బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఎలైన్ రోబర్స్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక 2.5–1.5తో గెలిచింది.
నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో గేమ్‌లో హారిక 73 ఎత్తుల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెలా ఖొటెనాష్ లి (జార్జియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 1–3తో ఓడిపోయింది. ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్ తొలి గేమ్‌లో హంపి 54 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 43 ఎత్తుల్లో పరాజయం పాలైంది.
గుకేశ్ ముందంజ...
ఓపెన్ విభాగంలో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)పై ప్రజ్ఞానంద గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్‌లోని రెండు గేముల్లో 2787 ఎలో రేటింగ్ ఉన్న నకమురను 2690 రేటింగ్ కలిగిన ప్రజ్ఞానంద ఓడించడం విశేషం.
తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తొలి గేమ్‌లో 33 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో విజయం సాధించాడు. తమిళనాడుకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2.5–1.5తో ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... నిహాల్ సరీన్ 1–3తో నెపోమ్‌నిశి (రష్యా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment