ఈసారీ గెలిచేద్దాం | Indian hockey team quarter final match against Britain today | Sakshi
Sakshi News home page

ఈసారీ గెలిచేద్దాం

Published Sun, Aug 4 2024 4:26 AM | Last Updated on Sun, Aug 4 2024 4:26 AM

Indian hockey team quarter final match against Britain today

బ్రిటన్‌తో నేడు భారత హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌

‘టోక్యో’లోనూ బ్రిటన్‌ను ఓడించే సెమీస్‌కు చేరిన టీమిండియా  

మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్పోర్ట్స్‌–18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

పారిస్‌: టోక్యో ఒలింపిక్స్‌లో తాము సాధించిన కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవాలంటే భారత జట్టు ముందుగా క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటాలి. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఎదురైన ప్రత్యర్థి బ్రిటన్‌ జట్టుతోనే పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో తలపడనుంది. నేడు జరిగే ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం విజయం సాధిస్తేనే సెమీఫైనల్‌కు చేరుకొని పతకం రేసులో నిలుస్తుంది. ఓడిపోతే మాత్రం టీమిండియా ఇంటిదారి పడుతుంది. ‘టోక్యో’ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–1 గోల్స్‌ తేడాతో బ్రిటన్‌ జట్టును ఓడించింది. 

‘పారిస్‌’ గేమ్స్‌లో భారత హాకీ జట్టు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్‌ ‘బి’లో ఉన్న భారత జట్టు తొలి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3–2తో గెలిచింది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్‌ విజేత అర్జెంటీనాతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2–0తో గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ బెల్జియం జట్టు చేతిలో 1–2తో ఓడిన టీమిండియా చివరి లీగ్‌ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టును 3–2తో ఓడించి సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఆ్రస్టేలియా జట్టుపై 52 ఏళ్ల తర్వాత భారత జట్టు విజయాన్ని అందుకుంది.  

లీగ్‌ దశ మ్యాచ్‌ల ఫలితాలు, ప్రదర్శన ప్రస్తుతం గతంతో సమానం. నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో తప్పనిసరిగా గెలిస్తేనే జట్లు ముందుకు సాగుతాయి. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత బ్రిటన్‌ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బ్రిటన్‌ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా భారత జట్టు ఆద్యంతం నిలకడగా ఆడాల్సి ఉంటుంది. 

గోల్‌ చేసేందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దక్కిన పెనాల్టీ కార్నర్‌లను లక్ష్యానికి చేర్చాలి. అందుబాటులో ఉన్న ముఖాముఖి రికార్డు ప్రకారం భారత్, బ్రిటన్‌ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడ్డాయి. 13 సార్లు బ్రిటన్‌ నెగ్గగా... 9 సార్లు భారత్‌ గెలిచింది. ఒక మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. ఒలింపిక్స్‌లో మాత్రం బ్రిటన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. 

విశ్వ క్రీడల్లో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడగా... ఆరుసార్లు భారత్, మూడుసార్లు బ్రిటన్‌ గెలుపొందాయి. నేడు జరిగే ఇతర మూడు క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్పెయిన్‌తో బెల్జియం; నెదర్లాండ్స్‌తో శ్రీఆ్రస్టేలియా; జర్మనీతో అర్జెంటీనా తలపడతాయి. యాదృచ్చికంగా ‘పారిస్‌’ గేమ్స్‌లోనూ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఎదురెదురుగా తలపడిన జట్లే ఈసారి పోటీపడుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement