
విదిత్ గుజరాతి- తల్లి నాగలక్ష్మితో ఆర్. వైశాలి(PHOTO Credit: FIDE/Anna Shtourman)
Isle of Man- Vidit Gujrathi, Vaishali R claim titles: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్. వైశాలి, విదిత్ గుజరాతి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విదిత్ గుజరాతి ఓపెన్ చాంపియన్‌గా అవతరించగా.. ఆర్.వైశాలి మహిళా విభాగంలో టైటిల్ విజేతగా నిలిచింది.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన వేళ చెస్ టోర్నీలో వీరిద్దరు డబుల్ ధమాకా అందించారు. అదే విధంగా ఈ విజయంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు వైశాలి, విదిత్. అక్కడా సత్తా చాటి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫై కావాలనే పట్టుదలతో ఉన్నారు.
కాగా స్విస్ టోర్నీలో ర్యాంకింగ్స్‌లో తమకంటే ఎంతో మెరుగ్గా ఉన్న ప్లేయర్లను ఓడించి మరీ వైశాలి, విదిత్ ఈ మేరకు విజయం అందుకోవడం విశేషం. ఓపెన్ టోర్నీలో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన విదిత్.. ఫిబియానో కరువానా, హికరు నకమురా, అలీరెజా ఫిరౌజాలతో పాటు భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్, ప్రజ్ఞానందలతో పోటీపడి విజేతగా నిలిచాడు.
మరోవైపు.. మహిళల విభాగంలో 12వ సీడ్‌గా పోటీకి దిగిన వైశాలి.. ఫైనల్ రౌండ్‌లో పెద్దగా పోరాడాల్సిన పనిలేకుండానే బత్కుయాగ్ మోంగోటుల్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా చెన్నైకి చెందిన రమేశ్‌బాబు వైశాలి.. ప్రఖ్యాత చెస్ ప్లేయర్, సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఆర్. ప్రజ్ఞానంద అక్క అన్న విషయం తెలిసిందే.
ఇక ఫిడే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. తాజాగా వైశాలి సైతం క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు.
చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!!