చెన్నై: పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్‌లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది.
ఓటమిని రుచి చూసి...
‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్‌గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్‌లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం.
అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది.
Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX
— Prayag (@theprayagtiwari) August 20, 2024
ఆత్మవిశాస్వంతో...
‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్‌లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్‌తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది.
అమ్మ చూపిన దారి...
తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది.
మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది.
సరదాగా ఆడి పాడిన మనూ..
కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment