opening ceremonies
-
అంగరంగ వైభవంగా...
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సీజన్లో పోటీపడే 20 మంది డ్రైవర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... స్టేజి మీదకు వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. సుదీర్ఘ ఎఫ్1 చరిత్రలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి కాగా... ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది. కనీవినీ ఎరగని రీతిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో... పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. ఫార్ములావన్‌ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుకు నిర్వహించారు. దీనిపై హామిల్టన్ స్పందిస్తూ... ‘చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త సీజన్లో మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తున్నా. అందుకు కావాల్సిన శక్తి ఉంది. కొత్త జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్తేజంతో ముందుకు సాగుతా’ అని అన్నాడు. 24 రేసులతో కూడిన 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలవుతుంది. -
ఒలింపిక్స్ క్రీడా మహోత్సవం ప్రారంభం..
టోక్యో: కోవిడ్ దెబ్బతో పలుమార్లు వాయిదాపడిన ఒలింపిక్స్ క్రీడలు ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభయ్యాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా మహోత్సవాలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. ఒలింపిక్స్ క్రీడలను జపాన్ చక్రవర్తి నరహిటో ప్రారంభించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఆరంభోత్సవం జరిగింది. భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. 203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి రోజువారి భత్యం కింద రూ.3,723 ఇవ్వనున్నారు. -
నాకు తెలియకుండానే ప్రారంభిస్తారా? మేయర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తనకు తెలియకుండానే పనులు జరుగుతుండటంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఇంజినీరింగ్ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. వివరణ కోరుతూ కమిషనర్ లోకేశ్‌కుమార్ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్ఈలకు కూడా మెమోలు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ వివరణలు కూడా పంపినట్లు సమాచారం. -
ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవాలు
-
అన్నివర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి మెదక్: రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి చేస్తున్నదని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. సోమవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఆయన పలు అబివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. నవాబుపేటలోగల ఈద్గవద్ద అభివృద్ధి పనులకు రూ.10 లక్షలు, మున్నూరుకాపు, ముదిరాజ్ భవన నిర్మాణాలకోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక వైస్రాయ్గార్డెన్లో స్వర్ణకారుల సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు. అలాగే కులవృత్తులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. స్వర్ణకారుల బతుకులు దుర్భరంగా మారాయని, వీరి దుస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధి కోసం కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్‌చైర్మన్ రాగి అశోక్, ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి, స్వర్ణకారుల సంఘం నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్ రవి, రమేష్‌చారి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ పాపన్నపేట: ఏడుపాయలలోని వనదుర్గామాతను స్పీకర్ మధుసూదనాచారి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతు తెలంగాణ ప్రజల ఆశయాల కనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఏడుపాయల అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఘనస్వాగతం స్పీకర్ మధుసుదనాచారి, డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి లకు ఏడుపాయల్లో ఘనస్వాగతం పలికారు.రాజగోపురం వద్ద నుంచి ఈఓ వెంకటకిషన్‌రావు, ఆలయ సిబ్బంది, వేదబ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.ఆపై శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మెంచు నగేష్, ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్నబాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగు రింగ్‌ల రియో
• ఘనంగా జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు • సంస్కృతి, చరిత్ర, సంగీత నేపథ్యాన్ని చాటిన కళాకారులు • పర్యావరణంపై ప్రత్యేక దృష్టి ఆర్థికంగా బలహీనత.. రాజకీయంగా అస్థిరత.. నీటి కాలుష్యం.. సౌకర్యాల లేమి.. పెరిగిన నేరాలు.. ఇలా గేమ్స్ నిర్వహణపై అందరికీ సవాలక్ష అనుమానాలు.. వీటన్నింటినీ తట్టుకుని బ్రెజిల్ సగర్వంగా తలెత్తుకు నిలబడింది. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తమకున్న పరిమిత వనరులతోనే ప్రారంభ వేడుకలను అద్భుతంగా జరిపింది. గతంలో జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లోనే కళ్లు చెదిరే రీతిలో ఈవెంట్ నిర్వహించి విశ్వ వ్యాప్తంగా వీక్షకులను అబ్బుర పరిచింది. తమ దేశ సంస్కృతిని, ఘనమైన చరిత్రను ప్రపంచం ముందుంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అందరూ ఆలోచించే విధంగానూ ప్రదర్శన ఇచ్చి తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పింది. ఓవరాల్‌గా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ తరహాలో అందరి మనస్సులను గెలుచుకుని వహ్..బ్రెజిల్ అనిపించుకోగలిగింది. రియో డి జనీరో: కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో పాటు వేలాది కళాకారుల అచ్చెరువొందే ప్రదర్శనలతో మరకానా స్టేడియం దద్దరిల్లింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన సాంబా డ్యాన్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే... మరోవైపు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన భూతాపం గురించి తెలియజెపుతూ శభాష్ అనిపించుకున్నారు. ప్రపంచంలోనే దట్టమైన అడవులుగా పేరు తెచ్చుకున్న అమెజాన్ మెల్లమెల్లగా ఎలా అంతరించిపోతుందో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించి ఆలోచనల్లో ముంచారు. ఓవరాల్‌గా కేవలం వినోదానికే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి మనం ఏం చేయగలమనే భావనను అందరి మదిలో కలిగించి బ్రెజిల్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. భారత కాలమానప్రకారం శనివారం తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రారంభమైన ఈ 31వ ఒలింపిక్స్ వేడుకలను 70 వేలకు పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించగా... టీవీల ద్వారా మూడు వందల కోట్ల మంది వీక్షించారు. మార్చ్‌పాస్ట్‌లో షూటర్ అభినవ్ బింద్రా భారత పతాకధారిగా ముందుకు సాగాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ మారథాన్‌లో కాంస్యం సాధించిన వాండర్లీ డి లిమా ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించిన గౌరవాన్ని దక్కించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైకేల్ టెమెర్ పోటీలు ప్రారంభమవుతున్నట్టు ప్రకటించారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల ఖర్చులో కేవలం 5 శాతంతోనే బ్రెజిల్ సంబరాలను ఆకట్టుకునే విధంగా జరిపించడం విశేషం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ⇔ బ్రెజిల్ జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ⇔ అనంతరం షో డెరైక్టర్ ఫెర్నాండో మిరెల్లెస్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన ప్రారంభమైంది. ⇔ మెటాలిక్ దుస్తులు ధరించిన రోబోటిక్ డ్యాన్సర్లు తొలి ప్రదర్శన ఇచ్చారు. మరోవైపు స్టేడియం పైన ఎరుపు, పసుపు రంగుల్లో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. ⇔ అనేక సంస్కృతుల మేళవింపుతో ఆధునిక బ్రెజిల్ రూపుదిద్దుకున్నదనే కాన్సెప్ట్‌తో ఆఫ్రికా, సిరియా, జపనీస్ కళాకారులు ప్రదర్శన చేశారు. ⇔ వేదికపైనే ఆకాశహర్మ్యాలను పోలిన భవంతులపై డ్యాన్స్ చేస్తున్నట్టుగా అందరినీ భ్రమింపచేసిన రూపకం ఆశ్చర్యపరిచింది. ⇔ ఫ్యాషన్ ప్రపంచంలో తమ ఘనతను చాటేలా బ్రెజిలియన్ సూపర్ మోడల్ గిసెలె బుండ్చెన్ వేదికపై క్యాట్‌వాక్ చేసి అలరించింది. ⇔ బ్రెజిల్ స్లమ్‌లో అభివృద్ధి చెందిన పాస్సియో స్ట్రీట్ డ్యాన్స్‌ను పూర్తిగా తెల్ల దుస్తులు ధరించిన నృత్యకారులు అక్కడున్న వారిని చిందేసేలా చేశారు. ⇔ బ్రెజిల్‌కు నల్లజాతీయులు చేసిన సేవలకు గుర్తింపుగా ఓ డ్యాన్సర్ కపోయిరా (డ్యాన్స్, ఏరోబాటిక్, మార్షల్ ఆర్ట్స్ కలబోత) ప్రదర్శన చేశాడు. ⇔ అనంతరం స్టేడియంలోని ప్రతీ ఒక్కరిని బ్రెజిలియన్ ప్రఖ్యాత మ్యూజిక్ గుస్టోకు డ్యాన్స్ చేయాల్సిందిగా ఆహ్వానించారు. ⇔ దీని తర్వాత ప్రదర్శన ఒక్కసారిగా ధరిత్రి భవిష్యత్పైకి మారింది. ⇔ వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారణ, ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచును అందరికీ అర్థమయ్యే రీతిలో వీడియో రూపంలో ప్రపంచం ముందుంచారు. ⇔ అనంతరం 200కు పైగా దేశాలకు చెందిన అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ ద్వారా స్టేడియంలోకి అడుగుపెట్టారు. ఆధునిక ఒలింపిక్స్‌కు ఆద్యులుగా చెప్పుకునే గ్రీస్ దేశానికి చెందిన అథ్లెట్లు ముందుగా వచ్చారు. ⇔ ఇక 95వ దే శంగా స్టేడియంలోకి అడుగిడిన భారత్ తరఫున షూటర్ అభినవ్ బింద్రా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రాగా దాదాపు 70 మంది అథ్లెట్లు 24 మంది అధికారులు అనుసరించారు. పురుష క్రీడాకారులు నేవీ బ్లూ కలర్ బ్లేజర్స్, ప్యాంట్స్.. మహిళా అథ్లెట్స్ బ్లూ బ్లేజర్స్‌తో పాటు సంప్రదాయ చీరలు ధరించి వచ్చారు. ⇔ శనివారం మ్యాచ్ కారణంగా భారత పురుషుల హాకీ జట్టు విశ్రాంతి తీసుకోగా ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ ఆటగాళ్లు కూడా వేడుకలకు హాజరుకాలే దు. ⇔ పోటీల నుంచి అధికారికంగా నిషేధం విధించిన కువైట్ ఆటగాళ్లు ఐఓసీ పతాకంతో అడుగుపెట్టారు. ⇔ అందరిలోకి టోంగా దేశం తరఫున పతాకధారిగా వచ్చిన పిటా తౌఫాటోఫువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తైక్వాండో అథ్లెట్ అయిన 32 ఏళ్ల తౌఫా తన అధికారిక జెర్సీని వదిలి చాతీపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటికి ఆయిల్ పూసుకుని కింద పొడవాటి స్కర్ట్ ధరించి చేతిలో తమ పతాకంతో స్టేడియంలోకి వచ్చాడు. దీంతో తన వేషధారణతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ⇔ తొలిసారిగా ఇరాన్‌కు చెందిన మహిళా అథ్లెట్ జహ్రా నెమటి తమ పతాకంతో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఇస్లామిక్ సంప్రదాయాలను కఠినంగా పాటించే ఇరాన్ తమ మహిళా అథ్లెట్లను గతంలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతించేది కాదు. ⇔ ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా పాల్గొంటున్న యుద్ధ బాధిత దేశాలకు చెందిన చెందిన శరణార్థి ఒలింపిక్ జట్టుకు స్టేడియంలోని ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ⇔ చిట్ట చివరిగా ఆతిథ్య దేశానికి చెందిన బ్రెజిల్ అథ్లెట్లు హర్షధ్వానాలతో మరకానాలో అడుగుపెట్టారు. ⇔ ఆటగాళ్ల రాక పూర్తయిన తర్వాత పచ్చటి ఆకులతో కూడిన ఒలింపిక్ రింగ్స్‌ను ప్రదర్శించారు. ⇔ అనంతరం రియో గేమ్స్ కమిటీ అధ్యక్షుడు కార్లోస్ నుజమన్, ఐఓసీ చీఫ్ బాచ్ ప్రసంగించారు. తమ ఒలింపిక్ కల నిజమైందని కార్లోస్ ఘనంగా చాటారు. ⇔ చివరిగా 26 వేల కి.మీ ప్రయాణం అనంతరం రియోకి చేరిన టార్చిని మాజీ టెన్నిస్ స్టార్ గుస్తావో కుయెర్టిన్ స్టేడియంలోకి తీసుకొచ్చి మాజీ బాస్కెట్‌బాల్ ఆటగాడు హోర్టెన్సియా మర్కారికి అందించారు. ఆయన నుంచి వాండర్లే డి లిమా అందుకుని జ్యోతిని వెలిగించడంతో బాణసంచా వెలుగులతో స్టేడియంతో పాటు రియో నగరం ధగధగలాడింది.