చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది.
ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్‌లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్‌ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్‌లాంటివేమీ లేవు. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment