Asian Games: జపాన్‌ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ఒలంపిక్స్‌ బెర్తు ఖరారు | Asian Games: Indian Men Hockey Team Won Gold Seal Paris Olympics Spot | Sakshi
Sakshi News home page

Asian Games: జపాన్‌ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ప్యారిస్‌ ఒలంపిక్స్‌ బెర్తు ఖరారు

Published Fri, Oct 6 2023 5:41 PM | Last Updated on Fri, Oct 13 2023 1:35 PM

Asian Games: Indian Men Hockey Team Won Gold Seal Paris Olympics Spot - Sakshi

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. చైనాలోని హోంగ్జూలో శుక్రవారం నాటి ఫైనల్లో జపాన్‌ను చిత్తు చేసింది. 5-1తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణ పతకం సాధించింది. అద్భుత విజయంతో ప్యారిస్‌ ఒలంపిక్స్‌-2024 టోర్నీ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా పతకంతో 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 22కు చేరింది.

సెంచరీ దిశగా భారత్‌
అదే విధంగా.. ఇప్పటి వరకు 34 వెండి, 39 కాంస్య పతకాలను మన క్రీడాకారులు దేశానికి అందించారు. ఇప్పటి వరకు మొత్తంగా 95 మెడల్స్‌ సాధించిన భారత్‌ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఆర్చరీలో ఇంకో మూడు, కబడ్డీలో రెండు, క్రికెట్‌లో ఒక పతకం ఖాయం కావడంతో  రికార్డు స్థాయిలో కనీసం 101 మెడల్స్‌ సాధించనుంది.

అక్టోబరు 6(శుక్రవారం) నాటి పతకాలు
►మెన్స్‌ హాకీ: స్వర్ణం
►మెన్స్‌ బ్రిడ్జ్‌ టీమ్‌: రజతం
►మెన్స్‌ 57 కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌: అమన్‌ సెహ్రావత్‌- కాంస్యం
►వుమెన్‌ 76కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌: కిరణ్‌ బిష్ణోయి- కాంస్యం
►వుమెన్‌ 62కేజీ ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌: సోనం మాలిక్‌- కాంస్యం
►సెపాక్‌టక్రా వుమెన్స్‌ టీమ్‌: కాంస్యం
►బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌: హెస్‌ ప్రణయ్‌కు కాంస్యం
►ఆర్చరీ రికర్వ్‌ మెన్స్‌ టీమ్‌: అతాను, ధీరజ్‌, తుషార్‌- రజతం

ఖాయమైనవి
►ఫైనల్‌కు చేరిన కబడ్డీ పురుషుల జట్టు- స్వర్ణం దిశగా అడుగులు
►ఫైనల్‌కు చేరిన భారత పురుషుల క్రికెట్‌ జట్టు- స్వర్ణంపై ధీమా

తొలిసారి పతకం
మహిళల సెపక్‌తక్రాలో తొలిసారి భారత్‌కు పతకం ఆసియా క్రీడల సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళల జట్టు తొలిసారి పతకంతో తిరిగి వస్తోంది. మహిళల రెగూ టీమ్‌ ఈవెంట్‌లో ఐక్‌పమ్‌ మైపాక్‌ దేవి, ఒయినమ్‌ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్‌బమ్‌ ప్రియాదేవి, ఇలాంగ్‌బమ్‌ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 10–21, 13–21తో ఓడిపోయింది.

బ్రిడ్జ్‌లో రజతంతో సరి...
గత ఆసియా క్రీడల్లో బ్రిడ్జ్‌ క్రీడాంశంలో ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత బృందం ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హాంగ్జౌలో శుక్రవారం జరిగిన పురుషుల టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత్‌ 152–238.1 పాయింట్ల తేడాతో హాంకాంగ్‌ చేతిలో ఓడిపోయింది. సందీప్‌ ఠక్రాల్, జగ్గీ శివ్‌దసాని, రాజు తొలాని, అజయ్‌ ప్రభాకర్‌ రజత పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.

రికర్వ్‌లో తొలిసారి రజతం 
ఆసియా క్రీడల ఆర్చరీ రికర్వ్‌ విభాగంలో భారత్‌ 13 ఏళ్ల పతక నిరీక్షణకు హాంగ్జౌలో తెర పడింది. చివరిసారి 2010 గ్వాంగ్‌జౌ ఏషియాడ్‌లో రికర్వ్‌ ఈవెంట్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు లభించాయి. ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. తాజా ఏషియాడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్‌లతో కూడిన జట్టు రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు తొలిసారి రజత పతకం అందించింది.

ఫైనల్లో భారత్‌ 1–5తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో 5–4తో మంగోలియాపై, సెమీఫైనల్లో 5–3తో బంగ్లాదేశ్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది. మరోవైపు సిమ్రన్‌జిత్‌ కౌర్, అంకిత, భజన్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్‌ జట్టు కాంస్యం గెలిచింది.

కాంస్య పతక మ్యాచ్‌లో భారత్‌ 6–2తో వియత్నాంపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 6–2తో జపాన్‌పై గెలిచి, సెమీఫైనల్లో 2–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. నేడు కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం జ్యోతి సురేఖ, కాంస్యం కోసం అదితి... పురుషుల వ్యక్తిగత విభాగంలో అభిషేక్, ఓజస్‌ ప్రవీణ్‌ స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement