కోనేరు హంపి
మాస్కో: భారత నంబర్‌వన్ మహిళా చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపి తన కెరీర్‌లోనే అతి గొప్ప విజయం సాధించింది. శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. నిరీ్ణత 12 రౌండ్ల తర్వాత కోనేరు హంపి, లీ టింగ్‌జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపి, లీ టింగ్‌జి తొలి రెండు స్థానాల్లో... అతాలిక్ మూడో స్థానంలో నిలిచారు. దాంతో అతాలిక్‌కు కాంస్యం ఖాయమైంది. హంపి, లీ టింగ్‌జి మధ్య ప్రపంచ చాంపియన్ ఎవరో నిర్ణయించేందుకు ముందుగా రెండు బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా... రెండో బ్లిట్జ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది.
దాంతో టైబ్రేక్‌లోనూ ఇద్దరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు చివరగా ‘అర్మగెడాన్ గేమ్’ను నిర్వహించారు. ‘అర్మగెడాన్’ నిబంధన ప్రకారం గేమ్‌లో తెల్లపావులతో ఆడిన వారు తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ‘డ్రా’ అయితే మాత్రం నల్లపావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో హంపి 66 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించింది. లీ టింగ్‌జి రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. అంతకుముందు నిరీ్ణత 12 రౌండ్లలో హంపి ఏడు గేముల్లో గెలిచింది. హంపి... మార్గరిటా పొటపోవా, నినో ఖోమెరికో, కొవలెవ్‌స్కాయ, ఓల్గా గిరియా, నానా జాగ్‌నిద్జే, దరియా వోయిట్, తాన్ జోంగిలపై గెలిచింది. దరియా చరోచిక్నా, అనా ముజిచుక్, అతాలిక్ ఎకతెరీనా, కాటరీనా లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఇరీనా బుల్‌మగా చేతిలో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు.
►2 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ చరిత్రలో హంపి గెలిచిన పతకాల సంఖ్య. 2012లో హంపి కాంస్య పతకం సాధించింది.
►2 భారత్ తరఫున ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో ప్లేయర్ హంపి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఓపెన్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment