సవాళ్లకు సిద్ధమైన అర్జున్, ప్రజ్ఞానంద
బరిలో ప్రపంచ చాంపియన్ గుకేశ్
పన్‌జిమ్ (గోవా): సొంతగడ్డపై జరిగే చెస్ ప్రపంచకప్‌లో హేమాహేమీలతో పావులు కదిపేందుకు భారత గ్రాండ్‌మాస్టర్లు సిద్ధమయ్యారు. తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి, తమిళనాడు మేటి ఆటగాడు ఆర్.ప్రజ్ఞానంద సహా పలువురు ఆతిథ్య ఆటగాళ్లు ప్రపంచ దిగ్గజాలను ఢీకొట్టేందుకు సై అంటున్నారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ కూడా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగాడు. అయితే దశాబ్దంపైగా ప్రపంచ చెస్‌ను ఏలిన చదరంగ రారాజు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), అమెరికన్ స్టార్లు హికరు నకముర, ఫాబియానో కరువానా ఈ టోర్నీకి గైర్హాజరు అవుతున్నారు.
ఇక టోర్నీ విషయానికొస్తే ఇది ఆషామాషీ ప్రపంచకప్ కాదు. తదుపరి ప్రపంచ చాంపియన్‌కు క్వాలిఫయింగ్ టోర్నీగా పేర్కొనవచ్చు. వచ్చే ఏడాది జరగబోయే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు ఈ టోర్నీ ద్వారా ముగ్గురు అర్హత సాధిస్తారు. ఈ ముగ్గురిలో ఒకరు ప్రస్తుత చాంపియన్ గుకేశ్‌తో టైటిల్ కోసం ఢీ కొంటాడు. సుమారు 80 దేశాలకు చెందిన 206 మంది టాప్ చెస్ ప్లేయర్లు పోటీపడేందుకు గోవా చేరుకున్నారు.
నాలుగు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత ఆటగాళ్లంతా ప్రపంచ చాంపియన్లు గుకేశ్ (పురుషులు), దివ్య దేశ్‌ముఖ్ (మహిళలు)లే స్ఫూర్తిగా బరిలోకి దిగుతున్నారు. వెటరన్ స్టార్ పెంటేల హరికృష్ణ, అనుభవజు్ఞడైన విదిత్ గుజరాతీలతో పాటు యువ సంచలనాలు నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరంలు సైతం ప్రపంచ దిగ్గజాలకు సవాళ్లు విసరనున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో కొత్తగా 24 మంది భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సంచలన ఫలితాలు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
గుకేశ్ ప్రపంచ చాంపియన్ కావడంతో గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. అతను ఎలో రేటింగ్‌ను మెరుగు పర్చుకునేందుకే బరిలోకి దిగుతున్నాడు. అర్జున్, ప్రజ్ఞానందలు మాత్రం క్యాండిడేట్స్ టోర్నీపై గంపెడాశలతో ఉన్నారు. ఇంకా ఈ టోర్నీలో డచ్ సూపర్‌స్టార్ అనిశ్ గిరి, జర్మనీ టాప్ ప్లేయర్ విన్సెంట్ కీమర్, ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసతొరొవ్‌లు సైతం క్యాండిడేట్స్ టోర్నీ లక్ష్యంగా పైఎత్తులు వేసేందుకు సిద్ధమయ్యారు.
టోర్నీ కథా కమామీషు...
టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 17.75 కోట్లు (2 మిలియన్ డాలర్లు). ఇందులో విజేతగా నిలిచిన చాంపియన్‌కు భారత దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ పేరిట ‘విశ్వనాథన్ ఆనంద్ కప్’ అందజేస్తారు. ఎనిమిది రౌండ్ల పాటు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్‌లో రెండు క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఇందులో స్కోరు సమమైతే మూడో రోజు ర్యాపిడ్, బ్లిట్జ్‌లలో జరిగే టైబ్రేకర్‌లతో విజేతను ఖరారు చేస్తారు.
మొత్తం 206 మంది ప్లేయర్లలో ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్–50లో ఉన్న గ్రాండ్‌మాస్టర్లంతా నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశిస్తారు. మిగిలిన 156 మంది తొలిరౌండ్ నుంచి ఆడాల్సివుంటుంది. వీరి నుంచి 78 మంది రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ద్వారా మొత్తం 128 మంది ఆటగాళ్లతో రెండో రౌండ్ నుంచి రసవత్తర సమరం జరుగుతుంది.


