నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం | Paris Paralympic Games 2024 Starts From August 28 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం

Published Wed, Aug 28 2024 11:32 AM | Last Updated on Wed, Aug 28 2024 11:32 AM

Paris Paralympic Games 2024 Starts From August 28

బరిలో 4,400 మంది క్రీడాకారులు

భారత్‌ నుంచి 84 మంది బరిలోకి

పతాకధారులగా సుమిత్‌, భాగ్యశ్రీ

పారిస్‌: యావత్‌ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసిన సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌కు తెరలేవనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారిస్‌ క్రీడల్లో మహిళల విభాగాల్లో మరో 10 మెడల్‌ ఈవెంట్స్‌ను జోడించారు. 

100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరం... ఇప్పుడు పారాలింపిక్స్‌ను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది. పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ క్రీడాంశాల్లో మెడల్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. సమ్మర్‌, వింటర్‌ పారాలింపిక్స్‌లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్‌ స్పెషలిస్ట్‌ ఒక్సానా మాస్టర్స్‌ హ్యాండ్‌ సైక్లింగ్‌లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టగా.. పారాలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్‌ పారా పవర్‌లిఫ్టర్‌ షరీఫ్‌ ఉస్మాన్‌ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్‌ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నాడు.

భారీ అంచనాలతో భారత్‌..
మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పారిస్‌లో అడుగు పెట్టారు. ఈసారి భారత్‌ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్‌ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్‌ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారాలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాధవ్‌ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

గత కొంతకాలంగా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్‌ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్‌ సుమిత్‌ అంటిల్‌, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్‌ పారాలింపిక్‌ చాంపియన్‌లుగా బరిలోకి దిగుతున్నారు. 

చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్‌ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్‌ రోయింగ్‌ ప్లేయర్‌ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement