indian hockey team
-
ప్రొ లీగ్‌తో భారత హాకీ జట్ల ఆట షురూ
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్‌తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ‘ఢీ’ కొట్టనుంది. ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్‌లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్‌లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.11 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తవడంతో ఫైనల్స్‌కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి. -
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
హర్మన్‌ప్రీత్‌కు 78 లక్షలు
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో భారీ ధర పలికింది. ఆదివారం ప్రారంభమైన హెచ్ఐఎల్ లీగ్ తొలి రోజు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ రూ. 78 లక్షలు పెట్టి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను కొనుగోలు చేసుకుంది. వేలం మొదటి రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ల కోసం ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అభిషేక్ కోసం బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ రూ. 72 లక్షలు వెచ్చించగా.. యూపీ రుద్రాస్ ఫ్రాంచైజీ హార్దిక్ సింగ్‌ను రూ. 70 లక్షలకు పెట్టి కొనుగోలు చేసుకుంది. తమిళనాడు డ్రాగన్స్ జట్టు అమిత్ రోహిదాస్ కోసం రూ. 48 లక్షలు వెచి్చంచగా... బెంగాల్ టైగర్స్ ఫ్రాంచైజీ జుగ్‌రాజ్‌కు అంత మొత్తమే ఇచ్చి తీసుకుంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ తొలి రోజు వేలంలో అత్యధికంగా సుమిత్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేసింది. తొలి రోజు వేలంలో భారత్ నుంచి 54 మంది ప్లేయర్లతో పాటు 18 మంది విదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 16 కోట్ల 88 లక్షల 50 వేలు ఖర్చు చేశాయి. ఎనిమిది ఫ్రాంచైజీల్లో కళింగ లాన్సర్స్ వద్ద అత్యధికంగా రూ. 2.57 కోట్లు ఇంకా మిగిలి ఉండగా... అత్యల్పంగా బెంగాల్ టైగర్స్ వద్ద రూ. 1.44 కోట్లు పర్స్ మనీ ఉంది. హైదరాబాద్ తూఫాన్స్ ఫ్రాంచైజీ వద్ద ఇంకా రూ. 2.04 కోట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన గొంజలో పైలట్ అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. అతడికోసం తమిళనాడు డ్రాగన్స్ జట్టు రూ. 68 లక్షలు వెచ్చించింది. నెదర్లాండ్స్‌కు చెందిన జిప్ జాన్సెన్ను రూ. 54 లక్షలు పెట్టి తమిళనాడు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. -
అజేయంగా ‘ఆసియా’ విజేతగా
డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్టుగానే టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగురవేసిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు చైనాతో తుదిపోరు అందరు అనుకున్నంత సులువుగా సాగలేదు. భారత్ స్థాయికి ఏమాత్రం సరితూగని చైనా ప్రతి క్వార్టర్లోనూ ఊహించని విధంగా ప్రతిఘటించింది. దీంతో భారత్ గోల్ చేసేందుకు ఆఖరి క్వార్టర్ దాకా నిరీక్షించక తప్పలేదు. చివరకు జుగ్రాజ్ చేసిన గోల్‌తో టీమిండియా ఏసీటీలో ఓవరాల్‌గా ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. హలుంబుయిర్: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఈవెంట్లో పరాజయం ఎరుగని టీమిండియా జైత్రయాత్ర టైటిల్ నిలబెట్టుకునేదాకా అజేయంగా సాగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఇందులో అత్యధికంగా ఐదుసార్లు భారత్ 2011, 2016, 2018 (పాక్‌తో కలిసి సంయుక్త విజేత), 2023లలో విజేతగా నిలవడం విశేషం. డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ ఆఖరి క్వార్టర్లోని 51వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గానీ, ఆటతీరులో గానీ సాటిరాని చైనా జట్టు ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేనకు ఊహించని విధంగా పోటీ ఇచ్చింది. ఈ టోర్నీలో లీగ్ దశ పోటీల్లో 3–0తో చైనా, 5–1తో జపాన్, 8–1తో మలేసియా, 3–1తో కొరియా, 2–1తో పాకిస్తాన్లను ఓడించిన భారత్ సెమీస్‌లో 4–1 కొరియాను ఓడించి టైటిల్‌పోరుకు చేరింది. దీంతో సులువైన ప్రత్యర్థి చైనాపై కనీసం రెండు, మూడు గోల్స్ తేడాతో విజయం ఖాయమని విశ్లేషకులు, అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. తుదిపోరులో కేవలం ఒకే ఒక్క గోల్ తేడాతో భారత్ గెలిచింది. చైనా డిఫెండర్లు భారత స్ట్రయికర్లను సమర్థంగా నిలువరించారు. దీంతో ఈ టోర్నీలోనే అతి తక్కువ గోల్స్ తేడాతో, భారత్ గెలిచిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం! మూడు క్వార్టర్ల పాటు... చైనా డిఫెండర్ల ఆటతీరు భారత ఫార్వర్డ్ లైన్‌కు గోడకట్టినట్లుగా సాగింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థి రక్షణ శ్రేణి భారత సేనను సమర్థవంతంగా నిలువరించింది. భారత్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా చేసిన దాడులన్నీ చైనా ఆటగాళ్ల పోరాటపటిమతో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పటివరకు ఎన్నో ఫైనల్స్ ఆడిన చరిత్ర భారత్‌ది కాగా... చైనాకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2006 ఆసియా క్రీడల ఫైనల్లో చైనా 1–3తో కొరియా చేతిలో ఓడింది. ఫైనల్స్ మ్యాచ్‌ల అనుభవం తక్కువే అయినా ప్రదర్శనతో చైనా ఆకట్టుకుంది. ఆట ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లను ఎక్కడికక్కడ నిలువరించడంతో రాజ్ కుమార్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్, నీలకంఠ శర్మ తొలి క్వార్టర్లో కొట్టిన టార్గెట్ షాట్లు నిరీ్వర్యమయ్యాయి. రెండో క్వార్టర్లోనూ ఇదే ఆటతీరు కొనసాగింది. 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచేందుకు సుఖ్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్‌లు చేసిన ప్రయత్నాల్ని చైనా గోల్‌కీపర్ వాంగ్ వీహావొ చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఎట్టకేలకు ఆఖరి క్వార్టర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వద్దకు వచ్చిన బంతిని నేర్పుగా చైనా డిఫెండర్లను ఏమార్చుతూ డి ఏరియా వద్ద అప్రమత్తంగా ఉన్న జుగ్‌రాజ్‌కు పాస్ చేశాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బంతిని గోల్‌పోస్టులోకి తరలించడంతో భారత్ శిబిరం ఎట్టకేలకు సంబరాల్లో మునిగింది. వర్గీకరణ పోరులో పాకిస్తాన్ 5–2తో కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రశంస: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఒలింపిక్స్ కాంస్య పతకంతో స్వదేశానికి చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. శనివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై భారత్ విజయం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. కానీ కాంస్య పతక మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య పతకం విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. 🇮🇳Indian Men's Hockey Team players arrive at Delhi airport after winning a bronze medal at the #Paris2024 🥉#Hockey #HarmanpreetSingh #Olympics pic.twitter.com/6O7BTlOy4u— InsideSport (@InsideSportIND) August 10, 2024 -
ఈసారీ గెలిచేద్దాం
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో తాము సాధించిన కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు ముందుగా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటాలి. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఎదురైన ప్రత్యర్థి బ్రిటన్ జట్టుతోనే పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. నేడు జరిగే ఈ నాకౌట్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు చేరుకొని పతకం రేసులో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ‘టోక్యో’ క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును ఓడించింది. ‘పారిస్’ గేమ్స్‌లో భారత హాకీ జట్టు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3–2తో గెలిచింది. రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్ విజేత అర్జెంటీనాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2–0తో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నాలుగో లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బెల్జియం జట్టు చేతిలో 1–2తో ఓడిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 3–2తో ఓడించి సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్ క్రీడల్లో ఆ్రస్టేలియా జట్టుపై 52 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని అందుకుంది. లీగ్ దశ మ్యాచ్‌ల ఫలితాలు, ప్రదర్శన ప్రస్తుతం గతంతో సమానం. నాకౌట్ మ్యాచ్ కావడంతో తప్పనిసరిగా గెలిస్తేనే జట్లు ముందుకు సాగుతాయి. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత బ్రిటన్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బ్రిటన్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా భారత జట్టు ఆద్యంతం నిలకడగా ఆడాల్సి ఉంటుంది. గోల్ చేసేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్కిన పెనాల్టీ కార్నర్లను లక్ష్యానికి చేర్చాలి. అందుబాటులో ఉన్న ముఖాముఖి రికార్డు ప్రకారం భారత్, బ్రిటన్ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడ్డాయి. 13 సార్లు బ్రిటన్ నెగ్గగా... 9 సార్లు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒలింపిక్స్‌లో మాత్రం బ్రిటన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. విశ్వ క్రీడల్లో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా... ఆరుసార్లు భారత్, మూడుసార్లు బ్రిటన్ గెలుపొందాయి. నేడు జరిగే ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో బెల్జియం; నెదర్లాండ్స్‌తో శ్రీఆ్రస్టేలియా; జర్మనీతో అర్జెంటీనా తలపడతాయి. యాదృచ్చికంగా ‘పారిస్’ గేమ్స్‌లోనూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌లో ఎదురెదురుగా తలపడిన జట్లే ఈసారి పోటీపడుతున్నాయి. -
Olympics 2024: బెల్జియం చేతిలో భారత హాకీ జట్టు ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బెల్జియంతో హోరాహోరీగా సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఓటమిపాలైంది. దీంతో పూల్-బిలో భారత్ రెండోస్థానానికి పడిపోగా.. తాజా విజయంతో బెల్జియం టాప్‌లోకి దూసుకువెళ్లింది.కాగా భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, బలాబలాలను పరీక్షించుకునే క్రమంలో గ్రూపు దశలో.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా వరల్డ్ నంబర్ వన్ బెల్జియంతో తలపడింది. నాకౌట్ దశకు ముందు ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న భారత్.. గెలుపొంది ఉంటే ఆత్మవిశ్వాసం ఇనుమడించి ఉండేది.ఉత్కంఠగా సాగిన మ్యాచ్అయినప్పటికీ టోక్యో గోల్డ్ మెడలిస్ట్ బెల్జియంకు భారత్ గట్టిపోటీనిచ్చింది. భారత్ తరఫున అభిషేక్ గోల్(18వ నిమిషంలో)తో మెరవగా.. బెల్జియం ప్లేయర్లలో తిబియూ స్టాక్‌బ్రోక్స్(33వ నిమిషంలో), జాన్-జాన్ డొమెన్(44వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఫలితంగా 1-2తో భారత జట్టు బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. ఇక బెల్జియం కూడా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదిలా ఉంటే.. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆఖరిగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.ఐర్లాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోగత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి... పూర్వవైభవాన్ని గుర్తు చేసిన భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్‌లోనూ శుభారంభం అందుకుంది. ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న టీమిండియా 7 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పూల్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు 2–0తో ఐర్లాండ్‌ను ఓడించింది.ఇక మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (13వ, 19వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటాడు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు రాగా.. అందులో కేవలం ఒక్క దాన్ని మాత్రమే గోల్‌గా మలచగలిగింది. మరోవైపు ఐర్లాండ్ 10 పెనాల్టీ కార్నర్ లను వృథా చేసింది. తొలి రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ చేసిన టీమిండియా... ద్వితీయార్థంలో గోల్ కొట్టలేకపోయింది. మన డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా నిలిచి ప్రత్యర్థి ప్రయత్నాలను భగ్నం చేశాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు చేరుతాయి.ప్యారిస్ ఒలింపిక్స్-2024 పురుషుల హాకీ పూల్స్పూల్-ఏ: నెదర్లాండ్స్, జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, సౌతాఫ్రికాపూల్-బి: బెల్జియం, భారత్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్.చదవండి: Paris Olympics 2024: షూటింగ్లో కాంస్య పతకం.. ఎవరీ స్వప్నిల్ కుసాలె..? -
‘ఏడు’ దాటి ఎంత వరకు?
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. భారత హాకీ జట్టుతోపాటు వ్యక్తిగత విభాగంలో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, సింధు, లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో కూడా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. గత ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు నెగ్గిన రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ ఈసారి అర్హత సాధించలేదు. మళ్లీ సత్తా చాటేందుకు... ఒలింపిక్ స్వర్ణపతకంతో పాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో మళ్లీ పతకం సాధిస్తాడని అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. టోక్యో తర్వాత ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ప్రధాన ఈవెంట్లలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చి ఎక్కడా వైఫల్యం లేకపోవడం నీరజ్‌పై అంచనాలు పెంచుతోంది. పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌తో కలిసి సింధు పతాకధారిగా పాల్గొంటుంది. టోక్యో రజతం తర్వాత మీరాబాయి చాను వరుస గాయాలతో ఇబ్బంది పడింది. కోలుకున్న తర్వాత కీలక విజయాలతో క్వాలిఫై అయింది. బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్‌గా ఉన్న లవ్లీనా గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాననే నమ్మకంతో ఉంది. భారత హాకీ జట్టు కూడా మరో పతకాన్ని సాధించగలమనే నమ్మకాన్ని పెంచుతోంది. అన్ని రకాలుగా టీమ్ సన్నద్ధమై ఉంది. తొలి పతకం కోసం... కెరీర్లో ఎన్నో ఘనతలు ఉన్నా ఒలింపిక్ పతకం లేని లోటును తీర్చుకునేందుకు మరికొందరు ప్రయతి్నస్తున్నారు. ఈ జాబితాలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్ర స్థానంలో ఉంది. ఢిల్లీలో నిరసనల తర్వాత మళ్లీ ఆటపై దృష్టి పెట్టి ఆమె అర్హత సాధించిన తీరు అసమానం. ఇటీవల మంచి ఫామ్‌లో ఉంది. టోక్యోలో కీలక సమయంలో తుపాకీ మొరాయించడంతో పతకం కోల్పోయిన షూటర్ మను భాకర్ నాటి వైఫల్యాన్ని మరచి తనేంటో చూపించాలని పట్టుదలగా ఉంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న ఆర్చర్ దీపికా కుమారి అన్నీ గెలిచినా కీలక సమయాల్లో ఒలింపిక్స్‌లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఈ సారైనా దానిని దాటి తొలి పతకాన్ని గెలుచుకుంటుందా చూడాలి. ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి అద్భుత ఫామ్ వారు కచ్చితంగా పతకం గెలవగలరనే నమ్మకాన్ని పెంచుతోంది. కొత్త ఆశలతో... వరల్డ్ చాంపియన్ అయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన షూటర్ సిఫ్ట్ కౌర్, ప్రపంచ అండర్–23 చాంపియన్ రెజ్లర్ అమన్ తమ తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమయ్యారు. -
కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ సింగ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్... వైస్ కెప్టెన్‌గా హార్దిక్ సింగ్ వ్యవహరిస్తారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. గోల్‌కీపర్ శ్రీజేశ్, మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడనున్నారు. భారత హాకీ జట్టు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెపె్టన్), హార్దిక్ సింగ్ (వైస్ కెపె్టన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, క్రెయిగ్ ఫుల్టన్ (హెడ్ కోచ్). -
భారత హాకీ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్‌లో బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (41వ ని.లో) ఏకైక గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (44వ, 49వ ని.లో) రెండు గోల్స్ అందించి గెలిపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 3–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
భారత హాకీ జట్టు శిక్షణ బృందంలో ప్యాడీ ఆప్టన్
పారిస్ ఒలింపిక్స్ సమయంలో భారత పురుషుల హాకీ జట్టు సభ్యుల మానసిక దృఢత్వం కోసం... దక్షిణాఫ్రికాకు చెందిన విఖ్యాత మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సేవలు తీసుకోవాలని హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. 2011లో వన్డే ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు ప్యాడీ ఆప్టన్ మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా ఉన్నారు. ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా క్రీడల సమయంలోనూ ఆప్టన్ భారత హాకీ జట్టు వెంబడి ఉన్నారు. -
భారత్‌కు మరో విజయం
రాంచీ: భారత అమ్మాయిల హాకీ జట్టు ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. వందన కటారియా (7, 21వ నిమిషాల్లో) చక్కని ఆటతీరుతో రెండు గోల్స్ చేసింది. సంగీత కుమారి (28వ ని.), లాల్రెమ్సియామి (28వ ని.) క్షణాల వ్యవధిలోనే చెరో గోల్ సాధించిపెట్టారు. మూడో క్వార్టర్లో జ్యోతి (38వ ని.) కూడా గోల్ చేయడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి లీగ్‌లో భారత్ 7–1తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. -
Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ఒలంపిక్స్ బెర్తు ఖరారు
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్ ఒలంపిక్స్-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 22కు చేరింది. సెంచరీ దిశగా భారత్ అదే విధంగా.. ఇప్పటి వరకు 34 వెండి, 39 కాంస్య పతకాలను మన క్రీడాకారులు దేశానికి అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 95 మెడల్స్ సాధించిన భారత్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్లో ఒక పతకం ఖాయం కావడంతో రికార్డు స్థాయిలో కనీసం 101 మెడల్స్ సాధించనుంది. అక్టోబరు 6(శుక్రవారం) నాటి పతకాలు ►మెన్స్ హాకీ: స్వర్ణం ►మెన్స్ బ్రిడ్జ్ టీమ్: రజతం ►మెన్స్ 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: అమన్ సెహ్రావత్- కాంస్యం ►వుమెన్ 76కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: కిరణ్ బిష్ణోయి- కాంస్యం ►వుమెన్ 62కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్: సోనం మాలిక్- కాంస్యం ►సెపాక్‌టక్రా వుమెన్స్ టీమ్: కాంస్యం ►బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్: హెస్ ప్రణయ్‌కు కాంస్యం ►ఆర్చరీ రికర్వ్ మెన్స్ టీమ్: అతాను, ధీరజ్, తుషార్- రజతం ఖాయమైనవి ►ఫైనల్‌కు చేరిన కబడ్డీ పురుషుల జట్టు- స్వర్ణం దిశగా అడుగులు ►ఫైనల్‌కు చేరిన భారత పురుషుల క్రికెట్ జట్టు- స్వర్ణంపై ధీమా తొలిసారి పతకం మహిళల సెపక్‌తక్రాలో తొలిసారి భారత్‌కు పతకం ఆసియా క్రీడల సెపక్తక్రా ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది. మహిళల రెగూ టీమ్ ఈవెంట్లో ఐక్‌పమ్ మైపాక్ దేవి, ఒయినమ్ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్బమ్ ప్రియాదేవి, ఇలాంగ్‌బమ్ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 10–21, 13–21తో ఓడిపోయింది. బ్రిడ్జ్‌లో రజతంతో సరి... గత ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్ క్రీడాంశంలో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత బృందం ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 152–238.1 పాయింట్ల తేడాతో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. సందీప్ ఠక్రాల్, జగ్గీ శివ్‌దసాని, రాజు తొలాని, అజయ్ ప్రభాకర్ రజత పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. రికర్వ్‌లో తొలిసారి రజతం ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత్ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెర పడింది. చివరిసారి 2010 గ్వాంగ్జౌ ఏషియాడ్‌లో రికర్వ్ ఈవెంట్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్‌లతో కూడిన జట్టు రికర్వ్ టీమ్ విభాగంలో భారత్‌కు తొలిసారి రజత పతకం అందించింది. ఫైనల్లో భారత్ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు సిమ్రన్‌జిత్ కౌర్, అంకిత, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కాంస్యం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–2తో జపాన్‌పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. నేడు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం జ్యోతి సురేఖ, కాంస్యం కోసం అదితి... పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్, ఓజస్ ప్రవీణ్ స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడతారు. Indian athletes are on 🔥 Team India beat Japan 5-1 in Asian Games 2022 and won the medal🥇#Asiangames23 #Hockey#PAKvNED #PAKvsNED pic.twitter.com/0kNk3q8EiJ — Saurabh Singh (@100rabhsingh781) October 6, 2023 -
హాకీ ఫైవ్స్ విజేత భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో భారత పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఐదుగురు సభ్యులు ఆడే ఈ టోర్నీని ఈ ఏడాదే ప్రారంభించగా... శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 2–0తో పాకిస్తాన్‌పై గెలిచింది. చాంపియన్‌గా నిలిచిన భారత్ వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. తుదిపోరులో నిర్ణీత సమయంలో రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. భారత జట్టులో మొహమ్మద్ రహీల్ (19వ, 26వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), మణిందర్ సింగ్ (10వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ తరఫున రెహా్మన్ (5వ ని.లో), అబ్దుల్ (13వ ని.లో), హయత్ (14వ ని.లో), అర్షద్ (19వ ని.లో) గోల్ చేశారు. విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షలు చొప్పున, శిక్షణ సహాయక సిబ్బందికి రూ. ఒక లక్ష చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. -
మూడో ర్యాంక్‌లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్‌లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరింది. నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. హాకీ ఇండియా నజరానా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
చెన్నై: గత ఏడేళ్లుగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు చేతిలో ఓటమి ఎరుగని భారత హాకీ జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ (36వ ని.లో), ఆకాశ్‌దీప్ (55వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు రాగా ఇందులో మూడింటిని గోల్స్‌గా మలి చింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో చైనాపై, మలేసియా 1–0తో కొరియాపై నెగ్గాయి. పాక్‌పై విజయంతో ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. 12 పాయింట్లతో మలేసియా రెండో స్థానంలో, 5 పాయింట్లతో దక్షిణ కొరియా, జపాన్, పాకిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో, ఒక పాయింట్‌తో చైనా చివరి స్థానంలో నిలిచాయి. కొరియా, జపాన్, పాక్ ఐదు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరంతో కొరియా, జపాన్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. దాంతో మాజీ చాంపియన్ పాకిస్తాన్ సెమీఫైనల్ చేరలేకపోయింది. శుక్రవారం 5–6 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో చైనాతో పాకిస్తాన్...సెమీఫైనల్స్ లో కొరియాతో మలేసియా; జపాన్‌తో భారత్ ఆడతాయి. -
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్‌కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్‌లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్‌కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా కోచ్‌గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్‌లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన రోలంట్ ఆల్ట్‌మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్‌కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరించారు. -
Hockey World Cup 2023: హతవిధి!.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా
మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 26న జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది. న్యూజిలాండ్‌తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్‌నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10 పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. హోరాహోరీ షూటౌట్... నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్లో గోల్ చేస్తే భారత్‌కు విజయం దక్కేది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్‌కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్లో భారత ప్లేయర్ సుఖ్జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి. -
టీమిండియాకు పరాభవం.. వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమణ
పురుషుల హాకీ వరల్డ్‌కప్-2023 బరిలో నుంచి టీమిండియా నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన హోరాహోరీ క్రాస్ ఓవర్ సమరంలో భారత్ పెనాల్టీ షూటౌట్లో 4-5 (3-3) తేడాతో ఓటమిపాలై క్వార్టర్స్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. క్వార్టర్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిని కొని తెచ్చుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్ తేడాతో సమానంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్ మిస్ చేయడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో తలపడనుంది. కాగా, పూల్-డిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా) నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. రెండో స్థానంలో నిలిచిన భారత్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ డ్రా).. పూల్-సిలో మూడో ప్లేస్ ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టు మలేషియాను 2(4)-2(3) గోల్స్ తేడాతో ఓడించి, ఈ నెల 24న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అర్హత సాధించింది. రేపు జరుగబోయే మరో రెండు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో (జర్మనీ వర్సెస్ ఫ్రాన్స్, అర్జెంటీనా వర్సెస్ దక్షిణ కొరియా) విజేతలు ఈ నెల 25న జరిగే రెండు, మూడు క్వార్టర్ ఫైనల్లలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లతో తలపడతాయి. -
WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి
FIH Men’s Hockey World Cup- భువనేశ్వర్: ప్రపంచ కప్ హకీ టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టును అత్యధిక గోల్స్ తేడాతో ఓడించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒడిశా వేదికగా గురవారం నాటి పూల్ సి మ్యాచ్‌లో భాగంగా చిలీని 14-0తో చిత్తు చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును డచ్ జట్టు బద్దలు కొట్టింది. 2010 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 12-0తో ఓడించింది. కాగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. నెదర్లాండ్స్ ఆటగాళ్లు హ్యాట్రిక్ వీరడు జిప్ జాన్సెస్, డెర్క్ డి విల్డర్, తిజ్స్ వాన్ డ్యామ్, కెప్టెన్ తెర్రీ బ్రింక్‌మన్, టెరెన్స్ పీటర్స్, కొయెన్ బీజెన్, జస్టెన్ బ్లాక్, ట్యూన్ బీన్స్ గోల్స్ సాధించారు. ఇక చిలీపై విజయంతో ఈ ఎడిషన్‌లో క్వార్టర్స్ చేరిన తొలి జట్టుగా నెదర్లాండ్స్ నిలిచింది. The Netherlands are the first team to be qualified for the quarterfinals of the FIH Odisha Hockey Men's World Cup 2023 in Bhubaneswar-Rourkela. Here are some moments from the game. 🇳🇱NED 14-0 CHI🇨🇱 pic.twitter.com/WISn5Vnhqh — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 క్రాస్ ఓవర్’కు భారత్.. ఇక ప్రపంచ కప్ హాకీ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకునే లక్ష్యంతో గురువారం వేల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత్... కనీసం 8 గోల్స్ తేడాతో గెలిస్తే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్ అవసరం లేకుండా నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టే అవకాశం. కానీ భారత జట్టు అంతటి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. బలహీన జట్టే అయినా వేల్స్ బాగా పోటీ ఇచ్చింది. భారత హాకీ జట్టు PC: Hockeyindia Twitter చివరకు 4–2తో గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున షంషేర్ సింగ్ (21వ నిమిషం), ఆకాశ్‌దీప్ సింగ్ (32వ నిమిషం, 45వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషం) గోల్స్ సాధించగా...వేల్స్ ఆటగాళ్లలో ఫర్లాంగ్ గ్యారెత్ (42వ నిమిషం), డ్రేపర్ జాకబ్ (44వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. గ్రూప్ ‘డి’లో ఇంగ్లండ్‌తో సమానంగా 7 పాయింట్లతో నిలిచినా...ఆడిన 2 మ్యాచ్‌లలో కలిపి మెరుగైన గోల్స్ ప్రదర్శన ఆధారంగా (ఇంగ్లండ్ 9, భారత్ 6) మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే.. నిజానికి బలమైన ప్రత్యర్థి కాకపోయినా వేల్స్ ఒక దశలో భారత్‌ను బెంబేలెత్తించింది. మన టీమ్ కూడా అంది వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. 7 పెనాల్టీ కార్నర్లతో పాటు ఆరు సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా మనవాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్లో గోల్స్ నమోదు కాకపోగా, రెండో క్వార్టర్లో ఒక గోల్‌తో భారత్ ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచి వేల్స్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్ తొలి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దానిని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం హర్మన్‌ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్ డిఫెండర్ స్టిక్కు తగిలి రీబౌండ్ అయి రాగా, ఈ సారి షంషేర్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించగలిగాడు. మేం సంతృప్తిగా లేము అమిత్ రోహిదాస్ కూడా సరైన సమయంలో స్పందించడంలో విఫలమయ్యాడు. మూడో క్వార్టర్ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీని అత ను కూడా విఫలం చేశాడు. చివర్లో కాస్త దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి పీల్చుకుంది. ‘ఈ విజయంతో మేం సంతృప్తిగా లేము. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన కాదు. మరింత బాగా ఆడాల్సింది’ అని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు. ఇక ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత్ ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇతర మ్యాచ్‌లలో మలేసియా 3–2తో న్యూజిలాండ్‌పై, ఇంగ్లండ్ 4–0తో స్పెయిన్‌పై విజయం సాధించాయి. చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! సెలక్టర్లకు తలనొప్పి! పాపం గిల్! కిషన్‌తో రోజూ గొడవే.. అందుకే తనని బాగా తిడతా.. అయినా కూడా.. It’s time to celebrate the victory. 🤩🕺🏻#IndiaKaGame #HockeyIndia #HWC2023 #StarsBecomeLegends #HockeyWorldCup #INDvsWAL @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/c1ZqtXbR0Q — Hockey India (@TheHockeyIndia) January 19, 2023 -
ఫైనల్లో ఓటమి.. భారత హాకీ జట్టుకు రజతం
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకం సాధించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో 0-7 తేడాతో భారత్ ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిల్వర్ మెడల్ సాధించింది. తొలి క్వార్టర్ నుంచే భారత్‌పై ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించింది. ఏ దశలోను ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. నాలుగు క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా 7 గోల్స్ సాధించగా.. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా తరపున టామ్ విక్హామ్, బ్లేక్ గోవర్స్, ఫిన్ ఒగిల్వీ, నాథన్ ఎఫ్రామ్స్, నాథన్ ఎఫ్రామ్స్ గోల్స్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా బంగారు పతకం తమ ఖాతాలో వేసుకుంది. కాగా కామన్వెల్త్ గేమ్స్ హాకీలో ఇది ఆస్ట్రేలియాకు ఏడో పతకం కావడం గమనార్హం. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మ్యాచ్‌లు ముగిశాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 పతకాల పట్టికలో 61 మెడల్స్‌తో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 22 గోల్డ్ మెడల్స్,16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
టీమిండియాను వదలని మహమ్మారి.. తాజాగా మరొకరికి పాజిటివ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందాన్ని కరోనా మహమ్మారి వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు ప్లేయర్లు (సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్) మహమ్మారి బారిన పడగా.. తాజాగా మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్ నవ్‌జోత్ కౌర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నవ్‌జోత్‌కు ఇవాళ (జులై 30) ఉదయం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆమెకు మరో రెండు రోజుల్లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని భారత బృందానికి సంబంధించిన అధికారి తెలిపారు. ఒకవేళ అప్పటికీ ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ రాకపోతే కామన్వెల్త్ విలేజ్ నుంచి స్వదేశానికి పయనం కావాల్సి ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడా గ్రామంలో రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూడటం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఓ చోట కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో భాగంగా ఘనాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 5-0 తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం -
జర్మనీ జట్టులో కోవిడ్ కలకలం.. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లు వాయిదా
భువనేశ్వర్: పురుషుల ప్రో హాకీ లీగ్ 2022లో భాగంగా భారత్, జర్మనీ జట్ల మధ్య ఈ వారాంతం జరగాల్సిన డబుల్ హెడర్ మ్యాచ్‌లు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. విజిటర్స్ క్యాంప్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గవర్నింగ్ బాడీ మంగళవారం వెల్లడించింది. భువనేశ్వర్ వేదికగా ఈ మ్యాచ్‌లు మార్చి 12, 13 తేదీల్లో జరగాల్సి ఉండింది. వాయిదాపడ్డ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎఫ్ఐహెచ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రో హాకీ లీగ్ 2022లో భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మహిళల జట్టు ఈ వారాంతంలోనే జర్మనీతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఇరు జట్లు ఇదివరకే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంకు చేరుకున్నాయి. చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్