‘పారిస్’లో మరిన్ని పతకాలపై భారత్ గురి
∙పతాకధారులుగా సింధు, శరత్ కమల్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు గెలుచుకుంది. భారత హాకీ జట్టుతోపాటు వ్యక్తిగత విభాగంలో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, సింధు, లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో కూడా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. గత ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు నెగ్గిన రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ ఈసారి అర్హత సాధించలేదు.
మళ్లీ సత్తా చాటేందుకు...
ఒలింపిక్ స్వర్ణపతకంతో పాటు ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కూడా అయిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో మళ్లీ పతకం సాధిస్తాడని అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. టోక్యో తర్వాత ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వకుండా ప్రధాన ఈవెంట్లలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చి ఎక్కడా వైఫల్యం లేకపోవడం నీరజ్‌పై అంచనాలు పెంచుతోంది. పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌తో కలిసి సింధు పతాకధారిగా పాల్గొంటుంది. టోక్యో రజతం తర్వాత మీరాబాయి చాను వరుస గాయాలతో ఇబ్బంది పడింది. కోలుకున్న తర్వాత కీలక విజయాలతో క్వాలిఫై అయింది. బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్‌గా ఉన్న లవ్లీనా గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాననే నమ్మకంతో ఉంది. భారత హాకీ జట్టు కూడా మరో పతకాన్ని సాధించగలమనే నమ్మకాన్ని పెంచుతోంది. అన్ని రకాలుగా టీమ్ సన్నద్ధమై ఉంది.
తొలి పతకం కోసం...
కెరీర్‌లో ఎన్నో ఘనతలు ఉన్నా ఒలింపిక్ పతకం లేని లోటును తీర్చుకునేందుకు మరికొందరు ప్రయతి్నస్తున్నారు. ఈ జాబితాలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్ర స్థానంలో ఉంది. ఢిల్లీలో నిరసనల తర్వాత మళ్లీ ఆటపై దృష్టి పెట్టి ఆమె అర్హత సాధించిన తీరు అసమానం. ఇటీవల మంచి ఫామ్‌లో ఉంది. టోక్యోలో కీలక సమయంలో తుపాకీ మొరాయించడంతో పతకం కోల్పోయిన షూటర్ మను భాకర్ నాటి వైఫల్యాన్ని మరచి తనేంటో చూపించాలని పట్టుదలగా ఉంది.
వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడుతున్న ఆర్చర్ దీపికా కుమారి అన్నీ గెలిచినా కీలక సమయాల్లో ఒలింపిక్స్‌లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ఈ సారైనా దానిని దాటి తొలి పతకాన్ని గెలుచుకుంటుందా చూడాలి. ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి అద్భుత ఫామ్ వారు కచ్చితంగా పతకం గెలవగలరనే నమ్మకాన్ని పెంచుతోంది.
కొత్త ఆశలతో...
వరల్డ్ చాంపియన్ అయిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన షూటర్ సిఫ్ట్ కౌర్, ప్రపంచ అండర్–23 చాంపియన్ రెజ్లర్ అమన్ తమ తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment