Praggnanandhaa
-
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్‌లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్‌మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్‌ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్‌మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. చాంపియన్‌గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్‌మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్‌మనీ చేరుతుంది. చాంపియన్‌కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
రన్నరప్ ప్రజ్ఞానంద
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 7.5 పాయింట్లతో ర్యాపిడ్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, ఇరిగేశి అర్జున్ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, విదిత్ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌లో, ఎస్ఎల్ నారాయణన్ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. వంతికకు మూడో స్థానం ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్చినా (రష్యా) చాంపియన్‌గా అవతరించింది. 5.5 పాయింట్లతో నానా జాగ్‌నిద్జె (జార్జియా) రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. -
ప్రజ్ఞానందకు ఐదు...గుకేశ్‌కు ఆరు
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ అజేయంగా ముగించారు. చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌లను కూడా వీరిద్దరు ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఎనిమిదో రౌండ్లోనే టైటిల్‌ను ఖరారు చేసుకున్న అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోరీ్నలో ప్రజ్ఞానంద, గుకేశ్, వెస్లీ సో 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు ఐదో స్థానం, గుకేశ్‌కు ఆరో స్థానం, వెస్లీ సోకు ఏడో స్థానం ఖరారయ్యాయి. 6 పాయింట్లతో అలీరెజా ఫిరూజా టైటిల్‌ను దక్కించుకోగా...5.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) రన్నరప్‌గా నిలిచాడు. -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
బ్లిట్జ్‌లోనూ ఆఖరి స్థానమే!
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ‘గ్రాండ్ చెస్ టూర్’లో సెయింట్ లూయిస్ అంచె పోటీలు ఏమాత్రం కలిసిరాలేదు. బ్లిట్జ్ ఈవెంట్లోనూ అతను ఆఖరి స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ర్యాపిడ్ కేటగిరీలో నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. అయితే శనివారం ముగిసిన బ్లిట్జ్ కేటగిరీలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచి 8 పాయింట్లు సాధించినా చివరకు ఆఖరి స్థానమైతే తప్పలేదు. మొత్తానికి గ్రాండ్ చెస్ టూర్ ఈవెంట్లో అతని ఖాతాలో 12 పాయింట్లు (4+8) ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంకులో ఉన్న ప్రజ్ఞానంద... తాజా నిరాశాజనక ఫలితాలతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరోజా 23 పాయింట్లతో సెయింట్ లూయిస్ అంచె ఈవెంట్లో విజేతగా నిలిచాడు. అతను ర్యాపిడ్‌లో 11, బ్లిట్జ్‌లో 12 పాయింట్లు గెలుపొందాడు. అమెరికా ఆటగాళ్లు వెస్లీ సొ (20 పాయింట్లు), హికరు నకముర (19.5), లెవొన్ అరోనియన్ (19) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. తర్వాతి టోర్నీ సింక్యూఫీల్డ్ కప్‌లో ప్రజ్ఞానందతో పాటు భారత్ నుంచి డి.గుకేశ్ బరిలో ఉన్నాడు. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ప్రజ్ఞానంద... ప్రపంచ మూడో ర్యాంకర్‌పై వైశాలి సంచలన విజయాలు
నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు, తోబుట్టువులైన ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్’ గేమ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), భారత స్టార్ కోనేరు హంపి మధ్య క్లాసికల్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించగా జు వెన్జున్ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద ‘చెక్’
స్టావెంజర్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. గతంలో చెస్‌లోని మూడు ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్) ఏకకాలంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద సంచలన విజయం నమోదు చేశాడు.కార్ల్సన్ సొంతగడ్డలో జరుగుతున్న నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగం మూడో రౌండ్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ అద్భుతం చేశాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో కార్ల్సన్ ఆట కట్టించాడు. ఈ గెలుపుతో మూడో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చాడు. గతంలో ఆన్లైన్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో కార్ల్‌సన్‌పై భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, అర్జున్ గెలిచినా... క్లాసికల్ ఫార్మాట్లో మాత్రం ప్రజ్ఞానంద తొలిసారి కార్ల్‌సన్‌ను ఓడించాడు. టైమ్ లిమిట్ ఉండని క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్సన్ ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయ్యాక అతడిని ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. అంతకుముందు భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు. వైశాలి, హంపి గెలుపు ఇదే టోర్నీ మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మూడో రౌండ్లో వైశాలితోపాటు భారత స్టార్ కోనేరు హంపి కూడా అర్మగెడాన్ గేమ్‌లలో గెలిచారు. క్లాసికల్ ఫార్మాట్లో వైశాలి–అనా ముజిచుక్ (ఉక్రెయిన్) గేమ్ 50 ఎత్తుల్లో... హంపి–లె టింగ్లీ (చైనా) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌లు నిర్వహించగా... హంపి తెల్లపావులతో ఆడి 49 ఎత్తుల్లో లె టింగ్లీపై నెగ్గగా... అనా ముజిచుక్‌తో నల్ల పావులతో ఆడిన వైశాలి 70 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. అర్మగెడాన్ నిబంధనల ప్రకారం నల్లపావులతో ‘డ్రా’ చేసుకున్న ప్లేయర్‌ను విజేతగా ఖరారు చేస్తారు. -
సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌కు షాక్
భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్లో కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం. Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG— chess24 (@chess24com) May 29, 2024మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు. -
ప్రజ్ఞానంద, విదిత్ విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరిగిన గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి
టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్ (తమిళనాడు), విదిత్ (మహారాష్ట్ర)... మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్ విభాగంలో 8 మంది... మహిళల విభాగంలో 8 మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మొత్తం 14 రౌండ్ల చొప్పున టోర్నీని నిర్వహిస్తారు. అత్యధిక పాయింట్లు గెలిచిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. క్యాండిడేట్స్ టోర్నీ ఓపెన్ విభాగం విజేత ప్రస్తుత విశ్వవిజేత డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ టైటిల్ కోసం తలపడతారు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం ఉంది. గురువారం తొలి రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో పోటీపడనున్న క్రీడాకారుల వివరాలు... ఓపెన్ విభాగం: ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్ (భారత్) , నెపోమ్నిషి (రష్యా), కరువానా, నకముర (అమెరికా), అబసోవ్ (అజర్బైజాన్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్). మహిళల విభాగం: హంపి, వైశాలి (భారత్), టింగ్జీ లె, టాన్ జోంగి (చైనా), కాటరీనా లాగ్నో, గొర్యాక్చినా (రష్యా), సలీమోవా (బల్గేరియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్). -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్‌తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్‌ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
Tata Steel Chess Tournament: ప్రజ్ఞానంద అద్భుతం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): గత ఏడాది గొప్పగా రాణించిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద కొత్త సంవత్సరంలోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద నాలుగో రౌండ్ గేమ్‌లో సంచలనం సృష్టించాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ డింగ్ లిరెన్ (చైనా)పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో నల్ల పావులతో ఆడుతూ 62 ఎత్తుల్లో డింగ్ లిరెన్‌ను ఓడించాడు. తాజా ఫలితంతో ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్స్‌లో 2748.3 పాయింట్లకు చేరుకున్నాడు. దాంతో 2748 పాయింట్లతో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దిగ్గజ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను రెండో స్థానానికి పంపించి భారత కొత్త నంబర్‌వన్‌గా ప్రజ్ఞానంద అవతరించాడు. అంతేకాకుండా విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయ ప్లేయర్‌గానూ ప్రజ్ఞానంద ఘనత సాధించాడు. వాస్తవానికి ప్రతి నెలాఖరుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) వరల్డ్ రేటింగ్స్‌ను విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్న సమయంలో లైవ్ రేటింగ్స్ మార్పులు ఉంటాయి. ప్రస్తుత టాటా స్టీల్ టోరీ్నలోని తదుపరి రౌండ్లలో ప్రజ్ఞానంద తడబడితే మళ్లీ ఆనంద్ నంబర్‌వన్ అయ్యే అవకాశాలున్నాయి. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీని నిర్వహిస్తున్నారు. నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన విదిత్ 2 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో, గుకేశ్ 1.5 పాయింట్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీలో డింగ్ లిరెన్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ నెపోమ్నిíÙని ఓడించి డింగ్ లిరెన్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. -
సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర
చెన్నై చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారిగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనందన్‌ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్‌తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. నంబర్ 1 ప్రజ్ఞానంద ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్ ర్యాంకర్‌గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు అంతేకాదు.. లిరెన్‌పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్‌లో వరల్డ్ చాంపియన్‌ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్ చాంపియన్‌పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు. అదానీ, సచిన్ ప్రశంసలు కాగా భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరులు ఎక్స్ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
కొత్త క్వీన్ వైశాలి: తోబుట్టువుతో పోటీపడి.. తమ్ముడి నీడను దాటి
‘మీ తమ్ముడు నీకంటే నాలుగేళ్లు చిన్నవాడు. కానీ గ్రాండ్‌మాస్టరై నాలుగేళ్లు దాటిపోయింది. మరి మీరెప్పుడు గ్రాండ్‌మాస్టర్ అవుతారు?’ ఏడాది కాలంగా ఎక్కడికి వెళ్లినా వైశాలిని వెంటాడుతున్న ప్రశ్న అది. ఒక్కోసారి తోబుట్టువు ఘనత కూడా తెలీకుండానే అనవసరపు అసహనాన్ని కలిగిస్తుంది. నిజానికి క్రీడల్లో ఒకరి ప్రదర్శనకు మరొకరి ఆటతో పోలికే ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వైశాలికి మాత్రం ఇంట్లోనే పోటీ ఉండటంతో పోలిక సహజమైంది. దాంతో ఆమెపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. కానీ చదరంగంలో ఒత్తిడిని అధిగమించడమే అన్నింటికంటే పెద్ద సవాల్ కదా! వైశాలి కూడా అలాగే ఆలోచించింది. జీఎం కావడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగలేదు. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో వరుసగా ఒక్కో గేమ్‌లో, ఆపై ఒక్కో టోర్నీలో గెలుపుపై మాత్రమే దృష్టి పెట్టి దూసుకుపోయింది. క్యాండిడేట్స్లాంటి మెగా టోర్నీకి కూడా అర్హత సాధించింది. అక్కడా ఆమె తన ప్రశాంతతను కొనసాగించింది. ఫలితంగా విజయాలు వైశాలిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎట్టకేలకు 22 ఏళ్ల వయసులో చెస్ గ్రాండ్‌మాస్టర్ల జాబితాలో తన పేరును రాసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆ అమ్మాయి చిచ్చరపిడుగు అయిన తమ్ముడి నీడను దాటి ఇప్పుడు సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. మున్ముందు ఆమె సాధించబోయే ఘనతల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇకపై మరిన్ని సంచలనాలు ఈ చెన్నై అమ్మాయి నుంచి రావడం ఖాయం. ఎప్పుడో 2002.. భారత్ నుంచి చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తొలి మహిళగా కోనేరు హంపి గుర్తింపు.. ఆపై మరో 9 ఏళ్లు.. 2011లో రెండో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ద్రోణవల్లి హారిక.. ఈ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిల తర్వాత భారత చెస్‌లో మహిళలకు సంబంధించి ఒక తరహా శూన్యం ఆవరించింది. ఒక వైపు పురుషుల విభాగంలో ఆటగాళ్లు దూసుకుపోతుండగా, మహిళల వైపు నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శనే రాలేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడ కొన్ని మెరుపులు కనిపించినా అవి తాత్కాలికమే. పైగా దిగువ స్థాయికే పరిమితమయ్యాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా విమెన్ గ్రాండ్‌మాస్టర్ స్థాయికి మించి కొందరు ముందుకు సాగలేకపోయారు. అలాంటి స్థితిలో వైశాలి ప్రదర్శన గురించి ఎంత పొగిడినా తక్కువే. అక్కడే మొదలు.. 2013లో వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడేందుకు చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ చెన్నైకి వచ్చాడు. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అసలు ఆటకు ముందు 20 మంది జూనియర్ ప్లేయర్లతో ఒకేసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు కార్ల్సన్ సిద్ధమయ్యాడు. ఈ పోరులో 12 ఏళ్ల వైశాలి మాత్రమే కార్ల్‌సన్‌ను ఓడించడంలో సఫలమైంది. ఆ ఫలితం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా కార్ల్‌సన్‌పై గెలుపు అంటే ఆషామాషీ కాదు. అప్పుడు వైశాలి అందరి దృష్టిలో పడింది. ఆరేళ్ల వయసులో చాలా ఎక్కువ సమయం టీవీ చూడటంలోనే గడుపుతున్న కూతురు దృష్టి మళ్లించేందుకు తండ్రి రమేశ్‌బాబు చెస్ నేర్పించాడు. తర్వాతి రోజుల్లో అదే ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. స్థానికంగా పోటీ పడిన తొలి ఈవెంట్లోనే వైశాలి గెలిచి రావడంతో ఆమె పూర్తి స్థాయిలో ఆట వైపు మళ్లింది. తండ్రితో పాటు తల్లి నాగలక్ష్మి ప్రోత్సాహం, సహకారం కూడా ఆమె వేగంగా దూసుకుపోవడంలో ఉపకరించాయి. చెన్నైలోని వేలమ్మ స్కూల్, ఆ తర్వాత కాలేజ్‌లో.. వైష్ణవ్ ఇన్స్టిట్యూట్ కూడా వైశాలి చదరంగ ప్రదర్శనను గుర్తించి ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన తండ్రి పోలియో కారణంగా ఎక్కడా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. అయినా ఇతరత్రా ఒక తండ్రిగా కూతురికి అండగా నిలవడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన అక్కను ఆడనీయకుండా చేస్తూ ఇబ్బంది పెట్టిన తమ్ముడు ప్రజ్ఞానంద.. తర్వాత రోజుల్లో సాధనలో ఆమెకు భాగస్వామిగా మారడమే కాదు గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి అక్క గేమ్‌లను విశ్లేషించి తప్పొప్పులతో ఆమె ఆటకు సహాయకారిగా వ్యవహరించడం విశేషమే! తొలిసారి గుర్తింపుతో.. 2012.. వైశాలి చెస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. స్లొవేనియాలో అండర్–12 బాలికల వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. 11 ఏళ్ల వైశాలి యూరోప్‌లో పర్యటించడం అదే తొలిసారి. టైమ్ జోన్ భిన్నంగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30కి గేమ్‌లు ప్రారంభం అయ్యేవి. దాంతో ఒక్కసారిగా అలవాటు తప్పిన సాధనతో పాటు ఇతరత్రా కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇలాంటివాటిని అధిగమించి∙ఆమె చాంపియన్‌గా నిలవడం అద్భుతం! మూడేళ్ల తర్వాత గ్రీస్‌లో ఇదే తరహాలో వరల్డ్ అండర్–14 చాంపియన్‌షిప్ జరిగింది. ఈసారి మాత్రం ఆమె పూర్తి సన్నద్ధతతో వెళ్లింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె దానికి న్యాయం చేస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ అండర్–10 విభాగంలో తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. దాంతో రమేశ్‌బాబు కుటుంబంలో ఆనందం రెట్టింపయింది. ఒలింపియాడ్‌లో సభ్యురాలిగా.. కోవిడ్ సమయం ప్రపంచవ్యాప్త క్రీడా ఈవెంట్లపై కూడా ప్రభావం చూపించింది. అయితే ఆన్లైన్ గేమ్‌ల తర్వాత చెస్ ఆటగాళ్లు కొంత వరకు తమ సమస్యను పరిష్కరించుకోగలిగారు. ఈ క్రమంలో వైశాలి ఆన్లైన్లో విమెన్స్ స్పీడ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సత్తా చాటింది. తుది ఫలితం అనుకూలంగా రాకపోయినా రెండు సంచలన విజయాలు ఆమె స్థాయిని పెంచాయి. తనకంటే ఎంతో ఎక్కువ రేటింగ్ ఉన్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారిణులు అసబయెయెవా, ద్రోణవల్లి హారికలను వైశాలి ఓడించగలిగింది. ప్రపంచ చెస్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన ఒలింపియాడ్ ఆమె కెరీర్లో మరో చెప్పుకోదగ్గ ఘనతగా నిలిచింది. ఇందులో విజేతైన భారత జట్టులో వైశాలి కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ స్వర్ణం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తొలి సోదర, సోదరి ద్వయంగా అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధించినా గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోవడమే వైశాలికి కీలకంగా మారింది. భారత చెస్ చరిత్రలోని 83 మంది గ్రాండ్మాస్టర్లలో ఇద్దరు మాత్రమే మహిళలు. అయితే వైశాలి శ్రమ, పోరాడేతత్వం, ఓటమిని అంగీకరించని నైజం ఆమెను కొత్త జీఎంగా నిలిపాయి. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా పట్టుదలతో సాగి ఈ చెన్నై అమ్మాయి.. తన లక్ష్యాన్ని చేరింది. 2019లో ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్‌లో ఆమె తొలి జీఎం నార్మ్ సాధించింది. పది మంది ప్రత్యర్థులతో తలపడగా వారిలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు. రెండో జీఎం సాధించేందుకు ఆమెకు కొంత సమయం పట్టింది. హెరాక్లియోన్‌లో జరిగిన ఫిషర్ ఓపెన్‌లో ఆమె రెండో నార్మ్ సొంతం చేసుకుంది. ఇదే జోరులో మూడో నార్మ్ వేట సాగింది. ఏడాదిన్నర లోపే ఖతర్ ఓపెన్‌లో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి ఎనిమిది గేమ్‌లలోనూ నార్మ్ సాధించడంతో ఇక జీఎం లాంఛనమే అయింది. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు మారియా ముజీచుక్, స్టెఫనోవా, జోంగి తాన్లను ఓడించడంతో పాటు 2600 రేటింగ్ దాటడంతో ఇటీవలే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో వైశాలి జీఎం ఖాయమైంది. ప్రపంచ చెస్‌లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వైశాలి, ప్రజ్ఞానంద నిలిచారు. ఇకపై కూడా తమ్ముడి నీడలో కాకుండా తన ఆటతో, ఎత్తుకు పైఎత్తులతో చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వైశాలి ధ్యేయంగా పెట్టుకుంది. -∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
వైశాలి సరికొత్త చరిత్ర.. తమ్ముడు ప్రజ్ఞానందతో కలిసి ప్రపంచ రికార్డు
Vaishali- R Praggnanandhaa: చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్ చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన మూడో మహిళగా రికార్డు సాధించింది. IV Elllobregat- 2023 ఓపెన్‌లో భాగంగా శనివారం నాటి గేమ్‌తో రేటింగ్ పాయింట్లలో 2500 మార్కును దాటి ఈ ఫీట్ నమోదు చేసింది. ఇక గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించడంతో పాటు తన సోదరడు ఆర్. ప్రజ్ఞానందతో కలిసి మరో ప్రపంచ రికార్డును కూడా వైశాలి తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన వైశాలికి చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద సొంత తమ్ముడు. తమ్ముడితో కలిసి ప్రపంచ రికార్డు ఇప్పటికే గ్రాండ్‌మాస్టర్‌గా ఎన్నో విజయాలు అందుకున్న ప్రజ్ఞానంద ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వైశాలి కూడా గ్రాండ్‌మాస్టర్ కావడం, క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడంతో చెస్ చరిత్రలో.. ఈ ఘనత సాధించిన తొలి సోదర-సోదరీ(తోబుట్టువులు) ద్వయంగా వీళ్లిద్దరు అరుదైన రికార్డు సాధించారు. సీఎం స్టాలిన్ అభినందనలు ఇక చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, హారిక ద్రోణవల్లి, దివ్యేందు బరువా, ఆర్. ప్రజ్ఞానంద తదితర గ్రాండ్మాస్టర్లతో పాటు వైశాలి కూడా ఈ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు నుంచి తొలి మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అక్కాతమ్ముళ్లిద్దరూ కలిసి క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారని.. మిమ్మల్ని చూసి తామంతా గర్విస్తున్నామని ఎక్స్ వేదికగా స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: ప్రజ్ఞానంద కుటుంబం గురించి తెలుసా?! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! చదవండి: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా: పాక్ మాజీ బౌలర్ Huge congrats, @chessvaishali, on becoming the third female Grandmaster from India and the first from Tamil Nadu! 2023 has been splendid for you. Alongside your brother @rpragchess, you've made history as the first sister-brother duo to qualify for the #Candidates tournament.… pic.twitter.com/f4I89LcJ5O — M.K.Stalin (@mkstalin) December 2, 2023 -
భారత చెస్ చరిత్రలో గొప్ప క్షణాలు.. ఒకేసారి రెండు అద్భుత విజయాలు
Isle of Man- Vidit Gujrathi, Vaishali R claim titles: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్. వైశాలి, విదిత్ గుజరాతి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విదిత్ గుజరాతి ఓపెన్ చాంపియన్‌గా అవతరించగా.. ఆర్.వైశాలి మహిళా విభాగంలో టైటిల్ విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన వేళ చెస్ టోర్నీలో వీరిద్దరు డబుల్ ధమాకా అందించారు. అదే విధంగా ఈ విజయంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు వైశాలి, విదిత్. అక్కడా సత్తా చాటి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫై కావాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా స్విస్ టోర్నీలో ర్యాంకింగ్స్‌లో తమకంటే ఎంతో మెరుగ్గా ఉన్న ప్లేయర్లను ఓడించి మరీ వైశాలి, విదిత్ ఈ మేరకు విజయం అందుకోవడం విశేషం. ఓపెన్ టోర్నీలో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన విదిత్.. ఫిబియానో కరువానా, హికరు నకమురా, అలీరెజా ఫిరౌజాలతో పాటు భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్, ప్రజ్ఞానందలతో పోటీపడి విజేతగా నిలిచాడు. మరోవైపు.. మహిళల విభాగంలో 12వ సీడ్‌గా పోటీకి దిగిన వైశాలి.. ఫైనల్ రౌండ్లో పెద్దగా పోరాడాల్సిన పనిలేకుండానే బత్కుయాగ్ మోంగోటుల్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా చెన్నైకి చెందిన రమేశ్‌బాబు వైశాలి.. ప్రఖ్యాత చెస్ ప్లేయర్, సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఆర్. ప్రజ్ఞానంద అక్క అన్న విషయం తెలిసిందే. ఇక ఫిడే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. తాజాగా వైశాలి సైతం క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది. -
‘ప్రజ్ఞ’కు పట్టం.. 18 ఏళ్ల వయస్సులో ఎన్నో సంచలనాలు
నవంబర్ 2013.. విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ మధ్య వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్.. వేదిక చెన్నైలోని హయత్ రీజెన్సీ హోటల్.. ఎనిమిదేళ్ల కుర్రాడొకడు టోర్నీ జరిగినన్ని రోజులు తన కోచ్‌తో పాటు అక్కడే తచ్చాడుతూ కనిపించాడు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొనే అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు దిగ్గజాల మధ్య పోరులో ఎత్తులు, పైఎత్తులను గమనించడం.. లేదంటే హోటల్ లాబీలో చెస్‌తో సంబంధం ఉన్న ఎవరైనా ఆట గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినడం.. అన్ని రోజులూ అతనిది అదే దినచర్య! ఆ సమయంలో అతనొక ఔత్సాహిక ఆటగాడు, చెస్ అభిమాని మాత్రమే. అతనే కాదు అతని కోచ్ కూడా ఊహించలేదు.. సరిగ్గా దశాబ్ద కాలం తర్వాత ఆ ‘ప్రజ్ఞ’ ప్రపంచ స్థాయికి చేరుతుందని. ఆ కుర్రాడు.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన రెండో భారతీయుడిగా నిలుస్తాడని.. అదే కార్ల్సన్తో విశ్వ వేదికపై తలపడతాడని! అద్భుతమైన ప్రతిభతో ఇప్పుడు భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా దక్కించుకున్న ఆ బాల మేధావి పేరు ఆర్. ప్రజ్ఞానంద. గత ఏడాది మే నెలలో చెస్ ఏబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ టోర్నమెంట్ జరుగుతోంది. అదే సమయంలో ప్రజ్ఞానంద తన 11వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. స్టడీ బ్రేక్ అంటూ పరీక్షల మధ్యలో కొంత విరామం ఇవ్వడంతో అతను ఈ టోర్నీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. కార్ల్సన్, వీయీ, అనీశ్ గిరి, డింగ్ లారెన్ లాంటి స్టార్లు ఉన్న ఈ టోర్నీలో ‘నేనేమాత్రం ముందుకు వెళ్లగలను?’ అనే సందేహం ఉండటంతో పరీక్షల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ టోర్నీలో వచ్చిన అద్భుతమైన ఫలితాలు ఫైనల్ వరకు తీసుకెళ్లాయి. దాంతో ఒకే సమయంలో పగలు, రాత్రి అటు చెస్, ఇటు పరీక్షలు అంటూ మేనేజ్ చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల వరకు గేమ్ ఆడి మళ్లీ 7 గంటలకు అతను పరీక్షకు హాజరయ్యాడు. ఆ శ్రమ వృథా కాలేదు. ఆ టోర్నీలో ఆల్‌టైమ్ గ్రేట్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడంలో అతను సఫలమయ్యాడు. మూడు నెలల వ్యవధిలో కార్ల్‌సన్‌ను రెండోసారి ఓడించడంతో అతని గత విజయం గాలివాటు కాదని, ప్రజ్ఞానంద ఎంతో ప్రత్యేకమైన ఆటగాడనేది ప్రపంచానికి తెలిసింది. 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ప్రపంచ చెస్‌లో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఈ చెన్నై చిచ్చరపిడుగు ఆపై కూడా అంతే వేగంగా దూసుకుపోయాడు. అక్క చూపిన దారిలో.. ప్రజ్ఞానంద.. ఆరంభంలో ఆసక్తితో కాకుండా అనుకోకుండానే చదరంగపు ఎత్తులు నేర్చుకున్నాడు. తమిళనాడు స్టేట్ కార్పొరేషన్ బ్యాంక్‌లో తండ్రి రమేశ్‌బాబు మేనేజర్. పోలియో బాధితుడైన ఆయన తన పిల్లలను సరదాగా ఆటల కోసం బయటకు తీసుకెళ్లడంలో ఇబ్బంది పడేవాడు. పెద్దమ్మాయి వైశాలి ఎక్కువసేపు టీవీ చూడటం, వీడియో గేమ్‌లకే అతుక్కుపోయేది. దాంతో దానిని నివారించేందుకు తనకు ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆయన తన కూతురును ముందుగా చెస్ వైపు నడిపించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఆమె ఆసక్తి పెంచుకొని చదరంగం బోర్డుపైనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. అక్క ఆటను చూస్తూ వచ్చిన చిన్నారి ప్రజ్ఞానంద కూడా చెస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కను దాటి అగ్రస్థానానికి చేరాడు. వైశాలి కూడా ఇప్పుడు భారత చెస్‌లో చురుకైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నేషనల్ మాస్టర్, మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా వైశాలి సత్తా చాటుతుండగా.. మరో వైపు తమ్ముడు ప్రపంచ కప్ రన్నరప్ స్థాయికి చేరాడు. కోచ్ చూపిన బాటలో.. ప్రజ్ఞానంద గెలుపు ప్రస్థానంలో కోచ్ రమేశ్‌దే కీలక పాత్ర. సహజమైన ప్రతిభను గుర్తించి చాలా చిన్న వయసులోనే సానబెట్టడంలో ఆయన దూరదృష్టి పని చేసింది. చెన్నైలోని చెస్ గురుకుల్ అకాడమీలో ఆయన వద్ద దాదాపు నాలుగు వందల మంది శిక్షణ పొందుతుండగా వారిలో ప్రజ్ఞ ప్రియ శిష్యుడయ్యాడు. అందుకే ఈ సంచలనం గురించి రమేశ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ‘పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ గంటలు గంటలు గడిపే వయసులో ప్రజ్ఞానంద ఈ స్థాయికి చేరాడు. ప్రతిభతోపాటు కష్టపడే తత్వం కూడా ఉంది ఆ పిల్లాడికి! అందుకే ఇంకా ఏదో సాధించాలంటూ అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచను. అతను తర్వాతి గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ సాధిస్తాడని తెలిసి కూడా దాన్ని బయటకు వెలిబుచ్చకుండా బరిలోకి దించాను. ఆటలో గెలుపుతో పాటు ఓటములూ ఉంటాయనే విషయం అతనికి ఇప్పుడు అర్థమైంది. ఓడినా తన రొటీన్‌ను మార్చుకోడు కాబట్టి మానసికంగా సమస్య లేదు. పెద్దగా స్నేహితులు కూడా లేరు. కాబట్టి సమయం దొరికితే నేనే అతనితో సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడతాను. ఏడాదిగా అతను అద్భుతాలు చేస్తున్నాడు. అవి అలాగే కొనసాగుతాయని నా నమ్మకం’ అన్నారు కోచ్. అన్నీ సంచలనాలే.. ప్రజ్ఞానందకు ఇటీవలే 18 ఏళ్ల నిండాయి. ఇప్పటికే అతను అంతర్జాతీయ చెస్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. ఇటీవల కార్ల్సన్తో తలపడి ప్రపంచ కప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలవడం అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే చిన్న వయసులోనే వరుసగా సాధించిన సంచలనాల జాబితా కూడా పెద్దదే! 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్ అయి ఆపై రెండేళ్ల తర్వాత గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. అంతకు ముందే ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్–8, అండర్–10 విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడు కూడా అతనే. ఆనంద్, హరికృష్ణ తర్వాత ఈ దిగ్గజాన్ని ఓడించిన మూడో భారతీయుడు ప్రజ్ఞానందే కాగా, మొత్తం 3 సార్లు అతను ఈ ఫలితాన్ని పునరావృతం చేయడం విశేషం. 14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టోర్నీ ఎక్స్‌ట్రాకాన్ ఓపెన్ (డెన్మార్క్)లో విజేతగా నిలవడంతో అతనికి తొలిసారి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత యూత్ అండర్–18 వరల్డ్ చాంపియన్‌షిప్ కూడా అతని ఖాతాలోనే చేరింది. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌కు సవాల్ విసిరే ఆటగాడిని ఎంపికచేసే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నీకీ ప్రజ్ఞ అర్హత సాధించాడు. అతని విజయాలకెప్పుడూ అమ్మ నాగలక్ష్మి తోడుంటూ వచ్చింది. ఇటీవలి వరల్డ్ కప్ సమయంలోనే ఆమె పైనా అందరి దృష్టి పడింది. చిన్నప్పటి నుంచి కొడుక్కి తోడుగా.. అతని ఏర్పాట్లన్నీ చూస్తూ.. మ్యాచ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడూ ఏమాత్రం లోటు రానివ్వకుండా.. తన చేతివంటతో బిడ్డపై చూపించే ఆ తల్లి ప్రేమ కూడా ఆటల సమయంలో ఆ చిన్నారికి అదనపు బలమవుతోంది. ప్రజ్ఞానంద ఎంతో ప్రతిభావంతుడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని ఆట గురించి ఒక ప్రత్యేక అంశం నన్ను ఆకట్టుకుంటోంది. ‘డ్రా’కు అవకాశం ఉన్న మ్యాచ్‌లలో కూడా ఎక్కడా అతను తగ్గకుండా మిడిల్ గేమ్‌లో అనూహ్యమైన ఎత్తులతో అతను ఫలితం వైపు తీసుకెళ్తాడు. వేర్వేరు టోర్నమెంట్లలో గేమ్‌లను ఎంచుకునే విషయంలోనూ ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అతను కెరీర్లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. – విశ్వనాథన్ ఆనంద్ ♦మొహమ్మద్ అబ్దుల్ హాది -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్‌ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్‌కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్‌వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్‌కు నాలుగో ర్యాంక్, విదిత్‌కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్‌వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్‌గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్‌గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఫ్లైట్‌లో ఇండియన్ చెస్ స్టార్.. క్యాబిన్ క్రూ వినూత్న అభినందనలు!
భారత చెస్ యువ సంచలనం, ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అంతటా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడి భారత్‌కు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చిన ప్రజ్ఞానందకు ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఇండిగో విమానంలో తల్లితో కలిసి ప్రయాణించిన ప్రజ్ఞానందకు విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది ఒక నోట్ అందించారు. చెస్ స్టార్ ప్రజ్ఞానంద, అతని తల్లితో కలిసి క్యాబిన్ క్రూ మెంబర్ దిగిన ఫొటోతో పాటు సిబ్బంది స్వయంగా రాసిన అభినందన నోట్ చిత్రాన్ని ఇండిగో సంస్థ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసింది. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ ఫ్లైట్‌లో ప్రయాణించడం గౌరవంగా ఉందని, మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచిన యువ ఛాంపియన్‌కు అభినందనలు అంటూ ప్రశంసించింది. ప్రజ్ఞానందను విమానంలో ఆన్‌బోర్డ్ చేయడం తమకు నిజంగా గౌరవం, సంతోషాన్ని కలిగిస్తోందని, దేశానికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తి అంటూ క్యాబిన్ క్రూ స్వయంగా రాసి సంతకాలు చేసి ప్రజ్ఞానందకు అందించారు. అజర్బైజాన్లో జరిగిన ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌తో తలపడి రన్నరప్‌గా నిలిచారు. దీంతో ప్రజ్ఞానందకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా అభినందించారు. అలాగే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా ప్రశంసించి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ✈️ Taking chess to new heights! 🏆 We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H — IndiGo (@IndiGo6E) August 31, 2023 -
విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్‌గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్‌కప్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023 -
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్‌బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు.