
ఫార్ములావన్ 75వ సీజన్ ఆరంభ వేడుకలు
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్‌లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సీజన్‌లో పోటీపడే 20 మంది డ్రైవర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... స్టేజి మీదకు వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది.
సుదీర్ఘ ఎఫ్1 చరిత్రలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి కాగా... ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది. కనీవినీ ఎరగని రీతిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో... పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. ఫార్ములావన్‌ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుకు నిర్వహించారు.
దీనిపై హామిల్టన్ స్పందిస్తూ... ‘చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త సీజన్‌లో మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తున్నా. అందుకు కావాల్సిన శక్తి ఉంది. కొత్త జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్తేజంతో ముందుకు సాగుతా’ అని అన్నాడు. 24 రేసులతో కూడిన 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్‌బోర్న్‌లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment