చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది.
ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్‌ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది.
ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment