితా నుంచి మాలలను తొలగించి జనరల్ కేటగిరీలో కలపాలని ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ మీనుగ గోపాల్ కోరారు. ● రిజర్వేషన్ అమలులో ఎస్సీ ఉప కులాలకు సమన్యాయం చేయాలని ఎస్సీ,ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుళ్లాయప్ప కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు విన్నవించారు. ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మాదిగ సామాజికవర్గం నష్టపోతోంద న్నారు. అలాగే విద్య,ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో దామాషా ప్రకారం రావాల్సిన విద్యార్థుల సీట్లు, ఉద్యోగాలు పొందలేకపోతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. -
పాలకుల పుణ్యమా అని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్పుకున్నాయి. మట్కా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆ ప్రాంతం గంజాయి బ్యాచ్ అడ్డాగా కూడా మారిపోయింది. అధికారులపై బహిరంగంగానే బెదిరింపులకు దిగడం అక్కడ షరామూమూలే. అలాంటి ప్రాంతానికి ‘అఖిల భారత సర్వీసు అ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రి ఏఎస్పీగా నాలుగు రోజుల క్రితమే ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఏకంగా అఖిల భారత సర్వీసుల అధికారిని ఇక్కడికి కేటాయించడంతో అటు అసాంఘిక శక్తులతో పాటు ఇటు రాజకీయ నాయకులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మట్కా, గంజాయికి రాష్ట్రంలోనే కేంద్ర బిందువుగా మారిన తాడిపత్రి నియోజకవర్గంలో కొత్త ఏఎస్పీ రాకతో స్తబ్దత నెలకొన్నట్లు తెలి సింది. మట్కా ఏజెంట్లు, గంజాయి ముఠా, రకరకాల జూదం ఆడేవాళ్లు రెండురోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు. ఎక్కడైనా కొత్త పోలీసు అధికారి వచ్చీ రావడంతోనే అసాంఘిక కార్య కలాపాల కట్టడికి విస్తృతంగా దాడులు చేయడం మామూలే. అందుకే ఏఎస్పీ రాకతో తాడిపత్రిలో జూదరులు, మట్కాబీటర్లు తమ అక్రమ కార్యకలాపాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు సమాచారం. ప్రజల్లో భయం భయం.. విచ్చలవిడి మట్కా కార్యకలాపాలతో తాడిపత్రి రెండో ముంబైగా పేరుగాంచింది. ఇక్కడ జూదం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఇటీవల పట్టణంలో గంజాయి ముఠా ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. మద్యం అక్రమ అమ్మకాలు, దొంగతనాలు, రేప్ కేసులు, హత్యలు పెరిగాయి. టెండర్ల ద్వారా తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నా.. ఇతర ప్రాంతాల వారు అనే కారణంగా వారికి అద్దెకు భవనాలు కూడా దక్కనివ్వకుండా అడ్డుకున్నారు. మరోవైపు పట్టణ సమీపంలోని పెన్నానదిలో విచ్చలవిడిగా ఇసుక తోడేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిత్యం వందల టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తూ నది స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏమీ తెలియనట్లు మిన్నకుండి పోతుండటంతో పోలీసులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీకి చెందిన నాయకులు దాడులు చేశారని బాధితులు ఫిర్యాదు చేసినా సీఐలు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. తీవ్రంగా ఒత్తిళ్లు.. తాడిపత్రిలో పని చేసే అధికారులు జేసీ బ్రదర్స్ నుంచి తీవ్రంగా రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో గ్రూప్–1 అధికారి అయిన డీఎస్పీ చైతన్య తమకు సహకరించలేదన్న ఉద్దేశంతో జేసీ కుటుంబం ముప్పు తిప్పలు పెట్టి ఆయనను వేరే ప్రాంతానికి బదిలీ చేయించింది. కూటమి సర్కారు వచ్చాక ఇక్కడ ఒక తహసీల్దార్ విధుల్లో చేరేందుకు కూడా భయపడ్డారు. ఇటీవల ఏ తప్పూ లేకుండానే సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డితో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డికి క్షమాపణలు చెప్పించారు. దీంతో కిందిస్థాయి పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బ తింది. ఈ పరిస్థితులను నూతన ఏఎస్పీ రోహిత్‌కుమార్ ఎలా ఎదుర్కొంటారనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఏదిఏమైనా కొత్త ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి తాడిపత్రిలో అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ ఆయన ‘హిట్’ అవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఏఎస్పీ రాకతో ‘తాడిపత్రి’లో మారిన వాతావరణం అసాంఘిక శక్తుల అప్రమత్తం జూదరులు, గంజాయి ముఠా ఆచితూచి అడుగులు అధికారి తీరును బట్టి ముందుకెళ్లాలన్న ఆలోచనలో మట్కా బీటర్లు పోలీసుల తీరుపై ఇప్పటికే విసుగెత్తిన స్థానికులు ఐపీఎస్‌పై బోలెడన్ని ఆశలు