
నేటి నుంచి ఫార్ములావన్ సీజన్
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో ప్రారంభం
నేడు క్వాలిఫయింగ్ సెషన్
రేపు ప్రధాన రేసు
ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
మెల్‌బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్‌స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున హామిల్టన్ మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ఇద్దరిని కాదని మూడో రేసర్ రూపంలో కొత్త విశ్వవిజేత ఆవిర్భవిస్తాడా? వీటన్నింటికీ సమాధానం నేటి నుంచి మొదలయ్యే ఫార్ములావన్ 75వ సీజన్‌లో లభిస్తుంది. 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు ఆదివారం ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో తెర లేస్తుంది.
2019 తర్వాత మళ్లీ ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ మొదలుకానుండటం విశేషం. 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. క్వాలిఫయింగ్ సెషన్‌లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును 20 మంది డ్రైవర్లు ఏ స్థానం నుంచి ప్రారంభిస్తారో నిర్ణయిస్తారు.
గత నాలుగేళ్లుగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్‌స్టాపెన్ ఎదురులేని విజేతగా నిలుస్తున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నుంచి వెర్‌స్టాపెన్‌కు పోటీ లభిస్తున్నా... విజయాల పరంగా వెర్‌స్టాపెన్ ముందుకు దూసుకెళ్తున్నాడు. మెర్సిడెస్ జట్టు తరఫున 2013 నుంచి 2024 వరకు బరిలోకి దిగిన హామిల్టన్ ఈసారి తన కెరీర్‌లో తొలిసారి ఫెరారీ జట్టు తరఫున డ్రైవ్ చేయనున్నాడు.
2007 నుంచి 2012 వరకు మెక్‌లారెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ 2008లో తొలిసారి వరల్డ్ చాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత 2013 నుంచి 2024 మధ్య కాలంలో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఈ ఏడాది వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్, లెక్‌లెర్క్, లాండోనోరిస్, కార్లోస్ సెయింజ్ జూనియర్, జార్జి రసెల్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశం ఉంది.
పాయింట్లు ఎలా ఇస్తారంటే...
ఫార్ములావన్‌లో ప్రతి గ్రాండ్‌ప్రి మూడు రోజులు కొనసాగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్... శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. కొన్ని గ్రాండ్‌ప్రిలలో శనివారం స్ప్రింట్ రేసులను నిర్వహిస్తారు. ఈ రేసు 100 కిలోమీటర్లు జరుగుతుంది. అయితే స్ప్రింట్ రేసు ఫలితాలకు ప్రధాన రేసు ఫలితాలకు సంబంధం ఉండదు. ఇక ప్రధాన రేసులో టాప్–10లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు.
తొలి స్థానం నుంచి పదో స్థానం వరకు నిలిచిన డ్రైవర్లకు వరుసగా 25, 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్ లభిస్తుంది. రేసు మొత్తంలో ఫాస్టెస్ట్ ల్యాప్ నమోదు చేసిన డ్రైవర్‌కు బోనస్‌గా ఒక పాయింట్ ఇస్తారు. సీజన్‌లోని 24 రేసులు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన డ్రైవర్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ లభిస్తుంది. అత్యధిక పాయింట్లు సంపాదించిన జట్టుకు కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కుతుంది.
ఏ జట్టులో ఎవరున్నారంటే...
ఈ ఏడాది కూడా ఫార్ములావన్ టైటిల్ కోసం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు బరిలో ఉన్నారు. ఒక్కో జట్టు తరఫున ఇద్దరు డ్రైవర్లు ప్రధాన రేసులో పోటీపడతారు. ఇద్దరు డ్రైవర్లలో ఎవరైనా పాల్గొనకపోతే అదే జట్టులో ఉన్న రిజర్వ్ డ్రైవర్‌కు అవకాశం లభిస్తుంది. ఈ సీజన్‌లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డ్రైవర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రెడ్‌బుల్: మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్), లియామ్ లాసన్ (న్యూజిలాండ్).
ఫెరారీ: లూయిస్ హామిల్టన్ (బ్రిటన్), చార్లెస్ లెక్‌లెర్క్ (మొనాకో).
మెర్సిడెస్: జార్జి రసెల్ (బ్రిటన్), ఆంటోనెలి (ఇటలీ).
మెక్‌లారెన్: లాండో నోరిస్ (బ్రిటన్), ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా)
ఆలై్పన్: పియరీ గ్యాస్లీ (ఫ్రాన్స్), జాక్ దూహన్ (ఆ్రస్టేలియా).
ఆస్టన్ మార్టిన్: లాన్స్ స్ట్రోల్ (కెనడా), ఫెర్నాండో అలోన్సో (స్పెయిన్).
హాస్: ఎస్తెబన్ ఒకాన్ (ఫ్రాన్స్), ఒలివెర్ బేర్మన్ (బ్రిటన్).
కిక్ సాబెర్: నికో హుల్కెన్‌బర్గ్ (జర్మనీ), బొర్టెలెటో (బ్రెజిల్).
రేసింగ్ బుల్స్: హాద్జర్ (ఫ్రాన్స్), యూకీ సునోడా (జపాన్)
విలియమ్స్: ఆల్బన్ (థాయ్‌లాండ్), కార్లోస్ సెయింజ్ (స్పెయిన్)

34 ఇప్పటి వరకు ఫార్ములావన్‌లో 34 వేర్వేరు డ్రైవర్లు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. అత్యధికంగా 7 సార్లు చొప్పున మైకేల్ షుమాకర్ (జర్మనీ), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) టైటిల్స్ గెలిచారు. షుమాకర్ వరుసగా ఐదేళ్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. షుమాకర్ రికార్డును సమం చేసేందుకు వెర్‌స్టాపెన్‌కు ఈసారి అవకాశం లభించనుంది. గతంలో హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్‌కు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.
17 ఫార్ములావన్‌లో 17 మంది డ్రైవర్లు ఒక్కసారి మాత్రమే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచారు.
105 ఫార్ములావన్ చరిత్రలో హామిల్టన్ గెలిచిన రేసులు. అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ రికార్డు హామిల్టన్ పేరిట ఉంది. షుమాకర్ (91), వెర్‌స్టాపెన్ (63), వెటెల్ (53), అలైన్ ప్రాస్ట్ (51) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
3 ఈ సీజన్‌లో బరిలో దిగుతున్న 20 మంది డ్రైవర్లలో ముగ్గురు ప్రపంచ చాంపియన్స్ ఉన్నారు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (2021, 2022, 2023, 2024), తొలిసారి ఫెరారీ తరఫున పోటీపడుతున్న లూయిస్ హామిల్టన్ (2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020), ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో (2005, 2006) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment