తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ప్రస్థానం
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ‘స్వర్ణ’ ప్రదర్శనలో కీలకపాత్ర
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి భారత స్టార్
స్వీయ అంచనాలతో పాటు... ఫలితాల ఒత్తిడితో సతమతమై కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్... వాటిని పక్కన పెట్టడం వల్లే విజయవంతం అయ్యానని వెల్లడించాడు. ఇటీవల హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఈ ఓరుగల్లు కుర్రాడు ఇక మీదట కూడా ఇదే జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
వందేళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించగా... అందులో తన వంతు పాత్ర ఉండటం ఆనందంగా ఉందని 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ఒలింపియాడ్‌లో ఆడిన 11 గేమ్‌ల్లో తొమ్మిదింట నెగ్గిన అర్జున్... వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా మూడో స్థానానికి దూసుకెళ్లాడు. చెస్ ఒలింపియాడ్ ప్రదర్శన, కెరీర్ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై అర్జున్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే...
అతిగా ఆలోచించి...
ఒత్తిడిని అధిగమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆందోళన చెందలేదు. అయితే 2021లో నా ఎలో రేటింగ్ పాయింట్లు 2500 ఉండేవి. కానీ నా సామర్థ్యం కచ్చితంగా అంతకన్నా ఎక్కువే అని నమ్మేవాడిని. ఇక రెండేళ్లు తిరిగేసరికి 2023లో ఎలో రేటింగ్ 2700కు చేరింది. కానీ ఆ సంవత్సరం చాలా కష్టంగా గడించింది. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైంది క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక కాకపోవడం.
చాన్నాళ్లుగా ఆ టోర్నీలో ఆడాలని అనుకుంటూ వచ్చా. అయితే గత ఏడాది దానికి అర్హత సాధించలేకపోవడం బాధించింది. ఒకప్పుడు సొంత అంచనాలతో సతమతమయ్యేవాడిని. ఎక్కువ ఊహించేసుకొని గందరగోళానికి గురయ్యే వాడిని. ఫలితాల గురించి అతిగా ఆలోచించడం నా ఆటతీరుపై ప్రభావం చూపింది. దాన్ని మార్చుకోవడం అంత సులువుకాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.
ఫలితాలను పట్టించుకోవడం మానేశా. ఏదో సాధించాలని తీవ్రంగా కోరుకుంటూ నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటున్నానని అర్థం చేసుకున్నా. వాటిపై దృష్టి పెట్టడం వదిలేశాక మెరుగైన పలితాలు రావడం ప్రారంభమైంది.
అదే అతిపెద్ద లక్ష్యం!
ప్రపంచ చాంపియన్‌గా నిలవడమే నా అతిపెద్ద లక్ష్యం. అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా ఎప్పటికప్పుడు చిన్న చిన్న గమ్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకుంటూ ముందుకు సాగుతున్నా. ఒక టోర్నమెంట్‌లో బరిలోకి దిగితే దాని గురించే ఆలోచిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సానుకూల ఫలితం సాధించాలనుకుంటా.
ప్రస్తుతం మన ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దీన్ని చదరంగంలో మన ‘గోల్డెన్ ఎరా’గా చెప్పుకొవచ్చు. నాతో పాటు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు.
మేమంతా స్నేహితులం
గుకేశ్, ప్రజ్ఞానందతో మంచి అనుబంధం ఉంది. చాన్నాళ్లుగా కలిసి ఆడుతుండటంతో మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఒకరి విజయాన్ని మరొకరం ఆస్వాదిస్తాం. వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఒకరికి ఒకరం అండగా నిలుస్తాం. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇది ఎంతగానో దోహద పడుతుంది.
2003 నుంచి 2006 మధ్య జన్మించిన వాళ్లమే జట్టులో ఎక్కువ మంది ఉన్నాం. అందులో నేనే పెద్దవాడిని. ప్రస్తుతం మన దశ నడుస్తోంది. స్వతహాగా నేను టీమ్ ఈవెంట్‌లు ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతా. గ్లోబల్ చెస్ లీగ్ (జీఎస్‌ఎల్) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
చెస్ ఐపీఎల్
గ్లోబల్ చెస్ లీగ్‌ను చదరంగ ఐపీఎల్ అని భావిస్తా. సమష్టి ప్రదర్శనలు అంటే నాకు చాలా ఇష్టం. ర్యాపిడ్ ఫార్మాట్‌లో జరగనున్న గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ లీగ్‌లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. నల్ల పావులతో ఆడి విజయం సాధిస్తే నాలుగు పాయింట్లు... తెల్ల పావులతో గెలిస్తే మూడు పాయింట్లు కేటాయిస్తారు.
అంటే తెల్ల పావులతో ఆడిన సహచరుడు పరాజయం పాలైతే... ప్రత్యర్థి జట్టు పాయింట్లను అందుకునేందుకు ఇద్దరు ఆటగాళ్లు విజయాలు సాధించాల్సి ఉంటుంది. దీనివల్ల ‘డ్రా’ల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకే ఈ ఫార్మాట్ నన్ను బాగా ఆకర్షించింది. గత జీఎస్‌ఎల్‌లో ప్రపంచ నంబర్‌వన్ నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో కలిసి ఒకే జట్టు తరఫున బరిలోకి దిగడం చాలా సంతోషంగా అనిపించింది.
కార్ల్‌సన్ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ ఏడాది భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జట్టు తరఫున ఆడనున్నా. నా ఆటపై ఎంతో ప్రభావం చూపిన గురువు లాంటి విశ్వనాథన్ ఆనంద్‌తో సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా.
మానసికంగా సిద్ధమయ్యా...
ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రశాంతంగా ఉన్నా. ఫలానా టోర్నీలో ఫలానా ఆటగాడిపై తప్పక గెలవాలని అనుకున్నప్పుడు ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు. ఆ తర్వాత అత్యుత్తమ ఆటతీరు కనబరిస్తే ఫలితం కూడా అందుకు తగ్గట్లే ఉంటుందనే విషయం గ్రహించా. ఇది చెప్పినంత సులభం కాదు.
ఒత్తిడి నుంచి బయటపడి మెరుగైన ప్రదర్శన చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. గత ఏడాది క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించలేకపోవడం చాలా బాధించింది. ఈ ఏడాది చాలా బాగా గడిచింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment