ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న భారత్
ఫైనల్లో 1–0తో చైనాపై గెలుపు
ఐదో సారి టైటిల్ కైవసం
పాకిస్తాన్‌కు మూడో స్థానం
డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్టుగానే టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగురవేసిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు చైనాతో తుదిపోరు అందరు అనుకున్నంత సులువుగా సాగలేదు.
భారత్ స్థాయికి ఏమాత్రం సరితూగని చైనా ప్రతి క్వార్టర్‌లోనూ ఊహించని విధంగా ప్రతిఘటించింది. దీంతో భారత్ గోల్ చేసేందుకు ఆఖరి క్వార్టర్ దాకా నిరీక్షించక తప్పలేదు. చివరకు జుగ్‌రాజ్ చేసిన గోల్‌తో టీమిండియా ఏసీటీలో ఓవరాల్‌గా ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
హలుంబుయిర్: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. చైనాలో జరిగిన ఈ ఈవెంట్‌లో పరాజయం ఎరుగని టీమిండియా జైత్రయాత్ర టైటిల్ నిలబెట్టుకునేదాకా అజేయంగా సాగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌షిప్‌ను సాధించింది.
ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఇందులో అత్యధికంగా ఐదుసార్లు భారత్ 2011, 2016, 2018 (పాక్‌తో కలిసి సంయుక్త విజేత), 2023లలో విజేతగా నిలవడం విశేషం. డిఫెండర్ జుగ్‌రాజ్ సింగ్ ఆఖరి క్వార్టర్‌లోని 51వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో గానీ, ఆటతీరులో గానీ సాటిరాని చైనా జట్టు ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేనకు ఊహించని విధంగా పోటీ ఇచ్చింది.
ఈ టోర్నీలో లీగ్ దశ పోటీల్లో 3–0తో చైనా, 5–1తో జపాన్, 8–1తో మలేసియా, 3–1తో కొరియా, 2–1తో పాకిస్తాన్‌లను ఓడించిన భారత్ సెమీస్‌లో 4–1 కొరియాను ఓడించి టైటిల్‌పోరుకు చేరింది. దీంతో సులువైన ప్రత్యర్థి చైనాపై కనీసం రెండు, మూడు గోల్స్ తేడాతో విజయం ఖాయమని విశ్లేషకులు, అభిమానులు భావించారు.
కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. తుదిపోరులో కేవలం ఒకే ఒక్క గోల్ తేడాతో భారత్ గెలిచింది. చైనా డిఫెండర్లు భారత స్ట్రయికర్లను సమర్థంగా నిలువరించారు. దీంతో ఈ టోర్నీలోనే అతి తక్కువ గోల్స్ తేడాతో, భారత్ గెలిచిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం!
మూడు క్వార్టర్ల పాటు...
చైనా డిఫెండర్ల ఆటతీరు భారత ఫార్వర్డ్ లైన్‌కు గోడకట్టినట్లుగా సాగింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థి రక్షణ శ్రేణి భారత సేనను సమర్థవంతంగా నిలువరించింది. భారత్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా చేసిన దాడులన్నీ చైనా ఆటగాళ్ల పోరాటపటిమతో విఫలమయ్యాయి. నిజానికి ఇప్పటివరకు ఎన్నో ఫైనల్స్ ఆడిన చరిత్ర భారత్‌ది కాగా... చైనాకు మాత్రం ఇది రెండో టైటిల్ పోరు. 2006 ఆసియా క్రీడల ఫైనల్లో చైనా 1–3తో కొరియా చేతిలో ఓడింది.
ఫైనల్స్ మ్యాచ్‌ల అనుభవం తక్కువే అయినా ప్రదర్శనతో చైనా ఆకట్టుకుంది. ఆట ఆరంభం నుంచి భారత స్ట్రయికర్లను ఎక్కడికక్కడ నిలువరించడంతో రాజ్ కుమార్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్, నీలకంఠ శర్మ తొలి క్వార్టర్‌లో కొట్టిన టార్గెట్ షాట్లు నిరీ్వర్యమయ్యాయి. రెండో క్వార్టర్‌లోనూ ఇదే ఆటతీరు కొనసాగింది. 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచేందుకు సుఖ్‌జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్‌లు చేసిన ప్రయత్నాల్ని చైనా గోల్‌కీపర్ వాంగ్ వీహావొ చాకచక్యంగా అడ్డుకున్నాడు.
ఎట్టకేలకు ఆఖరి క్వార్టర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వద్దకు వచ్చిన బంతిని నేర్పుగా చైనా డిఫెండర్లను ఏమార్చుతూ డి ఏరియా వద్ద అప్రమత్తంగా ఉన్న జుగ్‌రాజ్‌కు పాస్ చేశాడు. అతను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా
బంతిని గోల్‌పోస్టులోకి తరలించడంతో భారత్ శిబిరం ఎట్టకేలకు సంబరాల్లో మునిగింది. వర్గీకరణ పోరులో పాకిస్తాన్ 5–2తో కొరియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది.
వైఎస్ జగన్ ప్రశంస: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment