ఫిట్‌నెస్‌తో ఉంటే 2028 ఒలింపిక్స్‌తో కెరీర్ ముగిస్తా
వరుస ఒలింపిక్ పతకాలు అద్భుతం ∙ గోల్‌కీపర్ శ్రీజేశ్ ‘గ్రేటెస్ట్’
భారత హాకీ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మనోగతం
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్‌నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్‌ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది.
ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు.
లక్ష్యం ఎల్‌ఏ–2028
‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్‌నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్‌లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు.
వరుస ఒలింపిక్ పతకాలు
‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు.
జట్టు కోసం ఏ పాత్రకైనా...
పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు.
మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు!
భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్‌లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment