
2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ప్రధాన టోర్నీకి న్యూజిలాండ్, న్యూ కాలడోనియా అర్హత
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది.
ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్‌ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు.
Comments
Please login to add a commentAdd a comment