అభిమానులకు హామిల్టన్ అభివాదం
ఫియోరానో మోడినీస్ (ఇటలీ): ఫార్ములావన్ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన లూయిస్ హామిల్టన్ 40 ఏళ్ల వయసులో కొత్త జట్టు ‘ఫెరారీ’ తరఫున తన సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 2025 సీజన్ కోసం ఫెరారీ జట్టుతో చేరిన హామిల్టన్ బుధవారం తొలిసారి ఆ టీమ్ ఎఫ్1 కారుతో డ్రైవింగ్ చేశాడు. టీమ్ ట్రాక్ ఫియోరానో వద్ద ఫెరారీ లోగో ఉన్న హెల్మెట్ ధరించి ఎస్‌ఎఫ్–23 కారుతో దూసుకెళ్లిన అతను పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులకు అభివాదం చేశాడు.
హామిల్టన్ కోసమే ఇటాలియన్ ఫ్యాన్స్ సమీపంలోనే బ్రిడ్జ్ వద్ద ఎదురు చూస్తూ కనిపించారు. ఎఫ్1లో 12 ఏళ్ల పాటు మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ ఆ జట్టు తరఫున ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు మెక్‌లారెన్ టీమ్ తరఫున కూడా మరో ప్రపంచ టైటిల్ నెగ్గిన అతను మొత్తం ఏడుసార్లు విశ్వవిజేతగా నిలిచి మైకేల్ షుమాకర్‌తో సమంగా నిలిచాడు.
‘ఫెరారీ తరఫున బరిలో దిగేందుకు నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. అలాంటి అవకాశం వస్తుందని కొంత కాలం వరకు కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు నా కల నిజమైంది. నా కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాను. ఇప్పుడు ఈ టీమ్ తరఫున ఆడటం మరింత ఆనందాన్నిస్తోంది’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్‌బోర్న్‌లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment