
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు ‘గ్రాండ్ చెస్ టూర్’లో సెయింట్ లూయిస్ అంచె పోటీలు ఏమాత్రం కలిసిరాలేదు. బ్లిట్జ్ ఈవెంట్‌లోనూ అతను ఆఖరి స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ర్యాపిడ్ కేటగిరీలో నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాడు. అయితే శనివారం ముగిసిన బ్లిట్జ్ కేటగిరీలో కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచి 8 పాయింట్లు సాధించినా చివరకు ఆఖరి స్థానమైతే తప్పలేదు.
మొత్తానికి గ్రాండ్ చెస్ టూర్ ఈవెంట్‌లో అతని ఖాతాలో 12 పాయింట్లు (4+8) ఉన్నాయి. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంకులో ఉన్న ప్రజ్ఞానంద... తాజా నిరాశాజనక ఫలితాలతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలిరెజా ఫిరోజా 23 పాయింట్లతో సెయింట్ లూయిస్ అంచె ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు.
అతను ర్యాపిడ్‌లో 11, బ్లిట్జ్‌లో 12 పాయింట్లు గెలుపొందాడు. అమెరికా ఆటగాళ్లు వెస్లీ సొ (20 పాయింట్లు), హికరు నకముర (19.5), లెవొన్ అరోనియన్ (19) వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. తర్వాతి టోర్నీ సింక్యూఫీల్డ్ కప్‌లో ప్రజ్ఞానందతో పాటు భారత్ నుంచి డి.గుకేశ్ బరిలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment