‘టాప్స్‌’లో జ్యోతి సురేఖ | Jyoti Surekha gets a place in the Target Olympic Podium Scheme | Sakshi
Sakshi News home page

‘టాప్స్‌’లో జ్యోతి సురేఖ

Published Thu, May 1 2025 2:55 AM | Last Updated on Thu, May 1 2025 2:55 AM

Jyoti Surekha gets a place in the Target Olympic Podium Scheme

మరో ఆరుగురు కాంపౌండ్‌ ఆర్చర్లకు చోటు

లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాలకు చేయూత  

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో చోటు దక్కింది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్‌ విభాగాన్ని కూడా చేర్చడంతో... ఈ విభాగంలో పోటీ పడుతున్న జ్యోతి సురేఖకు మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు ‘టాప్స్‌’ ఉపయోగపడనుంది. ఈ మేరకు బుధవారం మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఎంఓసీ) 155వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, వీరేన్‌ రస్కిన్హా,  ప్రశాంతి సింగ్, సోమయ్య, సిద్ధార్థ్‌ శంకర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

జ్యోతి సురేఖతో సహా ఏడుగురు కాంపౌండ్‌ ఆర్చర్‌లకు ‘టాప్స్‌’లో చోటు కల్పించారు. ఇందులో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు అభిషేక్‌ వర్మ, పర్ణీత్‌ కౌర్, ప్రవీణ్‌ ఒజస్, ప్రపంచ చాంపియన్‌ అదితి గోపీచంద్, ప్రియాన్‌‡్ష, ప్రథమేశ్‌ ఉన్నారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. గత ఆసియా క్రీడల్లో  మిక్స్‌డ్, టీమ్, వ్యక్తిగత విభాగాల్లో విజేతగా నిలిచింది.  

‘2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్‌ విభాగాన్ని చేర్చాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిర్ణయించింది. దీంతో ఎంఓసీ భేటీ నిర్వహించి కాంపౌండ్‌ ఆర్చర్లకు టాప్స్‌లో అవకాశం కల్పించాం. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్‌లలో ప్రదర్శన ఆధారంగా ఆర్చర్లను టాప్స్‌కు ఎంపిక చేశాం. అలాగే టాప్స్‌లో ఉన్న ఇతర క్రీడాకారులకు కూడా నిధులు విడుదల చేశాం’ అని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ఒక ప్రకటనలో తెలిపింది.  

» ‘టాప్స్‌’లోని 56 మంది అథ్లెట్లకు సంబంధించిన రూ. 4.37 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు.   
»   తాష్కెంట్‌లో 17 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ శిక్షణలో పాల్గొనేందుకు తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ఆమోదం లభించింది. ఈ నెల 8 నుంచి 23 వరకు ఉజ్బెకిస్తాన్‌ జట్టుతో ఈ ట్రైనింగ్‌ సాగనుంది. 
»   టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్లు ఆకుల శ్రీజ, మనిక బత్రా ఐటీటీఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో పాల్గొనేందుకు ముందస్తు నిధులు విడుదల చేశారు. ఖతర్‌ వేదికగా ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనుంది.  
»  ఈ నెల 9 నుంచి యూఏఈ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు లాంగ్‌ జంపర్‌ శైలి సింగ్‌కు ఆర్థిక సాయం కూడా అందించారు.   
»   ఇక టెన్నిస్‌ యువ సంచలనం మాయా రాజేశ్వరన్‌కు కూడా ‘టాప్స్‌’ నిధులు అందించింది. స్పెయిన్‌లోని రఫా నాదల్‌ అకాడమీలో శిక్షణ పొందేందుకు అవసరమైన నిధులు విడుదల చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement