సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. టర్కీలో ఆదివారం ముగిసిన ప్రపంచ యూత్ అండర్–16 చెస్ ఒలింపియాడ్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. అర్జున్, ఇనియన్ పనీర్‌సెల్వం, సంకల్ప్ గుప్తా, కౌస్తవ్ చటర్జీ, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత జట్టు 14 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది.
భారత్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. స్లొవేనియా ‘ఎ’, టర్కీ, ఉక్రెయిన్, అర్మేనియా, రష్యా, అజర్‌బైజాన్, ఇరాన్‌లపై నెగ్గిన భారత బృందం... బెలారస్, ఉజ్బెకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకోగా... 13 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని పొందింది. వ్యక్తిగతంగా టాప్ బోర్డు–1లో ఆడిన 15 ఏళ్ల అర్జున్ తొమ్మిది గేమ్‌ల ద్వారా ఏడు పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. వరంగల్‌కు చెందిన అర్జున్ ఆడిన తొమ్మిది గేముల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. అలీరెజా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం, నికోలజ్ (జార్జియా) కాంస్యం కైవసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment