
చైనీస్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్
షాంఘై: ఫార్ములావన్ సీజన్ రెండో రేసు చైనీస్ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి (ఆస్ట్రేలియా) పోల్ పోజిషన్ సాధించాడు. ఫార్ములావన్ కెరీర్‌లో అతడికి ఇదే తొలి పోల్ పొజిషన్ కావడం విశేషం. 23 ఏళ్ల ఆసీస్ రేసర్ శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా... 1 నిమిషం 30.641 సెకన్లలో ల్యాప్ పూర్తిచేశాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును పియాస్ట్రి తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.
మెర్సెడెస్ డ్రైవర్ రసెల్ (1 నిమిషం 30.723 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. గత వారం ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) చైనీస్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. 56 ల్యాప్‌లతో కూడిన రేసులో మెక్‌లారెన్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 30. 793 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు.
గత వారం సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన నోరిస్ ఈ రోజు జరగనున్న రేసును మూడో స్థానంతో ప్రారంభించనున్నాడు. మాజీ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 30.817 సెకన్లు) నాలుగో ‘ప్లేస్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment