
ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్‌కు మారనున్న స్టార్ సైక్లిస్ట్
మాతృదేశంపై మమకారంతో..
పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాకు మూడు పతకాలు అందించిన మాథ్యూ రిచర్డ్‌సన్
మెల్‌బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్‌సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు.
ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్‌సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్‌సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం.
అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్‌సన్‌కు స్వాగతం పలికింది.
Comments
Please login to add a commentAdd a comment