కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ 7.5 పాయింట్లతో ర్యాపిడ్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు.
భారత గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, ఇరిగేశి అర్జున్ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, విదిత్ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌లో, ఎస్‌ఎల్ నారాయణన్ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు.
వంతికకు మూడో స్థానం
ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) చాంపియన్‌గా అవతరించింది.
5.5 పాయింట్లతో నానా జాగ్‌నిద్జె (జార్జియా) రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment