ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో తొలి విజయమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. మెల్‌బోర్న్‌లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 16.732 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఇప్పటి వరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో పోటీపడ్డ వెర్‌స్టాపెన్ 2019లో అత్యుత్తమంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌కు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు జార్జి రసెల్, లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించనుంది. రసెల్ రెండో స్థానం నుంచి, హామిల్టన్ మూడో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో రెండు రేసులు జరగ్గా.. తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌పిలో వెర్‌స్టాపెన్, రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో సెర్జియో పెరెజ్ విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment