న్యూఢిల్లీ: స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు ర్యాంక్ కూడా మెరుగైంది. ఆదివారం విడుదల చేసిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఒక స్థానం పురోగతి సాధించి నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది.
హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఖాతాలో 2771.35 పాయింట్లు ఉన్నాయి. 2021 తర్వాత భారత జట్టు మరోసారి మూడో ర్యాంక్‌లో నిలిచింది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరింది.
నెదర్లాండ్స్ జట్టు 3095.90 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, 2917.87 పాయింట్లతో బెల్జియం రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇంగ్లండ్ మూడు నుంచి నాలుగో స్థానానికి చేరగా... జర్మనీ, ఆ్రస్టేలియా వరుసగా ఐదు, ఆరో ర్యాంక్‌ల్లో ఉన్నాయి. తొలిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన మలేసియా జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది.
హాకీ ఇండియా నజరానా
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ బృందంలోని ప్రతి సభ్యుడికి రూ. లక్షా 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment