'దస్' కా దమ్.. | Indian mens hockey team has shown yet another miracle | Sakshi
Sakshi News home page

'దస్' కా దమ్..

Published Mon, Aug 5 2024 2:59 AM | Last Updated on Mon, Aug 5 2024 8:53 AM

Indian mens hockey team has shown yet another miracle

10 మంది ఆటగాళ్లతో ఆడి క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై విజయం

సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో భారత్‌

‘షూటౌట్‌’లో టీమిండియా పైచేయి 

శ్రీజేశ్‌ అద్భుత గోల్‌ కీపింగ్‌  

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో అద్భుతాన్ని చూపించింది. టోక్యోలో మూడేళ్ల క్రితం నాటి జోరును పునరావృతం చేస్తూ సెమీఫైనల్‌కు చేరింది. అప్పటిలాగే ఈసారి కూడా ప్రత్యర్థి బ్రిటన్‌. నాడు నిర్ణీత సమయంలోనే భారత్‌ విజయం సాధించగా, ఇప్పుడు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ షూటౌట్‌కు చేరింది. 

తుది ఫలితం మాత్రమే సేమ్‌ టు సేమ్‌. భారత ఆటగాళ్లంతా చురుకైన ఆటతో సత్తా చాటగా, ఎప్పటిలాగే గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ అసాధారణ గోల్‌ కీపింగ్‌ జట్టును గెలిపించింది. మూడు క్వార్టర్ల పాటు ఒక ఆటగాడిని కోల్పోయి పది మందితోనే టీమిండియా కొనసాగినా... పదునైన డిఫెన్స్‌తో మన జట్టు ప్రత్యర్థిని  నిలువరించగలిగింది. మరో మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌ చేరితే గత ఒలింపిక్స్‌కంటే మెరుగైన ఫలితంతో భారత్‌ సగర్వంగా నిలుస్తుంది. 

పారిస్‌: ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు ఆశలు రేపుతోంది. స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన మన జట్టు పారిస్‌ఒలింపిక్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్‌’లో బ్రిటన్‌ను ఓడించింది. 

నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... ‘షూటౌట్‌’లో భారత్‌ 4–2తో పైచేయి సాధించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన పోరులో భారత్‌ తరఫున కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22వ నిమిషంలో, బ్రిటన్‌ తరఫున లీ మార్టన్‌ 27వ నిమిషంలో గోల్స్‌ సాధించారు. 

‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్, సుఖ్‌జీత్‌ సింగ్, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యాయ్, రాజ్‌కుమార్‌ గోల్స్‌ చేయగా... బ్రిటన్‌ ఆటగాళ్లలో జేమ్స్‌ ఆల్బరీ, జాక్‌ వలాస్‌ మాత్రమే గోల్స్‌ కొట్టారు. కానర్‌ విలియమ్సన్, ఫిలిప్‌ రాపర్‌ విఫలమయ్యారు. రాపర్‌ గోల్‌ను శ్రీజేశ్‌ అద్భుతంగా నిలువరించిన తర్వాత భారత్‌ 3–2తో ఆధిక్యంలో నిలవగా... నాలుగో షాట్‌ను రాజ్‌కుమార్‌ గోల్‌గా మలచడంతో భారత బృందం సంబరం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో చివరిదైన ఐదో షాట్‌ను బ్రిటన్‌ తీసుకోలేదు. 

జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగే నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో భారత జట్టు మంగళవారం జరిగే సెమీఫైనల్లో తలపడుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో భారత్‌ ఓడిపోతే గురువారం కాంస్య పతకం కోసం పోటీపడుతుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో భారత్‌కు ఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది.  ఆరంభంలో బ్రిటన్‌ చాలా దూకుడుగా ఆడుతూ వరుసగా దాడులు చేసింది. 

తొలి ఐదు నిమిషాల్లోనే ఆ జట్టుకు రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించగా, భారత్‌ వాటిని నిలువరించింది. 11వ నిమిషంలో కూడా బ్రిటన్‌ జట్టు పెనాల్టీ కార్నర్‌ ద్వారా చేసిన ప్రయత్నం వృథా అయింది. భారత్‌ కూడా తొలి క్వార్టర్‌లో రెండు పెనాల్టీలు సంపాదించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో క్వార్టర్‌ కూడా ఇదే తరహాలో సాగింది. అయితే 22వ నిమిషంలో లభించిన పెనాల్టీని హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలచడంతో ఆధిక్యం దక్కింది. 

కానీ మరో ఐదు నిమిషాలకే వేగంగా దూసుకొచ్చిన లీ మార్టన్‌ చేసిన గోల్‌ ప్రయత్నాన్ని కీపర్‌ శ్రీజేశ్‌ ఆపడంలో విఫలం కావడంతో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్‌లో కూడా బ్రిటన్‌కు మూడు పెనాల్టీలు రాగా శ్రీజేశ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు ఇరు జట్లు మరో గోల్‌ కోసం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. 

బెల్జియంకు షాక్‌ 
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ 3–2తో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత బెల్జియం జట్టును బోల్తా కొట్టించింది. తద్వారా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత స్పెయిన్‌ జట్టు మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకుంది.  మూడో క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌ 2–0తో ఆస్ట్రేలియా జట్టును ఓడించి సెమీఫైనల్లో స్పెయిన్‌తో పోరుకు సిద్ధమైంది. 

రోహిదాస్‌కు రెడ్‌ కార్డ్‌ 
మ్యాచ్‌లో జరిగిన ఒక అనూహ్య ఘటన భారత్‌ను మ్యాచ్‌ ఆసాంతం ఇబ్బంది పెట్టింది. 17వ నిమిషంలో భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ స్టిక్‌ బ్రిటన్‌ ఫార్వర్డ్‌ విలియమ్‌ కల్నాన్‌ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్‌ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. 

రోహిదాస్‌కు ‘రెడ్‌ కార్డ్‌’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్‌ మొత్తం భారత్‌ 10 మందితోనే ఆడింది. మిడ్‌ ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ డిఫెండర్‌గా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై భారత జట్టు అప్పీల్‌ చేసింది. దీనిపై వాదనల అనంతరం రోహిదాస్‌ తప్పు చేసినట్లు తేలితే అతనిపై ఒక మ్యాచ్‌ నిషేధం (సెమీఫైనల్‌) పడే అవకాశం ఉంది.  

చివరి వరకు స్కోరును సమంగా ఉంచడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అందుకే పూర్తిగా డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. పది మందితో ఆడటం మ్యాచ్‌లో కఠిన సమయం. కానీ ఏమీ చేయలేం. ఆటగాళ్లంతా సమష్టి ప్రదర్శన కనబర్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఇదే తరహా మానసిక దృఢత్వంతో సెమీస్‌ ఆడతాం. శ్రీజేశ్‌ దిగ్గజం. తొలి మ్యాచ్‌ నుంచి అతను మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. –హర్మన్‌ప్రీత్‌ సింగ్, భారత కెప్టెన్ 


గోల్‌ కీపర్‌గా నా బాధ్యత నెరవేర్చాను. ఈ రోజు భారత్‌కు కలిసొచ్చింది. షూటౌట్‌లో షాట్‌ తీసుకున్న భారత ఆటగాళ్లెవరూ నిరాశపర్చలేదు. వారు స్కోరు చేయడం వల్ల నాలో నమ్మకం మరింత పెరిగింది. మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు ఇది నా ఆఖరి మ్యాచ్‌ కావచ్చు లేదా బాగా ఆడితే మరో రెండు మ్యాచ్‌లు ఆడవచ్చని అనుకున్నాను. సెమీస్‌ ప్రత్యర్థి ఎవరైనా ఇలాగే ఆడతాం.  –పీఆర్‌ శ్రీజేశ్, భారత గోల్‌కీపర్‌


7 ఒలింపిక్స్‌ హాకీలో బ్రిటన్‌ జట్టుపై భారత్‌ గెలుపొందడం ఇది ఏడోసారి. రెండు జట్లు విశ్వ క్రీడల్లో ఇప్పటి వరకు పది సార్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల్లో బ్రిటన్‌ నెగ్గింది. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టుపై బ్రిటన్‌ గెలిచింది.

52 వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌ చేరడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత జట్టు 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌ నుంచి 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌ వరకు కనీసం సెమీఫైనల్‌ దశ దాటింది. 1976 మెక్సికో ఒలింపిక్స్‌లో భారత్‌ గ్రూప్‌ దశలోనే   నిష్క్రమించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement