ముప్పుటేరు
Published Tue, Feb 7 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న ప్రధాన డ్రెయిన్ ఉప్పుటేరు సిల్టు, కిక్కిసతో పూడుకుపోతుంది. దీంతో వరదల సమయంలో డ్రెయిన్ పరివాహక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఉప్పుటేరు కొల్లేరు నుంచి ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెంలో సముద్రంలో కలుస్తుంది. దీనిని ఆనుకుని సుమారు 80 వేల ఎకరాల్లో వరి, ఆక్వా సాగుచేస్తున్నారు. ఉప్పుటేరు అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ఏటా వర్షాకాలంలో డ్రెయిన్ పొంగి పొర్లుతుంది. దీనికితోడు సముద్రపు ఆటుపోటులకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉప్పుటేరు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాగు, సాగు నీరు కొరత తీరుతుందని నిపుణులు సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఉప్పుటేరు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా ఉన్న కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయ సమీపంలో కొల్లేటికోట జీరో మైలు రాయి వద్ద ప్రారంభమై ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాలు మీదుగా సముద్రంలో కలుస్తుంది. సముద్రపు ఆటుపోటులను ఎదుర్కొంటూ ఎగువ ప్రాంతాల్లో ముంపునీటిని సముద్రంలోకి తరలిస్తుంది. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, చేపల చెరువులు, లోతట్టు ప్రాంతాలను ఉప్పుటేరు కాపాడుతుంది. అయితే ఉప్పుటేరుపై అధికారులు దృష్టి సారించకపోవడంతో చాలా చోట్ల మూడు మీటర్లు పైగా లోతు ఉండాల్సిన డ్రెయిన్ మీటరు లోతుకు పూడుకుపోయింది.
పూడికతీతను మరిచారు
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉప్పుటేరు పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తట్ట మట్టికూడా తీయకపోవడంతో ఉప్పుటేరు పూడుకుపోతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేలాది ఎకరాలు నీటమునగడంతోపాటు పరివాహక ప్రాంత గ్రామాలన్నీ ఉప్పుకయ్యలుగా మారే ప్రమాదం ఉందని జలవనరుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సముద్ర ముఖద్వారం నుంచి ఉప్పుటేరు ఎగువ ప్రాంతం వరకు డ్రెజ్జింగ్ చేసి పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ముంపు తప్పట్లేదు
అధిక వర్షాలు, తుపానుల సమయంలో ఉప్పుటేరు ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లన్నీ పొంగిపొర్లుతూ ఉప్పుటేరులో కలుస్తున్నాయి. దీంతో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తూ సముద్రం వైపు కదులుతుంది. ఇదే సమయంలో సముద్రపు ఆటుపోటుల కారణంగా సముద్రం నీరు ఉప్పుటేరులోకి ఎగదన్నడం వల్ల వర్షం నీరు గ్రామాలను ముంచెత్తుతోంది.
డ్రెయిన్లన్నీ ఉప్పుటేరులోకే..
జిల్లాలోని అన్ని ప్రధాన డ్రైయిన్లు దక్షిణం వైపున ఉన్న ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి. కొల్లేరుతోపాటు ప్రధాన డ్రెయిన్లయిన మొగదిండి, కొత్త యనమదుర్రు, బొండాడ, పొలిమేరతిప్ప, పాత యనమదుర్రు, సాల్ట్‌క్రీక్ డ్రెయిన్లు ఉప్పుటేరులో కలుస్తున్నాయి. పలు చిన్న, మధ్య తరహా డ్రెయిన్లు ఉప్పుటేరులోనే కలుస్తున్నాయి.
స్లూయిజ్ నిర్మిస్తే లాభం
ఉప్పుటేరు డ్రెయిన్‌కు మొగలో స్లూయిజ్ నిర్మిస్తే పంటలు సస్యశ్యామలం అవుతాయని రైతులు అంటున్నారు. ఏటా జనవరి నుంచి జూన్ నెల వరకు సముద్రం నుంచి ఉప్పునీరు
కొల్లేరు వరకు ఎగదన్నడంతో ఈ ప్రాంతం ఉప్పుకయ్యలుగా మారుతోంది. స్లూయిజ్ నిర్మాణంతోనే దీనిని అడ్డుకోవచ్చని రైతులు
అంటున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
భీమవరం డివిజన్‌లో ఉప్పుటేరు 33 మైళ్లు వరకు వ్యాపించి ఉంది. దీని పూడికతీత పనులకు సంబంధించి నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ఉప్పుటేరు అభివృద్ధికి కృషిచేస్తాం. – సుజాత, డ్రెయిన్‌స డీఈ
Advertisement
Advertisement