dronavalli Harika
-
9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం
చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్లాంటివేమీ లేవు. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది. -
భారత్‌కు రజతం
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు రజతం లభించింది. 2007లో ఈ మెగా ఈవెంట్ మొదలయ్యాక భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. గోర్యాక్ చినా, కొస్టెనిక్, కాటరీనా లాగ్నో (గ్రాండ్ మాస్టర్లు), షువలోవా, కషిలిన్‌స్కాయాలతో కూడిన రష్యా జట్టు తో శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా, భక్తి కులకర్ణి, మేరీఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత జట్టు 0–2తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను భారత్ 1.5–2.5తో చేజా ర్చుకోగా... రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓటమి చవిచూసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ గోర్యాక్‌చినాతో జరిగిన తొలి గేమ్‌లో హారిక 47 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 39 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
విజేత హారిక
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. హారిక 11 మంది గ్రాండ్మాస్టర్లతో గేమ్‌లు ఆడింది. రెండు గేముల్లో గెలిచింది. ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడింది. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది. -
14లో హారిక...15లో హంపి
పెంగ్‌షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి పేలవ ప్రదర్శన కనబరిచారు. 16 మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక 14వ స్థానంలో, హంపి 15వ స్థానంలో నిలిచారు. నిర్ణీత 11 రౌండ్ల అనంతరం హంపి 4 పాయింట్లతో, హారిక 4.5 పాయింట్లతో చివరి నుంచి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనిక్ 8 పాయింట్లతో విజేతగా అవతరించగా... వాలెంటీనా గునినా (రష్యా) 7 పాయింట్లతో రెండోస్థానంలో, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) 6.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో ఇరినా క్రుష్ (అమెరికా) చేతిలో ఓడిన హారిక... హంపితో పదోగేమ్‌ను 43 ఎత్తుల్లో, జి జావో (చైనా)తో పదకొండో గేమ్‌ను 65 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మరోవైపు హంపి చివరి రోజు మూడు డ్రాలను నమోదు చేసింది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో తొమ్మిదో రౌండ్‌ను 48 ఎత్తుల్లో, హారికతో పదోరౌండ్ను 43 ఎత్తుల్లో, టింగ్జీ లీ (చైనా)తో పదకొండో రౌండ్‌ను 49 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. -
మళ్లీ టైబ్రేక్‌లో హారిక భవితవ్యం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన ఖాతాలో మరో ‘డ్రా’ నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో శనివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్‌ను హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరు 1–1తో సమమయ్యారు. ఫలితంగా వీరిద్దరిలో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. తొలి రెండు రౌండ్లలో కూడా హారిక టైబ్రేక్ ఆధారంగానే విజయం సాధించింది. మరి మూడో రౌండ్లో ఆమెకు ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. -
హంపి గేమ్ ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ ఎనిమిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సరాసదత్ (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... హారిక 45 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జే (జార్జియా) చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో పేస్ జంట న్యూఢిల్లీ: డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-చార్డీ (ఫ్రాన్స్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పేస్-చార్డీ జంట 6-3, 4-6, 10-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది.