జాతీయ జట్టులో స్థానం కోసం కఠోర శ్రమ
ఇతర రాష్ట్రాలకు వెళ్లి టర్ఫ్ గ్రౌండ్‌పై ప్రాక్టీస్
అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కసరత్తు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కలి్పస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు..
సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెపె్టన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..
కేరళలో శిక్షణ పొందుతున్నాం.. : భవిష్య, చరిత్ర
మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు.
ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస
సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్‌లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచి్చంది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను.
Comments
Please login to add a commentAdd a comment