World Rapid Chess Championship
-
రెండో స్థానంలో కోనేరు హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండో రోజూ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. తొలి రోజు నాలుగు రౌండ్ల తర్వాత మూడు పాయింట్లతో 15వ ర్యాంక్‌లో ఉన్న హంపి... రెండో రోజు రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం హంపి మూడు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 8 రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో మో జై (చైనా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది. 7 పాయింట్లతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువతార నూతక్కి ప్రియాంక కూడా అద్భుతంగా ఆడింది. తొలి రోజు 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో ఉన్న ప్రియాంక బుధవారం ఆడిన నాలుగు గేముల్లోనూ గెలిచి 6 పాయింట్లతో 10వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ 5 పాయింట్లతో వరుసగా 23, 31వ ర్యాంక్‌లో... ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో 40వ ర్యాంక్‌లో ఉన్నారు. -
నేటి నుంచి ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ
ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు భారత చెస్ క్రీడాకారులు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉజ్బెకిస్తాన్లోప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 18 మంది, మహిళల విభాగంలో 11 మంది బరిలోకి దిగుతున్నారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిల నుంచి పతకాలు ఆశించవచ్చు. -
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
హర్ష ‘హ్యాట్రిక్’ గెలుపు
వార్సా (పోలాండ్): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలి రోజు హర్ష తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న గ్రాండ్మాస్టర్లతో ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించాడు. మూడు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఈ హైదరాబాద్ ప్లేయర్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 2484 రేటింగ్ ఉన్న హర్ష తొలి గేమ్‌లో 51 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్ (అజర్ బైజాన్–2690)పై... రెండో గేమ్‌లో 54 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ కొవలెవ్ (రష్యా– 2647)పై... మూడో గేమ్‌లో 56 ఎత్తుల్లో ఒనిష్చుక్ (ఉక్రెయిన్ –2687)పై గెలుపొందాడు. తెలంగాణకే చెం దిన మరో గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ రెండు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని జైనాబ్ (అజర్బైజాన్)తో జరిగిన మూడో గేమ్‌లో ఓడిపోయింది. -
ఈ విజయం ఎంతో మధురం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని... గతంలో ఏ భారతీయ క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకొని... అంతర్జాతీయ వేదికపై మరోసారి అబ్బురపరిచే ప్రదర్శనతో భారత చెస్ పతాకాన్ని రెపరెపలాడించి... అందరిచేతా శభాష్ అనిపించుకుంది ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం), భారత మహిళల నంబర్‌వన్ ప్లేయర్ కోనేరు హంపి. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో నాలుగుసార్లు సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హంపికి సీనియర్ విభాగంలో మాత్రం విశ్వకిరీటం ఊరిస్తూ వస్తోంది. అయితే తనకెంతో పట్టున్న క్లాసికల్ విభాగంలో కాకుండా ధనాధన్ పద్ధతిలో జరిగే ర్యాపిడ్ విభాగంలో హంపి విశ్వవిజేతగా నిలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్ : ఒకదశలో టాప్–3లో నిలిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నప్పటికీ...ఒకవైపు ఫేవరెట్స్‌గా భావించిన క్రీడాకారిణుల ఫలితాలు చివరి రెండు రౌండ్లలో తారుమారు కావడం... మరోవైపు తాను వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపికి ఒక్కసారిగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకం కోసం, ప్రపంచ టైటిల్ కోసం పోటీపడే అవకాశం వచి్చంది. ఊహించని ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న హంపి... ఏమాత్రం సంయమనం కోల్పోకుండా, స్థిరచిత్తంతో ఆడి ప్రత్యర్థి ఆట కట్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఊహించనిరీతిలో అద్భుత విజయం సొంతం కావడం ఎంతో మధురంగా అనిపిస్తోందని... ఈ గెలుపు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని మాస్కో నుంచి ‘సాక్షి’కి ఇచి్చన ఇంటర్వ్యూలో హంపి వ్యాఖ్యానించింది. పలు అంశాలపై హంపి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఊహించలేదు... ర్యాపిడ్ విభాగం చివరి రోజు గేమ్‌లు మొదలయ్యే సమయానికి నేను ఐదో స్థానంలో ఉన్నా. మిగిలిన నాలుగు గేముల్లో మంచి ప్రదర్శన చేసి టాప్–3లోకి రావాలనుకున్నా. కానీ నేను రెండు గేముల్లో నెగ్గడం... ఇతర క్రీడాకారిణులు ఓడిపోవడంతో నాతోపాటు మరో ఇద్దరు లీ టింగ్జి (చైనా), ఎకతెరీనా అతాలిక్ (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోకి వచ్చారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలువడంతో నేను, లీ టింగ్జి ప్రపంచ టైటిల్ కోసం టైబ్రేక్ గేమ్‌లు ఆడాల్సి వచి్చంది. సీనియర్ విభాగంలో తొలి ప్రపంచ టైటిల్ గెలిచే అవకాశం వచ్చిందని భావించాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టైబ్రేక్ తొలి గేమ్‌లో ఓడిపోయినా... రెండో గేమ్‌లో పుంజుకొని గెలిచాను. నిర్ణాయక ‘అర్మగెడాన్’ గేమ్‌లో నల్లపావులతో ఆడాల్సి రావడం... ‘డ్రా’ చేసుకుంటే టైటిల్ ఖాయమయ్యే స్థితిలో ఈ గేమ్‌లో ఆరంభం నుంచే మంచి స్థితిలో నిలిచి చివరకు అనుకున్న ఫలితం సాధించాను. ఫలించిన నిరీక్షణ... 2001లో నేను అండర్–20 ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాత పలుమార్లు ప్రపంచ చాంపియన్íÙప్లలో పాల్గొన్నాను. కొన్నిసార్లు ఆరంభ దశలోనే వెనుదిరిగాను. మరి కొన్నిసార్లు కాంస్యం, రజతంతో సరిపెట్టుకున్నాను. ఐదేళ్ల క్రితం పెళ్లి కావడం... ఆ తర్వాత పాప పుట్టడంతో రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాను. గత ఏడాది పునరాగమనం చేశా. సంవత్సరం తిరిగేలోపు ప్రపంచ టైటిల్ సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. 18 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్ కావడం గొప్ప అనుభూతినిస్తోంది. ర్యాపిడ్ ఫార్మాట్లో విశ్వకిరీటం లభించినప్పటికీ.... క్లాసికల్ ఫార్మాట్లో ప్రపంచ టైటిల్ వేటను కొనసాగిస్తాను. నా కుటుంబ సభ్యులకు అంకితం... ఈ ప్రపంచ టైటిల్‌ను నా కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నాను. పునరాగమనంలో తల్లిదండ్రులు కోనేరు అశోక్, లత... భర్త దాసరి అన్వేష్ ఎంతో మద్దతు ఇస్తున్నారు. వారి సహకారం లేకపోయుంటే నేను మళ్లీ కెరీర్ కొనసాగించేదాన్ని కాదు. ఇప్పటికీ నేను రోజూ ఐదారు గంటలు నాన్న అశోక్ పర్యవేక్షణలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఆటతీరులోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయన సరిదిద్దుతున్నారు. నేను టోర్నమెంట్లు ఆడేందుకు విదేశాలకు వెళ్లిన సమయంలో నా రెండేళ్ల పాప అహానాను అమ్మా, నాన్న చూసుకుంటారు. కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడాల్సిందే... దాదాపు 25 ఏళ్లుగా చెస్ ఆడుతున్నాను. నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మార్పు వచి్చంది. మనలో సహజసిద్ధమైన ప్రతిభ ఉంటే కొన్నేళ్లు తీవ్రంగా కష్టపడితే తప్పకుండా ఉన్నతస్థితికి చేరుకుంటాం. కెరీర్ ఆరంభంలో ఎదురయ్యే ఒడిదుడుకులకు తట్టుకొని స్థిరంగా నిలబడాలి. అప్పడే మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ వ్యవహరం చాలా ఖరీదుతో కూడుకున్నది. నాన్న అశోక్ రూపంలో నాకు మంచి కోచ్ లభించడంతో నా కెరీర్లో విదేశీ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. పక్కా వ్యవస్థ ఉండాలి.... గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్‌లో చెస్‌కు ఆదరణ ఎంతో పెరిగింది. అయితే ఇప్పటికీ మనవద్ద చెస్ చాంపియన్లను తయారు చేసే పక్కా వ్యవస్థ లేదనే చెప్పాలి. బ్యాడ్మింటన్‌లో పుల్లెల గోపీచంద్ అకాడమీ మాదిరిగా చెస్లోనూ ఉంటే బాగుంటుంది. చైనా, రష్యాలలో జాతీయ జట్లకు రెగ్యులర్ కోచ్‌లు ఉంటారు. అందుకే ఆ దేశాల నుంచి రెగ్యులర్‌గా మేటి ఆటగాళ్లు తెరపైకి వస్తుంటారు. భారత్‌లో ఇప్పటివరకు వచి్చన గ్రాండ్‌మాస్టర్లు, చాంపియన్స్ తమ స్వశక్తితో పైకి వచి్చన వాళ్లే. విజయాలు సాధించాక సన్మానాలు చేసే బదులు చాంపియన్స్ తయారయ్యేలా వ్యవస్థను రూపొందించాలి. ఇప్పటికైతే వ్యక్తిగతంగా చెస్ అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన లేదు. వచ్చే ఏడాది కోసం ప్రత్యేకంగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. బరిలో దిగే టోర్నీలలో గొప్ప ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాను. ‘బ్లిట్జ్’లో సంయుక్తంగా రెండో స్థానంలో... ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలోనూ ఆకట్టుకుంది. నిరీ్ణత 17 రౌండ్లకుగాను ఆదివారం తొమ్మిది రౌండ్లు జరిగాయి. తొమ్మిది రౌండ్ల పూర్తయ్యాక హంపి 7 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా), దరియా చరోచ్కినా (రష్యా), అలీనా కష్లిన్స్కాయ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 8 పాయింట్లతో కాటరీనా లాగ్నో (రష్యా) అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. నేడు మిగతా ఎనిమిది రౌండ్లు జరుగుతాయి. బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో 10 రౌండ్లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి 7.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. నేడు మిగతా 11 రౌండ్లు జరుగుతాయి. హంపికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన సాక్షి, అమరావతి: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. మాస్కోలో శనివారం రాత్రి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో చైనా ప్లేయర్ లీ టింగ్జిపై హంపి గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. హంపి సాధించిన విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. హంపికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా అభినందనలు తెలిపారు. -
కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. (విశ్వవిజేత కోనేరు హంపి) -
విశ్వవిజేత కోనేరు హంపి
మాస్కో: భారత నంబర్‌వన్ మహిళా చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపి తన కెరీర్లోనే అతి గొప్ప విజయం సాధించింది. శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. నిరీ్ణత 12 రౌండ్ల తర్వాత కోనేరు హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపి, లీ టింగ్జి తొలి రెండు స్థానాల్లో... అతాలిక్ మూడో స్థానంలో నిలిచారు. దాంతో అతాలిక్కు కాంస్యం ఖాయమైంది. హంపి, లీ టింగ్జి మధ్య ప్రపంచ చాంపియన్ ఎవరో నిర్ణయించేందుకు ముందుగా రెండు బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా... రెండో బ్లిట్జ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. దాంతో టైబ్రేక్‌లోనూ ఇద్దరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు చివరగా ‘అర్మగెడాన్ గేమ్’ను నిర్వహించారు. ‘అర్మగెడాన్’ నిబంధన ప్రకారం గేమ్‌లో తెల్లపావులతో ఆడిన వారు తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ‘డ్రా’ అయితే మాత్రం నల్లపావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో హంపి 66 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించింది. లీ టింగ్జి రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. అంతకుముందు నిరీ్ణత 12 రౌండ్లలో హంపి ఏడు గేముల్లో గెలిచింది. హంపి... మార్గరిటా పొటపోవా, నినో ఖోమెరికో, కొవలెవ్స్కాయ, ఓల్గా గిరియా, నానా జాగ్‌నిద్జే, దరియా వోయిట్, తాన్ జోంగిలపై గెలిచింది. దరియా చరోచిక్నా, అనా ముజిచుక్, అతాలిక్ ఎకతెరీనా, కాటరీనా లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఇరీనా బుల్మగా చేతిలో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు. ►2 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ చరిత్రలో హంపి గెలిచిన పతకాల సంఖ్య. 2012లో హంపి కాంస్య పతకం సాధించింది. ►2 భారత్ తరఫున ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో ప్లేయర్ హంపి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఓపెన్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. -
దూసుకెళుతోన్న హంపి, హారిక
మాస్కో: ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. టోర్నీలో ఎనిమిది రౌండ్ల అనంతరం వీరిద్దరూ 6 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ... ర్యాంకుల్ని వర్గీకరించగా హంపి ఐదో స్థానంలో, హారిక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 6.5 పాయింట్లతో రొమేనియా ప్లేయర్ బల్మగ ఇరినా అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం నాలుగు రౌండ్లు జరుగగా హంపి ఐదో గేమ్‌లో గిర్యా ఓల్గాపై గెలుపొంది, ఆరో గేమ్‌లో బల్మగ ఇరినా చేతిలో ఓడిపోయింది. ముజిచుక్ అనాతో ఏడో గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె.. ఎనిమిదో గేమ్‌లో జనిజె ననాపై గెలుపొందింది. మరోవైపు హారిక మూడు గేమ్‌ల్ని డ్రా చేసుకొని ఒక గేమ్‌లో గెలుపొందింది. గలియామోవా అలీసా (ఆరో గేమ్)పై గెలుపొందిన హారిక... కశ్లిన్స్కాయా అలీనా (ఐదో గేమ్), పొగోనినా నటలిజా (ఏడో గేమ్), లగ్నో కాటెరినా (ఎనిమిదో గేమ్)లతో మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. -
హారిక 14... హంపి 19
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు నిరాశ పరిచారు. ఓపెన్ విభాగంలో భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విష్ణు ప్రసన్న, నిహాల్ సరీన్... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి బరిలోకి దిగారు. ఓపెన్ విభాగంలో 15 రౌండ్లు జరిగాయి. 9.5 పాయింట్లు సాధించిన ఆనంద్ 23వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... 7.5 పాయింట్లతో హరికృష్ణ 93వ ర్యాంక్‌లో, విష్ణు ప్రసన్న 111వ ర్యాంక్‌లో, 7 పాయింట్లతో నిహాల్ సరీన్ 130వ ర్యాంక్‌లో నిలిచారు. 11.5 పాయింట్లు సాధించిన రష్యా గ్రాండ్‌మాస్టర్ డానిల్ దుబోవ్ విజేతగా అవతరించాడు. 10.5 పాయింట్లు సంపాదించిన షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), హికారు నకముర (అమెరికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ హారిక 8 పాయింట్లతో 14వ స్థానంతో... హంపి 7.5 పాయింట్లతో 19వ స్థానంతో సంతృప్తి పడ్డారు. 10 పాయింట్లతో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను సొంతం చేసుకుంది. హారిక ఆరు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. హంపి ఐదు గేముల్లో నెగ్గి, మరో ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా రెండు గేముల్లో ఓటమి పాలైంది. శనివారం మొదలైన బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది రౌండ్లు ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... 6 పాయింట్లతో హంపి 16వ స్థానంలో కొనసాగుతున్నారు. నేడు మిగతా ఎనిమిది రౌండ్లు జరుగుతాయి. -
దీనిని గొప్ప ఘనతగా భావిస్తున్నా
చెన్నై: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు. ‘ఇంతటి పెద్ద ఈవెంట్లో నేను ఒక గేమ్ మాత్రమే ఓడాను. వరుసగా మూడు రోజులు ర్యాపిడ్ ఆడి ఆ వెంటనే రెండు రోజులు 21 బ్లిట్జ్ గేమ్‌లు ఆడాల్సిన స్థితిలో దానిని పెద్ద ఘనతగా చెప్పవచ్చు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలు రెండింటిలోనూ పోడియంపై నిలబడగలిగాను. నాకు తెలిసి చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమైంది. గతంలో ఇలాంటి సమయంలో నేను కీలక దశలో పాయింట్లు కోల్పోయి వెనుకబడేవాడిని. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. ఇటీవల ఈ రెండు ఫార్మాట్లలో నాకు మంచి ఫలితాలు రాలేదు. దానిని సవరించే ప్రయత్నం చేశాను. నిజాయితీగా చెప్పాలంటే ఒకదాంట్లో బాగా ఆడగలననుకున్నాను. కానీ రెండింటిలో మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆనంద్ వ్యాఖ్యానించాడు. -
వరల్డ్ ‘కింగ్’ ఆనంద్
చదరంగపు రారాజు మళ్లీ యుద్ధభూమిలో కదం తొక్కాడు...48 ఏళ్ల వయసులో కొత్త ఎత్తులతో కుర్రాళ్లను చిత్తు చేస్తూ జగజ్జేతగా నిలిచాడు. ‘వేగం’లో తనను అందుకోవడం కష్టం అంటూ ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. అరవై నాలుగు గళ్లలో అతని ఆట ముగిసినట్లే అని భావించినవారికి పదునైన రీతిలో సమాధానమిస్తూ భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మరోసారి విశ్వ వేదికపై తన సత్తా చాటాడు. వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకొని శిఖరాన నిలిచాడు. 15 రౌండ్లలో ఒక్కటి కూడా ఓడకుండా అజేయంగా నిలిచి ఆనంద్ అగ్రస్థానాన్ని అందుకోవడం విశేషం. రియాద్: మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన పాత ఆట తీరును ప్రదర్శిస్తూ విశ్వ వేదికపై అగ్రస్థానాన నిలిచాడు. గురువారం ఇక్కడ ముగిసిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆనంద్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం ఆనంద్‌నే వరించింది. తెల్లపావులతో ఆడిన తొలి టైబ్రేక్‌ను 29 ఎత్తుల్లో సొంతం చేసుకున్న విషీ... నల్లపావులతో ఆడిన రెండో టైబ్రేక్‌ను 38 ఎత్తుల్లో దక్కించుకొని జగజ్జేతగా అవతరించాడు. గురువారం జరిగిన చివరి ఐదు రౌండ్లలో నాలుగు గేమ్‌లను విషీ డ్రా చేసుకున్నాడు. రష్యాకు చెందిన గ్రిష్చుక్తో జరిగిన 14వ రౌండ్ గేమ్‌ను 57 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో ఆనంద్ ఓవరాల్‌గా 6 గేముల్లో గెలిచి 9 గేముల్ని డ్రా చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన మాగ్నస్ కార్ల్సన్ చివరిదైన 15వ రౌండ్లో రష్యాకు చెందిన గ్రిష్చుక్ చేతిలో 60 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో 10 పాయింట్లతో టోర్నీలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. ►ఆనంద్ 2003లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. అయితే 2012 నుంచి ‘ఫిడే’ కొన్ని మార్పులతో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పేరుతో అధికారికంగా దీనిని నిర్వహిస్తోంది. గతంలో ఇదే టోర్నీలో ఆనంద్ 2014లో మూడో స్థానంలో నిలిచాడు. -
హంపి, హారికలకు నిరాశ
దోహా: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఎనిమిదో రౌండ్ ముగిశాక హారిక 4 పాయింట్లతో 16 వ స్థానంలో, హంపి 4 పాయింట్ల తోనే 20 వ స్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగిన నాలుగు గేముల్లో హంపి మూడింటిని ‘డ్రా’ చేసుకుని, మరో గేములో ఓడింది. హారిక రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుని , ఒక గేములో గెలిచి, మరో గేములో ఓడిపోయింది. బుధవారం మరో నాలుగు గేములు జరుగనున్నాయి. మరో వైపు ఓపెన్ విభాగంలో పదో రౌండ్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు -
‘ర్యాపిడ్ కింగ్’ కార్ల్సన్
బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 15 రౌండ్లపాటు జరిగిన ఈ మెగా ఈవెంట్లో కార్ల్సన్ 11.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కార్ల్సన్ బెర్లిన్‌లోనూ అదే జోరును కనబరిచాడు. 10.5 పాయింట్లతో ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా), తెమౌర్ రద్జబోవ్ (అజర్బైజాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లోనూ కార్ల్సన్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటే ఏకకాలంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో ఈ ఘనత సాధించిన తొలి చెస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్ ఆనంద్ (9.5 పాయింట్లు) 25వ స్థానంలో, విదిత్ సంతోషి గుజరాతి (9 పాయింట్లు) 26వ స్థానంలో, ఆదిబన్ (9 పాయింట్లు) 28వ స్థానంలో నిలిచారు. కృష్ణన్ శశికిరణ్ (8 పాయింట్లు), సేతురామన్ (7.5 పాయింట్లు), సూర్యశేఖర గంగూలీ (7 పాయింట్లు) వరుసగా 59వ, 86వ, 96వ ర్యాంక్‌లతో సరిపెట్టుకున్నారు. -
ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు
బెర్లిన్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 15 రౌండ్లపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆనంద్‌కు తొలి నాలుగు రౌండ్లలో రెండు విజయాలు లభించగా... ఒక ‘డ్రా’... మరో ఓటమి ఎదురైంది. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో... అలెగ్జాండర్ ఒనిస్చుక్ (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 53 ఎత్తుల్లో గెలిచాడు. అయితే సలీమ్ సలెహ్ (యూఏఈ)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని... డానిల్ దుబోవ్ (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో 42 ఎత్తుల్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు భారత్‌కే చెందిన విదిత్ సంతోషి గుజరాతి మూడు గేముల్లో నెగ్గి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. గాదిర్ (అజర్బైజాన్), వోలోకితిన్ (ఉక్రెయిన్), గ్రిస్చుక్ (రష్యా)లపై నెగ్గిన విదిత్... నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.