నేటి నుంచి ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
అర్జున్, ప్రజ్ఞానంద, హంపి, హారికలపై దృష్టి
మళ్లీ ఫేవరెట్‌గా కార్ల్‌సన్
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్‌లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్‌లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్‌మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు.
ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్‌ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి.
భారత్ నుంచి ఎవరెవరంటే....
ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్.
మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక.
ఫార్మాట్ ఎలా అంటే...
ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్‌లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.
ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్‌లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్‌లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు.
టైమ్ కంట్రోల్ ఎంతంటే...
ర్యాపిడ్ ఫార్మాట్‌లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్‌లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు.
ప్రైజ్‌మనీ ఎంతంటే...
ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు.
బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. చాంపియన్‌గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు.
ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్‌మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి.
బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్‌మనీ చేరుతుంది. చాంపియన్‌కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.
4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్‌లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్‌లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment