
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి పేలవ ప్రదర్శన కనబరిచారు. 16 మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక 14వ స్థానంలో, హంపి 15వ స్థానంలో నిలిచారు. నిర్ణీత 11 రౌండ్ల అనంతరం హంపి 4 పాయింట్లతో, హారిక 4.5 పాయింట్లతో చివరి నుంచి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనిక్ 8 పాయింట్లతో విజేతగా అవతరించగా... వాలెంటీనా గునినా (రష్యా) 7 పాయింట్లతో రెండోస్థానంలో, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) 6.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో ఓడిన హారిక... హంపితో పదోగేమ్‌ను 43 ఎత్తుల్లో, జి జావో (చైనా)తో పదకొండో గేమ్‌ను 65 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరోవైపు హంపి చివరి రోజు మూడు డ్రాలను నమోదు చేసింది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో తొమ్మిదో రౌండ్‌ను 48 ఎత్తుల్లో, హారికతో పదోరౌండ్‌ను 43 ఎత్తుల్లో, టింగ్‌జీ లీ (చైనా)తో పదకొండో రౌండ్‌ను 49 ఎత్తుల్లో డ్రాగా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment