
పనాజీ: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో స్టాపేజ్ టైమ్‌లో గోల్ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్ బ్రదర్స్ జట్టుతో స్టాపేజ్ టైమ్‌లో (90+11వ నిమిషంలో) గోల్ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కింది.
స్టాపేజ్ టైమ్‌లో లభించిన పెనాల్టీ కిక్‌ను శ్రీనిధి డెక్కన్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ కాస్టనెడా గోల్‌గా మలిచాడు. ఈ లీగ్‌లో ‘టాప్ గోల్‌స్కోరర్’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్‌తో చర్చిల్ బ్రదర్స్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడి, 6 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుతో ఆడుతుంది.