Koneru Hamphy
-
Candidates Chess Tournament: హంపి పరాజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. నాలుగో రౌండ్లో బల్గేరియా గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 36వ ర్యాంకర్ న్యుర్గుల్ సలీమోవా 62 ఎత్తుల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపిపై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఈ టోరీ్నలో రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను వైశాలి 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఓపెన్ విభాగం నాలుగో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విదిత్ సంతోష్ గుజరాతి 44 ఎత్తుల్లో నిపోమ్నియాషి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. నకముర (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద 24 ఎత్తుల్లో...ఫాబియానో కరువానా (అమెరికా)తో గేమ్‌ను గుకేశ్ 74 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఎలైన్ రోబర్స్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక 2.5–1.5తో గెలిచింది. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో గేమ్‌లో హారిక 73 ఎత్తుల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెలా ఖొటెనాష్ లి (జార్జియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 1–3తో ఓడిపోయింది. ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్ తొలి గేమ్‌లో హంపి 54 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 43 ఎత్తుల్లో పరాజయం పాలైంది. గుకేశ్ ముందంజ... ఓపెన్ విభాగంలో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)పై ప్రజ్ఞానంద గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లోని రెండు గేముల్లో 2787 ఎలో రేటింగ్ ఉన్న నకమురను 2690 రేటింగ్ కలిగిన ప్రజ్ఞానంద ఓడించడం విశేషం. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తొలి గేమ్‌లో 33 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో విజయం సాధించాడు. తమిళనాడుకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2.5–1.5తో ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... నిహాల్ సరీన్ 1–3తో నెపోమ్నిశి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
కోనేరు హంపితో ప్రియాంక పోటీ! ముగిసిన హర్ష భరతకోటి కథ..
బకూ (అజర్బైజాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్లో ప్రియాంక ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్‌లో 1.5–0.5తో గెలుపొందింది. టైబ్రేక్ తొలి గేమ్‌ను 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న ప్రియాంక, రెండో గేమ్‌లో 45 ఎత్తుల్లో మరీనాను ఓడించి ఓవరాల్‌గా 2.5–1.5తో విజయం అందుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వీరి ద్దరి మధ్య జరిగిన తొలి రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ గేమ్‌లను నిర్వహించారు. రెండో రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపితో ప్రియాంక తలపడుతుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి కథ తొలి రౌండ్లోనే ముగిసింది. లెవాన్ పాంట్సులెయ (జార్జియా)తో టైబ్రేక్ తొలి గేమ్‌లో హర్ష 75 ఎత్తుల్లో ఓడిపోయి, రెండో గేమ్‌ను 66 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 0.5–1.5తో ఓటమి చవిచూశాడు. -
International Chess Federation: రన్నరప్ హంపి
మ్యూనిక్ (జర్మనీ): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళలగ్రాండ్ప్రి సిరీస్ రెండో టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ 64 ఎత్తుల్లో జినెల్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది. -
World Blitz Chess: హంపి అద్భుతం
అల్మాటీ (కజకిస్తాన్): ఊహకందని ఆటతీరుతో అదరగొట్టిన భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి రోజు గురువారం తొమ్మిది రౌండ్లు ముగిశాక హంపి 5 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉండటంతో ఆమెకు పతకం నెగ్గే అవకాశాలు లేవని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హంపి రెండో రోజు జరిగిన ఎనిమిది గేముల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు గేముల్లో గెలవడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని 44వ స్థానం నుంచి ఏకంగా రెండో ర్యాంక్‌కు చేరుకుంది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా... 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ. 24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్‌లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్‌లో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో హంపి సాధించిన మొత్తం పతకాలు. ర్యాపిడ్ విభాగంలో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకం గెలిచింది. బ్లిట్జ్ విభాగంలో రజతం రూపంలో తొలిసారి పతకం సాధించింది. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
పతకం రేసులో భారత్ ‘ఎ’
చెన్నై: చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్ తర్వాత భారత్ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్లో భారత్ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్‌పై నెగ్గింది. ఓపెన్ విభాగంలో భారత్ ‘ఎ’ మూడో స్థానంలో... భారత్ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్ జరుగుతుంది. -
చెస్ ఒలింపియాడ్‌కు జట్లను ప్రకటించిన భారత్..
చెన్నై: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత జట్లను అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఆతిథ్య జట్టుగా వేర్వేరు విభాగాల్లో రెండేసి చొప్పున జట్లను ఆడించే వెసులుబాటు ఉండటంతో ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి 20 మందితో మొత్తం నాలుగు జట్లను ఎంపిక చేశారు. రష్యాలో యుద్ధం కారణంగా భారత్‌కు టోర్నీ వేదిక మారగా... చెన్నైలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు ఒలింపియాడ్‌ను నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తెలంగాణకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి బరిలోకి దిగనున్నారు. చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈసారి భారత జట్టుకు ‘మెంటార్’ హోదాలో మార్గనిర్దేశనం చేయనుండటం విశేషం. ‘గత కొంత కాలంగా నేను చాలా తక్కువ టోర్నీల్లోనే పాల్గొంటున్నాను. పైగా ఎన్నో ఒలింపియాడ్స్ ఆడాను కాబట్టి కొత్తతరం ఆటగాళ్లు బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లతో టీమ్ ‘ఎ’ను, వర్ధమాన ఆటగాళ్లతో టీమ్ ‘బి’ను ఎంపిక చేశారు. 2014 ఒలింపియాడ్‌లో భారత జట్టు కాంస్యం గెలవగా... కరోనా కారణంగా ఆన్లైన్లో జరిగిన టోర్నీలో రష్యాతో భారత్ సంయుక్త విజేతగా (2020) నిలువగా... 2021లో మహిళల విభాగంలో భారత జట్టుకు కాంస్యం లభించింది. భారత జట్ల వివరాలు ఓపెన్: భారత్ ‘ఎ’: పెంటేల హరికృష్ణ, శశికిరణ్, విదిత్, అర్జున్, ఎస్ఎల్ నారాయణన్. భారత్ ‘బి’: నిహాల్ సరీన్, దొమ్మరాజు గుకేశ్, ఆధిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని. మహిళలు: భారత్ ‘ఎ’: హంపి, హారిక, తానియా, వైశాలి, భక్తి కులకర్ణి. భారత్ ‘బి’: పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్ గోమ్స్, వంతిక, దివ్య దేశ్‌ముఖ్. -
ఆరో స్థానంలో హంపి
వార్సా (పోలాండ్): ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 7.5 పాయింట్లు సాధించింది. హంపి నాలుగు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. హంపితోపాటు మరో ఎనిమిది మంది కూడా 7.5 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హంపికి ఆరో స్థానం దక్కింది. రష్యా గ్రాండ్‌మాస్టర్ కొస్టెనియుక్ 9 పాయింట్లతో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. బిబిసారా (కజకిస్తాన్–8.5) రన్నరప్ నిలిచింది. గునీనా (రష్యా), కాటరీనా (రష్యా), సెరిక్బె (కజకిస్తాన్) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. -
కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల చెస్ నంబర్‌వన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి స్పెయిన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్లైన్ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్ ఈవెంట్ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపి భారత్‌లో తయారైన కోవాగ్జిన్ టీకా తీసుకుంది. కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్లో గడపాలి. ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్ మెసిడోనియా మీదుగా స్పెయిన్ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది. కోవాగ్జిన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌తో ఆమె కూడా స్పెయిన్ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి. చదవండి: Koneru Humpy: థ్యాంక్యూ సాక్షి.. న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు -
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు షాక్
చెన్నై: ఆన్లైన్ వరల్డ్ చెస్ ఒలింపియాడ్‌లో గత ఏడాది సంయుక్త విజేత భారత జట్టుకు చుక్కెదురైంది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో 1.5–4.5తో పరాజయం పాలైంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆడిన మూడు గేముల్లోనూ విజయం సాధించినా ఆమె సహచరులు తడబడటంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ముందుగా తొలి రౌండ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1తో అమెరికాను ఓడించి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. హారిక 68 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీపై, విశ్వనాథన్ ఆనంద్ 57 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌పై, పెంటేల హరికృష్ణ 53 ఎత్తుల్లో దరియజ్పై, వైశాలి 38 ఎత్తుల్లో థలియా లాండిరోపై గెలుపొందారు. కోనేరు హంపి 29 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, నిహాల్ సరీన్ 70 ఎత్తుల్లో లియాంగ్ అవండర్లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 2–4తో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. హారిక 51 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై నెగ్గగా... హంపి 32 ఎత్తుల్లో ఇరీనా క్రష్‌తో, వైశాలి 60 ఎత్తుల్లో థలియా లాండిరోతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. ప్రజ్ఞానంద 54 ఎత్తుల్లో లియాంగ్ చేతిలో, విదిత్ 46 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో, ఆనంద్ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక ‘బ్లిట్జ్ టైబ్రేక్’లో హారిక 34 ఎత్తుల్లో నాజి పైకిద్జెపై గెలుపొందగా... నిహాల్ 44 ఎత్తుల్లో లియాంగ్‌తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. వైశాలి 31 ఎత్తుల్లో థలియా చేతిలో, హరికృష్ణ 35 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ చేతిలో, హంపి 49 ఎత్తుల్లో ఇరీనా క్రష్ చేతిలో, ఆధిబన్ 33 ఎత్తుల్లో రాబ్సన్ రే చేతిలో ఓటమి చవిచూశారు. మరో సెమీఫైనల్లో రష్యా 2–0తో చైనాను ఓడించి నేడు జరిగే ఫైనల్లో అమెరికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. -
ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు
చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత మహిళా చెస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్‌లోనూ టైటిల్ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయిప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్ఎస్ ప్రణయ్, ప్రణవ్ చోప్రా, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్’ ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి, లెరాయ్ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్ బాబు, మురళీధరన్ పేర్లను ‘బాయ్’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది. -
ప్రపంచ క్యాండిడేట్స్ మహిళల చెస్ టోర్నీకి కోనేరు హంపి అర్హత
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2022 మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి అర్హత సాధించింది. 2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో ఆమెకు క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందారు. ∙గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్ టోర్నీ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేసింది. రష్యాలోని స్కొల్కోవాలో జరిగిన టోర్నీలో హంపి విజేతగా (160 పాయింట్లు), మొనాకో టోర్నీలో సంయుక్త విజేతగా (133 పాయింట్లు) నిలిచింది. కరోనా నేపథ్యంలో హంపి జిబ్రాల్టర్ టోర్నీకి దూరంగా ఉంది. ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్–3లో నిలువడంతో హంపికి బెర్త్ ఖరారైంది. ∙వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీ విజేత 2022 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో తలపడుతుంది. -
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
విజేత కోనేరు హంపి
న్యూఢిల్లీ: భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పురస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. ఈ విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌లతో పోటీ పడిన తెలుగు తేజం హంపి తుది విజేతగా నిలిచింది. 40 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డు నామినీలను ఎంపిక చేయగా... అభిమానుల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఐదుగురు నామినీల్లో అత్యధిక ఓట్లు హంపికే వచ్చాయని బీబీసీ తెలిపింది. అవార్డుల ప్రకటన కార్య క్రమాన్ని ‘వర్చువల్’గా బీబీసీ నిర్వహించింది. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు పతకం గెలిచిన ఏకైక భారత అథ్లెట్ అయిన అంజూ జార్జ్‌కు ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు... షూటర్ మనూ భాకర్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించాయి. భారత క్రీడారంగంలోని అత్యు త్తమ క్రీడాకారిణులకు తగిన గుర్తింపునిస్తూ 2019లో ఈ అవార్డును బీబీసీ ప్రారంభించగా... బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు తొలి విజేతగా నిలిచింది. ఈ అవార్డు నాకు మాత్రమే కాకుండా మొత్తం చెస్ క్రీడకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా. క్రికెట్ సహా ఇతర క్రీడలతో పోలిస్తే భారత్‌లో చెస్‌పై ఎక్కువ మంది దృష్టి ఉండదు. ఇకపై మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నా ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం కారణంగానే ఇన్నేళ్లుగా విజయాలు సాధించగలుగుతున్నాను. ఒక మహిళా క్రీడాకారిణి ఆటను వదిలేయాలని ఎప్పుడూ అనుకోరాదు. పెళ్లి, పిల్లలు జీవితంలో భాగమే కానీ మన జీవన గమనాన్ని మార్చరాదు. –హంపి -
చెస్ స్టార్స్ విరాళం రూ. 4 లక్షల 50 వేలు
చెన్నై: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు తమవంతుగా చేయూతనిచ్చారు. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అభిమానులతో ఆన్లైన్లో 20 బోర్డులపై చెస్ గేమ్‌లు ఆడారు. చెస్.కామ్–ఇండియా వెబ్సైట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చెస్ స్టార్స్‌తో ఆడిన వారు స్వచ్ఛందంగా కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా చెస్ స్టార్స్ మొత్తం ఆరు వేల డాలర్లు (రూ. 4 లక్షల 50 వేలు) సమకూర్చారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. -
వన్‌పవర్‌మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్‌లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
ఆధిక్యంలో హంపి
సెయింట్ లూయిస్ (అమెరికా): ఈ ఏడాది తొలి టైటిల్‌కు ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ కోనేరు హంపి విజయం దూరంలో ఉంది. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 35 ఎత్తుల్లో విజయం సాధించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో హంపి తలపడుతుంది. ఈ గేమ్‌లో హంపి గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా విజేతగా అవతరిస్తుంది. మరోవైపు హారిక ఈ టోర్నీలో ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. హారిక ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఐదు పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 4.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), మరియా ముజిచుక్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అగ్రస్థానంలో నిలిస్తే ప్లే ఆఫ్ గేమ్‌ల (ర్యాపిడ్, బ్లిట్జ్, అర్మగెడాన్) ద్వారా ఏకైక విజేతను నిర్ణయిస్తారు. -
ఎన్నో ఏళ్ల కల నెరవేరింది : హంపి
సాక్షి, గన్నవరం : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించడంతో తన ఎన్నోఏళ్ల కల నేరవేరిందని కోనేరు హంపి ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 28,29.30 తేదిల్లో రష్యాలోని మాస్కోలో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న హంపిని బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు శాలువా, బొకేలతో ఘన స్వాగతం పలికారు. హంపి మాట్లాడుతూ.. తన ఎన్నో ఏళ్ల కళ ఈసారి నెరవేరిందని, ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందివ్వడంతోనే తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. -
కోనేరు హంపికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. (విశ్వవిజేత కోనేరు హంపి) -
విశ్వవిజేత కోనేరు హంపి
మాస్కో: భారత నంబర్‌వన్ మహిళా చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపి తన కెరీర్లోనే అతి గొప్ప విజయం సాధించింది. శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. నిరీ్ణత 12 రౌండ్ల తర్వాత కోనేరు హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హంపి, లీ టింగ్జి తొలి రెండు స్థానాల్లో... అతాలిక్ మూడో స్థానంలో నిలిచారు. దాంతో అతాలిక్కు కాంస్యం ఖాయమైంది. హంపి, లీ టింగ్జి మధ్య ప్రపంచ చాంపియన్ ఎవరో నిర్ణయించేందుకు ముందుగా రెండు బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా... రెండో బ్లిట్జ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. దాంతో టైబ్రేక్‌లోనూ ఇద్దరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు చివరగా ‘అర్మగెడాన్ గేమ్’ను నిర్వహించారు. ‘అర్మగెడాన్’ నిబంధన ప్రకారం గేమ్‌లో తెల్లపావులతో ఆడిన వారు తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ‘డ్రా’ అయితే మాత్రం నల్లపావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో హంపి 66 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించింది. లీ టింగ్జి రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. అంతకుముందు నిరీ్ణత 12 రౌండ్లలో హంపి ఏడు గేముల్లో గెలిచింది. హంపి... మార్గరిటా పొటపోవా, నినో ఖోమెరికో, కొవలెవ్స్కాయ, ఓల్గా గిరియా, నానా జాగ్‌నిద్జే, దరియా వోయిట్, తాన్ జోంగిలపై గెలిచింది. దరియా చరోచిక్నా, అనా ముజిచుక్, అతాలిక్ ఎకతెరీనా, కాటరీనా లాగ్నోలతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఇరీనా బుల్మగా చేతిలో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు. ►2 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ చరిత్రలో హంపి గెలిచిన పతకాల సంఖ్య. 2012లో హంపి కాంస్య పతకం సాధించింది. ►2 భారత్ తరఫున ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండో ప్లేయర్ హంపి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఓపెన్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. -
టైటిల్‌తో సీజన్ ముగించేనా?
మాస్కో: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఈ సంవత్సరంలో చివరి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మాస్కోలో నేడు మొదలయ్యే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపి, హారిక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం 121 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. గురు, శుక్ర, శనివారాల్లో నాలుగు రౌండ్ల చొప్పున గేమ్‌లు జరుగుతాయి. ఈనెల 29, 30వ తేదీల్లో బ్లిట్జ్ విభాగం గేమ్‌లను నిర్వహిస్తారు. బ్లిట్జ్ కేటగిరీలో 17 రౌండ్లు ఉంటాయి. ఇక ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, శ్రీనాథ్ నారాయణన్, అరవింద్ చిదంబరం, విష్ణుప్రసన్న, హర్ష భరతకోటి, రౌనక్ సాధ్వాని, నిహాల్ సరీన్, డి.గుకేశ్ ఉన్నారు. -
విజేత కోనేరు హంపి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ చెస్ ప్లేయర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోనేరు హంపి అద్భుతం చేసింది. రష్యాలోని స్కోల్‌కోవోలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి (డబ్ల్యూజీపీ) సిరీస్ 2019–2020 తొలి టోరీ్నలో ఆమె చాంపియన్‌గా అవతరించింది. ఆరేళ్ల విరామం తర్వాత హంపి డబ్ల్యూజీపీ టైటిల్ సాధించడం విశేషం. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి అజేయంగా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోరీ్నలో ఆమె 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 7.5 పాయింట్లతో జు వెన్జున్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో జరిగిన చివరి గేమ్‌ను హంపి 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో హంపి ఐదు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’గా ముగించింది. ద్రోణవల్లి హారిక (భారత్), మేరీ సెబాగ్ (ఫ్రాన్స్), కొస్టెనిక్ (రష్యా), గొర్యాచికినా (రష్యా), కాటరీనా లాగ్నో (రష్యా), జు వెన్జున్ (చైనా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి... అలీనా కాష్లిన్ స్కాయ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), స్టెఫనోవా (బల్గేరియా), ఎలిజబెత్ పెట్జ్ (జర్మనీ), వాలెంటినా గునీనా (రష్యా)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన హంపికి 15 వేల యూరోల (రూ. 11 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 160 పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ►7 హంపి కెరీర్లో నెగ్గిన గ్రాండ్‌ప్రి టైటిల్స్. తాజా టైటిల్‌కంటే ముందు ఆమె 2013లో దిలిజాన్ (అర్మేనియా), తాషె్కంట్ (ఉజ్బెకిస్తాన్); 2012లో కజాన్ (రష్యా), అంకారా (టరీ్క); 2009లో ఇస్తాంబుల్ (టరీ్క), దోహా (ఖతర్) టోరీ్నల్లో విజేతగా నిలిచింది. -
అగ్రస్థానంలో కోనేరు హంపి
పెంగ్షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ ఈవెంట్లో తొలి రోజు గేమ్‌లు ముగిశాక ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లకుగాను తొలి రోజు శుక్రవారం 12 రౌండ్లు ముగిశాయి. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ టోర్నీలో 12 రౌండ్లు పూర్తయ్యాక హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. మిగతా మూడు గేముల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. హారిక మూడు గేముల్లో గెలిచి, ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. శనివారం మిగతా పది రౌండ్ గేమ్‌లు జరుగుతాయి. ఇదే టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక 14వ ర్యాంక్‌లో, హంపి 15వ ర్యాంక్‌లో నిలిచారు. .